శా॥ ఇట్టెట్టెందును బోవరాక వగతో నెల్లప్పుడు న్వేలుపుల్
వెట్టింగొట్టము సేయ మత్తిలి వడిన్విన్నేటి తాల్పున్న యా
గట్టున్ బిట్టు పెకల్చి, రావణుడనంగామీఱి రాకాసి పెం
బట్టంబేలె నతండు,తమ్ముగవ యెప్పట్లం దనుం గొల్వగన్
ఈ అచ్చ తెనుగు పద్యం పొన్నగంటి తెలగనార్యుడు రచించిన యయాతి చరిత్ర లోనిది. యయాతికి జాబాలి రామాయణ కథ చెబుతున్న సందర్భంలోనిది ఈ పద్యం. రావణుని భుజ బలానికి ఇటూ అటూ ఎటూ వెళ్లలేక వేల్పులు పనిచేస్తుండగా బల గర్వంతో మిన్నేటి తాలుపు (ఆకాశగంగ)ను ధరించిన వాని (శంకరుని) కొండను అనగా కైలాసమును దృఢంగా పెకిలించి రావణుడని పేరు పొంది తన తమ్ములు సేవిస్తుండగా రాక్షస సింహాసనాన్ని పాలించాడు. ఇదీ పద్య భావం. లంకేశ్వరుడు కైలాస పర్వతం పెకలించి తన ఇరవై చేతులు దాని కింద పడి నలిగి గొప్పగా ధ్వని చేశాడు.
అప్పటి నుంచి అతనికి రావణుడు (పెద్దనైన రవము గలవాడు) అనే పేరు వచ్చింది. కాగా, పుట్టగానే పెద్దగా రోదించడంతో రావణుడనే పేరు వచ్చిందని మరొక ఐతిహ్యం. తెలుగులో మొదటి అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర. రచయిత తెలగనార్యుడు క్రీ.శ 16వ శతాబ్దం కుతుబ్ షాహీల కాలం నాటి కవి. ఎలాంటి సంస్కృత పదాలు లేకుండా కేవలం స్వచ్ఛమైన అచ్చ తెలుగు పదాలు మాత్రమే వాడి పొన్నగంటి తెలగన్న ఈ కావ్యం రచించాడు.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ