Rama Navami | సకలగుణాభిరాముడు, మాటకు కట్టుబడినవాడు, ఏకపత్నీవ్రతుడు, కష్టాలను నిబ్బరంగా దాటినవాడు, శరణు కోరిన వారికి అండగా నిలిచినవాడు… ఆ రాముడిని తలుచుకుని, కొలుచుకుని, తన విలువల బాటను ఆదర్శంగా మార్చుకునేందుకే ఈ ప్రయత్నం.
అనారోగ్యమో, ఆర్థిక సంక్షోభమో… ఒకరి జీవితంలో తీవ్రమైన కష్టం వచ్చింది. అంతే! ఈ గండం గడిస్తే చాలు ఎలాంటి పొరపాట్లూ చేయకుండా జీవిస్తాను, జీవితం పట్ల కృతజ్ఞతగా ఉంటాను, మరింతవినయంగా ప్రవర్తిస్తాను, నా బలహీనతలను జయించి, బలాలను పెంచుకుని జీవితానికి ఓ విలువ తెచ్చుకుంటాను.. ఇలా రకరకాల వాగ్దానాలతో ఇకపై తన బతుకును మెరుగుపర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ, రోజులు గడిచేకొద్దీ, కష్టాన్ని దాటే కొద్దీ… తన మాటలు తనే మర్చిపోతాడు. మళ్లీ అవే లోపాలు, డాంబికాలు, పొరపాట్లు! ఎందుకంటే తను మామూలు మనిషి కనుక. కష్టం వచ్చినప్పుడు కుంగిపోతూ, అది దాటి సుఖంలో పడగానే పొంగిపోతూ సంసారసాగరంలో మునకలు వేసే ఇంద్రియజీవి కనుక. వీటికి అతీతంగా అనుక్షణం విచక్షణతో మెలిగినవారే మనీషిగా మిగులుతారు. అలా ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు జవాబుగా నిలుస్తాడు రాముడు. ఆ మర్యాదాపురుషోత్తముడిని తలుచుకోవడానికి రామనవమిని మించిన సందర్భం ఏముంటుంది?
రాముడు చారిత్రక పురుషుడా కాదా? రామసేతును నిర్మించడానికి తనేమైనా ఇంజినీరా? ఇంతకీ నిజంగానే రాముడికి సీత ఏమవుతుంది? చెట్టు చాటు నుంచి వాలిని కూల్చినవాడు దేవుడెలా అవుతాడు?… ఇవన్నీ హేతువాదుల సందేహాలు! కానీ రాముణ్ని నమ్మేవారి మనసులో ఉన్నవాడు… సకలగుణాభిరాముడు, మాటకు కట్టుబడినవాడు, ఏకపత్నీవ్రతుడు, కష్టాలను నిబ్బరంగా దాటినవాడు, శరణు కోరిన వారికి అండగా నిలిచినవాడు… ఆ రాముడిని తలుచుకుని, కొలుచుకుని, తన విలువల బాటను ఆదర్శంగా మార్చుకునేందుకే ఈ ప్రయత్నం. ఇంతకీ తన ప్రత్యేకత ఏంటి అన్న ప్రశ్నకు రామాయణంలో ప్రతి మజిలీలోనూ అద్భుతమైన లక్షణాలు కనిపిస్తాయి.
లేకలేక కలిగిన రాముడు… దశరథ మందిరంలో సకల సంపదలు సుఖాల మధ్య పెరిగాడు. అన్ని శాస్ర్తాలనూ ఆపోశన పట్టాడు. ఇక తనకు పెళ్లి చేద్దామని దశరథుడు అనుకునే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. మారీచసుబాహులనే రాక్షసుల బారినుంచి యజ్ఞాన్ని కాపాడేందుకు రాముడిని తన వెంట పంపమన్నాడు. ఆ మాటలు విన్న దశరథుడి గుండె పగిలింది. కావాలంటే నేను నా చతురంగబలాలతో యుద్ధానికి వస్తానని భరోసా ఇస్తాడు, రాముడు ఇంకా బాలుడనీ కపటయుద్ధం చేతకానివాడనీ వాపోతాడు. కానీ రాముడు మారు మాట్లాడకుండా గురువును అనుసరించాడు. అది తనకు తొలి వనవాసం. అడవిలో తిరిగాడు, అలములు తిన్నాడు, గడ్డి మీద పడుకున్నాడు. దారిపొడవునా విశ్వామిత్రుడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఈ సందర్భమే కాదు… రాముని జీవితం అంతా సవాళ్లను స్వీకరించడమే కనిపిస్తుంది. సీతా స్వయంవరం నుంచి రామసేతు నిర్మాణం వరకు ప్రతి సవాలుకూ సిద్ధపడ్డాడు, వాటిని తన ఎదుగుదలకు అనుగుణంగా మలుచుకున్నాడు
ఎదుటివాడు మనల్ని అవమానించడానికి వచ్చాడు, యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. తన మాటలు, చేష్టలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అందులోనూ అరివీరభయంకరుడు, రాకుమారుడు అయినవాడు అభిమానంతో ఎలా స్పందిస్తాడు? కానీ రాముడు అలా కాదు! వీరత్వానికి సైతం సందర్భం ఉంటుందనే విచక్షణ ఉన్నవాడు. అందుకు పరశురాముడితో తన ముఖాముఖి గురించే చెప్పుకోవాలి. రాముడు శివధనుస్సును విరిచాడన్న కోపంతో పరశురాముడు దశరథుడి కోటకు వస్తాడు. తను చూసేందుకు దాటరాని కైలాస పర్వతంలా, సహించలేని కాలాగ్నిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. పరశురాముడు కోపంలో విశ్వామిత్రుడు, దశరథుడితో అవమానకరంగా మాట్లాడతాడు. అందుకు తన తండ్రి బదులు ఇస్తున్నంత సేపూ రాముడు మారు మాట్లాడకుండా ఉంటాడు. జవాబు చెప్పాల్సిన అవకాశం వచ్చిన తర్వాత ‘మీ మాటలన్నీ విన్నాను సరే… ఇప్పుడు మీరు నా తేజస్సు, పరాక్రమం చూడాల్సిందే’ అంటూ పరశురాముడి చేతి నుంచి విష్ణు ధనుస్సును అందుకుని దాన్ని కూడా ఎక్కుపెట్టి చూపిస్తాడు.
మంధర మాట విన్న కైకేయి, రామ పట్టాభిషేకాన్ని నిలుపు చేయించింది. పైగా రాముడి అరణ్యవాసానికి పట్టుబట్టింది. అది విన్న దశరథుడు కుప్పకూలాడు కానీ, రాముడు మాత్రం తొట్రుపడలేదు. పైగా ఆ వార్త చెప్పిన కైకతో ‘ఓస్ ఇంతే కదా! ఈ విషయాన్ని నాతో చెబితే నేనే భరతుడికి సింహాసనాన్ని ఇచ్చేవాడిని కదా! నాన్నగారితో చెప్పించే ప్రయత్నం చేసి, ఆయన్ని ఎందుకు బాధపెట్టారు?’ అని అడుగుతాడు. వనవాసం గురించి తెలుసుకుని బాధలో మునిగిపోయిన తల్లి కౌసల్యనీ, పగతో రగిలిన లక్ష్మణుడినీ శాంతింపచేస్తాడు. ఆ సమయంలో వారిద్దరితో రాముడు అన్న మాటలు ఏ కౌన్సిలింగ్కీ తీసిపోవు. ఇక అడవులకు తన వెంట వచ్చేందుకు సిద్ధపడిన సీతమ్మను అక్కడ ఉండే కష్టాలన్నీ వర్ణిస్తూ వారిస్తాడు. అడవిలో కూడా తను సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాట్లు చేయబోతే నారచీరలు తప్ప ఇంకేమీ అక్కర్లేదని వారిస్తాడు. చేసిన తప్పునకు కుమిలిపోయిన దశరథుడు ఇంకొక్క రోజు తమతో గడపమని, రాజభోగాలు అనుభవించి వెళ్లమని వేడుకున్నా… ‘ఈ భోగాలు ఒక్కరోజు అనుభవిస్తే తృప్తి కలిగించేవి కాదు. మళ్లీమళ్లీ కావాలనిపిస్తాయి’ అంటూ అప్పటికప్పుడే బయల్దేరతాడు. కానీ, ఇంత కష్టానికీ తాను సిద్ధపడింది, కేవలం తండ్రి మాట కోసమే! ‘తల్లిదండ్రులూ, గురువుని మించిన దైవం లేదు. వారిని నిర్లక్ష్యం చేసి ఇతర దేవతకు పూజలు చేసి ఉపయోగమూ లేదు. అందుకే నా తండ్రి మాట జవదాటక అరణ్యవాసానికి వెళ్తున్నాను’ అని సీతతో అంటాడు రాముడు. పైగా నేను అడవికి వెళ్లాక, ఆ దుఃఖం ఆయన ప్రాణాల మీదికి తెస్తుంది కాబట్టి ఆయనను జాగ్రత్తగా కనిపెట్టుకోమని తల్లితో చెబుతాడు. కాలానికి అనుగుణంగా సమాజం ఏర్పరుచుకున్న ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలో ఆచరించి చూపిస్తాడు.
రాముడి అరణ్యవాసం గురించి తెలుసుకున్న భరతుడు మండిపడతాడు. తల్లికి బుద్ధి చెప్పి, రాముణ్ని తిరిగి తెచ్చి పట్టాభిషేకం చేస్తానంటూ బయల్దేరతాడు. అలా బయల్దేరిన భరతుడి వెంట లక్షల మంది పరివారం ఏనుగులు, రథాలు, అశ్వాల మీద వచ్చారు. ఆ జన సమూహాన్ని చూస్తుంటే మహాసముద్రం పొంగుతున్నట్టు ఉందట! అడవిలో ఉన్న రామలక్ష్మణులకు ఈ కోలాహలం వినిపించింది. అదేమిటో తెలుసుకుందామని చెట్టెక్కి చూసిన లక్ష్మణుడి కళ్లు చింతనిప్పులయ్యాయి. ‘భరతుడు మనల్ని చంపడానికే సైన్యంతో వస్తున్నాడు. నేను ముందు తనను చంపి నిన్ను రాజును చేస్తాను’ అంటూ తొందరపడతాడు. ఆ సైన్యాన్నీ, కోలాహలాన్నీ చూసిన ఎవరికైనా అనుమానం కోపం రావడం సహజం. కానీ అక్కడ ఉన్నది రాముడు. అందుకే ‘అన్నదమ్ములను చంపి తీసుకునే రాజ్యం నాకు విషంతో సమానం. ఒకవేళ నేను రాజ్యాన్నే కోరుకుంటే, అది మీ అందరితో కలిసి ఉండటానికే. అయినా భరతుడి గురించి మనకు తెలియదా! మనం వనవాసం చేస్తున్నామని తెలిసి, తనతోపాటు తీసుకువెళ్లడానికే వస్తున్నాడేమో!’ అంటూ లక్ష్మణుడి అనుమానానికి అడ్డుకట్ట వేస్తాడు. తను ఊహించినట్టుగానే క్షేమం కోరి వచ్చిన భరతుడికి పాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తాడు.
రామ-హనుమల మధ్య సఖ్యత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. కానీ దానికి బీజం ఎలా పడిందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. సీతమ్మను వెతుక్కుంటూ కిష్కింధలో అడుగుపెట్టిన రామలక్ష్మణులను చూసి, వారి చెంతకు వెళ్తాడు హనుమంతుడు. సుగ్రీవుడి రాయబారిగా తనను తాను పరిచయం చేసుకుంటూ వారి పరిచయాన్ని కోరతాడు. హనుమను చూసిన ఆ క్షణంలోనే తనను అద్భుతంగా అంచనా వేస్తాడు రాముడు. ఆ కాస్త సంభాషణలోనే ‘హనుమంతుడు నాలుగువేదాలు చదివిన జ్ఞాని కాబట్టే తన వ్యాకరణంలో కానీ, ఉచ్చారణలో కానీ ఎలాంటి అపశ్రుతి దొర్లలేదని. తన కనుబొమలు, నుదురు మొదలుకొని శరీరంలోని ఏ అవయవంలోనూ దోషం కనిపించడం లేదు. తన వాక్యాలు మరీ సుదీర్ఘంగా కానీ, అలాగని అసంపూర్ణంగా కానీ లేవు. స్వరం మరీ హెచ్చుగానో, గొణుగుతున్నట్టుగానో కాకుండా మధ్యస్థంగా ఉంది. ఉచ్చారణలో తొందరపాటు లేదు.’ అంటూ పలురకాలుగా హనుమను అంచనా వేస్తాడు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణమిదే. అవతలి వ్యక్తి ఎలాంటి వాడు, ఎందులో సమర్థుడు, తన బలాబలాలు ఏమిటి, తనను ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ఎంతవరకు నమ్మవచ్చు అంటూ ఒకే ఒక్క సంబాషణతో, సందర్భంతో అంచనా వేయగలగాలి. ఆ లక్షణం రాముడిలో అడుగడుగునా కనిపిస్తుంది.
రాముడు మృదుస్వభావి. ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడని మర్యాదాపురుషోత్తముడు. శత్రువును సైతం గౌరవించేవాడు. లోకం ఇలాంటి లక్షణాలను బలహీనతగా భావిస్తుందని తనకు తెలుసు. మారీచసుబాహులతో పాటుగా వేలమంది రాక్షసులను కూల్చినా, శివధనుస్సును విరిచినా, సకల అస్త్రశస్ర్తాల మీద పట్టు సాధించినా… వాటిని లోకం విస్మరిస్తుందని తనకు ఎరుకే! కానీ ఒకరిని భయపెట్టేందుకు తన పరాక్రమంతో అహంకరించలేదు. అవసరమైనప్పుడు కోపాన్నీ, బలాన్నీ దాచలేదు. సీతమ్మ జాడ కానరానప్పుడు ‘నా సీత దక్కకపోతే ముల్లోకాలలోనూ ప్రళయం సృష్టిస్తాను. నా మృదు స్వభావాన్ని బలహీనతగా భావించేవారికి నా పరాక్రమం చూపిస్తాన’ని గర్జిస్తాడు. ఆ సమయంలో ప్రళయకాల రుద్రుడిలా ఉన్న రాముడిని చూసి లక్ష్మణుడే భయపడిపోయాడట. మరో సందర్భంలో రాముడి సాయంతో వాలిని వధించిన సుగ్రీవుడు, సీతమ్మను వెతికేందుకు సాయపడతానని చెబుతాడు కానీ… రాజభోగాల మధ్య ఇచ్చిన మాట మర్చిపోతాడు. సుగ్రీవుడికి కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకు రాముడి పనుపున లక్ష్మణుడు వెళ్తాడు. ‘యుద్ధంలో నేను విల్లును లాగి వదిలే శబ్దాన్ని వినాలనుకోవద్దు; వాలి వెళ్లిన మార్గం ఇంకా మూసుకోలేదు, నువ్వు కూడా అదే మార్గంలోకి వెళ్లాలని ప్రయత్నించకు; ధర్మం తప్పాడని వాలిని ఒక్కడినే చంపాను. కానీ, ఇచ్చిన మాట తప్పితే నీ బంధువులు సహా నిన్ను వధిస్తాను’ అంటూ హెచ్చరికలను జారీచేస్తాడు. ఇక రామరావణ యుద్ధ సమయంలో తన పరాక్రమం గురించి ఏం చెప్పగలం!
చాలామంది సీత అనే పేరే పెట్టుకోవడానికి ఆలోచిస్తారు. ఆ పేరుతో తనలాంటి కష్టాలే వస్తాయని అనుకుంటారు. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే… తనలో అసమాన ధీరత్వం కనిపిస్తుంది. అసలు రావణుడి మీద పగ తీర్చుకోవడానికే తను జన్మించిందనీ, తను లేనిదే రామాయణం లేదనీ చాలామంది వాదన. ఆ పూర్వ వృత్తాంతాలను పక్కన పెట్టినా, తను లేనిదే రావణసంహారం లేదు కదా! కోటలోనే ఉండే అవకాశం ఉన్నా… కష్టాలలో తన సహచరుడికి అండగా ఉండేందుకు అడవి ఒడిలో అడుగుపెట్టింది. గీత దాటితే కష్టం రావచ్చని తెలిసినా… దాని పర్యవసానాలకు సిద్ధపడే తెగువ తనది. ముల్లోకాలను గడగడలాడించే రావణుడు తన ఎదుట నిలిస్తే… గడ్డిపోచ చూపించిన ధైర్యం తనది. లంకకు చేరిన హనుమంతుడితో తిరిగి వెళ్లే అవకాశం ఉన్నా, తన భర్తనే వచ్చి తీసుకువెళ్లమని చెప్పిన అభిమానవంతురాలు. ఇంతచేసినా తిరిగి తనను అడవులపాలు చేసినప్పుడు కుంగిపోలేదు సరికదా, తన కొడుకులను రాముడినే ఎదిరించేంత వీరులుగా తీర్చిదిద్దింది. ఆ పిల్లలు తనవాళ్లే అని తెలిసిన రాముడు అయోధ్యకు తిరిగి రమ్మన్నప్పుడు, కాదనగల ఆత్మాభిమానం ఆమె సొంతం. అంతదాకా ఎందుకు? శివధనుస్సు ఎత్తగల ధీరురాలు అని గ్రహించే కదా, జనకుడు అదే ధనుస్సును ఎక్కపెట్టమంటూ స్వయంవరంలో సవాలు విసిరింది?
ప్రతి పండుగా భిన్న ప్రాంతాల్లో విభిన్నంగా జరుగుతుంది. శ్రీరామనవమి కూడా అంతే! చలువ పందిళ్లు, రథయాత్రలు, రామకథాగానం, ప్రత్యేక పూజలు, మంటపాలు… అన్నిచోట్లా కనిపించేవే. కానీ సీతారామకల్యాణం మాత్రం తెలుగునాటే అందులోనూ భద్రాచలంలోనే ప్రశస్తంగా జరుగుతుంది. రాముడు నడయాడిన దండకారణ్యంలో భాగం భద్రాచలం. పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని సీతమ్మతో వనవాసాన్ని గడిపింది అక్కడే. శబరిని అనుగ్రహించి నదిగాను, భద్రుని కరుణించి కొండగాను అమరత్వం కల్పించిన చోటూ అదే. అక్కడ వెలసిన సీతారామచంద్రస్వామి విగ్రహాలకు భవ్యమైన మందిరాన్ని నిర్మించేందుకు కంచర్ల గోపన్న చేసిన కృషి తెలియంది ఎవరికి? పన్నెండేళ్ల పాటు చెరసాలలో ఉన్నా… తన కష్టాలకు బాధపడుతూ, రాముడిని నిందాస్తుతి చేస్తూ… ఆ ప్రయాణంలో రామదాసుగా మారిన తన కీర్తనలు విని పరవశించనిది ఎవరు? గోపన్న భద్రాచలంలో కేవలం ధూపదీప నైవేద్యాలకు మాత్రమే ఏర్పాట్లు చేయలేదు. ఏటా సీతారామకల్యాణం ఘనంగా జరిగేందుకు తగిన కైంకర్యాలనూ అందించాడు. జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు… ఇలా అచ్చ తెలుగునాట జరిగే పెళ్లిలాగానే భద్రాచలంలో కల్యాణం
జరుగుతుంది.
తన ఎదురుగా ఉన్న వ్యక్తి భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తించడం రాముడి ప్రత్యేకత. కోపంలో ఉన్న లక్ష్మణుడిని శాంతింపచేసినా, దుఖంతో తల్లడిల్లిన భరతుడిని ఊరడించినా, తన దగ్గరికి వచ్చిన గుహుడిని అనునయించినా… తన మాటకు సాటి లేదు. అందుకు వాలితో జరిగిన సంభాషణే సాక్ష్యం. రాముడి బాణానికి కుప్పకూలిన వాలి, అధర్మంగా తనను చంపాడంటూ వాపోతాడు. అందుకు రాముడు ‘తమ్ముడు, కుమారుడు, శిష్యుడు… ఈ ముగ్గురినీ కూడా కొడుకులుగానే భావించాలి. అలాంటి నీ తమ్ముడి భార్య తారను, కోడలు వరసయ్యే రుమను చెరపట్టావు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు కాబట్టి నిన్ను చంపడం తప్పు కాదు’ అని చెప్పుకొస్తాడు.
రాముడు పొరపాట్లు చేయలేదా అంటే లేకేం. ఎంతైనా మానవరూపంలో ఉన్నాడు కదా. అందుకే లోకకల్యాణం కోసమైనా పొరపాటు చేసినా, అలా చేయకుండా ఉండాల్సిందని ఒప్పుకొంటాడు కూడా! అందుకు శూర్పణఖ వృత్తాంతమే నిదర్శనం. రాముడిని చూసి మోహించిన శూర్పణఖను చూసి కాసేపు ఆటపట్టిద్దాం అనుకుంటారు రామలక్ష్మణులు. తనకు భార్య ఉంది కాబట్టి లక్ష్మణుడిని పెళ్లి చేసుకోమని రాముడు, నీలాంటి అందగత్తె కోసం రాముడు భార్యను వదులుకుంటాడులే అని లక్ష్మణుడు… ఇద్దరూ అన్న మాటలకు ఉబ్బిపోయిన శూర్పణఖ, ఏకంగా సీతమ్మ మీదనే దాడి చేయబోతుంది. అదంతా చూసిన రాముడు ‘దుర్మార్గులతో పరిహాసం చేయకూడదు. లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి’ అని లక్ష్మణుడితో అంటాడు.
రాముడికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్న దశరథుడు, ఆ విషయాన్ని సభలో ప్రకటించి వారి అభిప్రాయాన్ని అడుగుతాడు. ‘నా మాటను కాదనలేకో, నన్ను ఎదిరించడం ఇష్టం లేకో కాకుండా… మీరు నిజంగానే రాముడిని రాజుగా కోరుకుంటున్నారా?’ అని అడుగుతాడు. అందుకు పౌరులంతా ఏకగ్రీవంగా రామరాజ్యాన్ని కోరుకుంటారు. రాజ్యాన్ని నిలబెట్టుకోగలిగే తెలివీ పరాక్రమం తనకు ఉన్నాయనీ, మనిషిలో మృదుత్వం ఉన్నా నిర్ణయాలకు కట్టుబడి ఉంటాడనీ, రాజ్యంలో ఎవరికి దుఃఖం కలిగినా తనకే ఆ కష్టం వచ్చినట్టు… ఎవరు ఆనందించినా తన బిడ్డలే సంతోషపడినట్టు భావిస్తాడనీ చెప్పుకొస్తారు. ఓ నాయకుడికి ఇంతకంటే గొప్ప లక్షణాలు మరేం కావాలి!
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా రామలక్ష్మణుల మధ్య సోదరభావం ఎంత గాఢంగా ఉండేదో మనకు తెలియంది కాదు. లక్ష్మణుడు.. రాముడిని అనుసరించినట్టు కనిపించినా… తనను అంతే అభిమానంతో గమనించుకున్నాడు రాముడు. ‘లక్ష్మణుడు పక్కన లేకపోతే శ్రీరాముడు నిద్రపోయేవాడే కాదు. తను లేకుండా మంచి ఆహారం కూడా తీసుకునేవాడే కాదు’ అంటుంది బాలకాండ. తమ్ముడి మాట ఎందుకు వినాలనే భేషజం కూడా రాముడిలో కనిపించదు. సీతమ్మ అపహరణ సమయంలో, లక్ష్మణుడి కర్తవ్య బోధే రాముణ్ని ముందుకు కదిలేలా చేసింది.
ఇవేనా రాముడి ప్రత్యేకతలు! ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయి. రావణుడితో యుద్ధ సమయంలో వ్యూహకర్తగా, శరణన్న విభీషణుడిని అక్కున చేర్చుకున్న శరణాగతవత్సలుడిగా, వానరులు అని తక్కువగా చూడకుండా ఆ సైన్యంతోనే రాక్షస సంహారం చేసిన రాజనీతిజ్ఞుడిగా, సీతమ్మ కోసం విలపించిన ప్రేమికుడిగా… రామపాదం కదిలిన ప్రతిచోటూ ఓ అద్భుతమైన ఆదర్శం కనిపిస్తుంది. వాటిని పాటించినవారికి తన ఆశీస్సూ లభిస్తుంది.