Ramaayanam |మా సొంత నానమ్మ పేరు ఆండాళమ్మ. మా ఇంట్లో ఉండే నానమ్మ.. మా నానమ్మకు చెల్లెలు. నాన్నకు చిన్నమ్మ. ఆమె మాతోనే ఉండటం వల్లనో ఏమో.. మాకు మా సొంత నానమ్మతోకన్నా చిన్న నానమ్మతోనే చనువు ఎక్కువగా ఉండేది. మమ్మల్ని ఎంతో బాగా చూసేది.
అలా అని మా అసలు నానమ్మను తప్పు పట్టడానికేమీ లేదు. ఆమెకు మాతో కలిపి పదకొండు మంది మనవరాళ్లు, పదమూడు మంది మనవలు. మరి ఇంతమంది ఒకేసారి ఎండకాలంలో తప్ప కలిసేవాళ్లం కాదు. అప్పుడు మా ఆటలు మావే కదా! మాతో ప్రత్యేకమైన సంభాషణలేవీ తనకు ఉండేవి కావు. అయితే, మా నానమ్మ మంచి మాటకారి అనీ, తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువనీ అందరూ చెప్పేవారు. ఆమెకు తనను అమ్మమ్మ అనో, నాయనమ్మ అనో పిలవడం ఇష్టం ఉండేది కాదట. మా కజిన్స్లో అందరికంటే పెద్దదైన లచ్చక్కతో నాయనమ్మ తొలిసారిగా ‘ఇంకో అమ్మ’ అని పిలిపించుకుందట. ఇక ఆ పేరే స్థిరపడిపోయింది.
నాకు పదమూడేళ్లు ఉన్నప్పుడు ఓరోజు బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. నాన్న, అమ్మ ఆందోళనగా ఉన్నారు. కాసేపటికి మా ఇంటి ముందు ఓ జీప్ వచ్చి ఆగింది. అందులోంచి నానమ్మను నలుగురు మోసుకొచ్చి.. ఇంటి మధ్యలో ఉన్న గచ్చుమీద గడ్డి పరిచి పడుకోబెట్టారు. తన వెంటే ఉన్న మా నానమ్మ, ఊర్లోనే ఉండి అప్పుడే వచ్చిన మా అత్తయ్య ఏడవడం మొదలుపెట్టారు. మా లచ్చక్క దగ్గర ఓ వారం రోజులు ఉండి వద్దామని హనుమకొండ వెళ్లిన నానమ్మ.. అక్కడ విరోచనాలు, వాంతులతో డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందనే విషయం తెలిసింది. ఈలోగా నాన్న.. మా మిగతా అత్తయ్యలకు, కూనూరులో ఉన్న చిన్నాయనలకు, ఇంకా దగ్గరి బంధువులకు విషయం తెలపడానికి కొందరు మనుషులను పంపడం, మిగతా ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయాడు.
మర్నాడు తెల్లవారుతూనే ఊర్లోని జనంతో మా ఇల్లూ, వాకిలి నిండిపోయింది. ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఏడవడం, మరికొందరు ఓదార్చడం చూస్తూ ఉండిపోయాను. నాకెందుకో ఏడుపు రాలేదు. పైగా కొందర్ని చూస్తే నవ్వొచ్చింది కూడా. పెద్దవాళ్లు చూస్తే తిడతారని ఆపుకొన్నాను. పిల్లలమంతా బిక్కుబిక్కుమని ఓ పక్కగా నిలబడి వచ్చిపోయేవాళ్లను చూడటం మొదలుపెట్టాం.
“ఏమైందటనవ్వా?! ఎట్ల సచ్చిపోయిందట?!” అప్పుడే ఒకామె జనాన్ని తోసుకుంటూ వచ్చి పక్కామెను అడిగింది.
“మనువరాలి కాడికి ఒరంగలు పొయ్యిందట. గాడ కక్కుడు ఏర్గుడు పెట్టి దవకానల శరీకు చేసేటాలకు పానం పొయ్యిందంట. నాత్తిరి ఈడికి ఏసుకొచ్చిన్రట!” జవాబు చెప్పింది ఇవతలామె.
“ఎట్ల ఏసుకొచ్చిన్రు?! బండ్లెనా, జీపులనా, కారు గిట్ల ఒచ్చిందా?!”
“ఎమ్మో ! నాత్తిరి అయితె జీపు సప్పుడు లెక్కనె ఇనబడ్డది”
“మన దొర ఈడ అమ్మమ్మోల్ల ఇంటికి పెంపుకం గద! మరి గీ దొరసానిని వాళ్లూరికి ఏస్కపోక గీడికి ఎందుకు తీస్కచ్చిర్రు?!” ఇంకొకామె.
“ఎహె! మన దొరే పెద్ద కొడుకాయె! అయిన సుత గిది గామెకు అవ్వగారి ఇల్లేనాయె! పెద్దోల్ల ముచ్చెట్లు మనకెందుకు తియ్యి”.. ఇలాంటి మాటలెన్నో వినిపించి ఆశ్చర్యం కలిగింది.
ఇంకా కొందరైతే.. “గా సచ్చిపోయినామెకు నువ్వు ఏమైతవు?! ఏ ఊర్లె ఉంటరు మీరు?! గా ఎర్ర శీరె గట్టుకున్నామె మీ శెల్లెనా?! ఏ ఊరికిచ్చిన్రు?! మీరెడికెల్లి ఒచ్చిన్రు?!”.. ఇట్లా మా బంధువులను రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూలు చేశారు. నానమ్మ కోసం ఏడుస్తున్న మా మేనత్తలను కూడా ఈ ప్రశ్నల వాళ్లు వదల్లేదు.
ఇంతలో పెద్దగా ఏడుస్తూ శేషయ్యగారి తల్లి బావండ్ల లక్ష్మమ్మ గారు వచ్చింది. ఆమె ఎప్పుడూ బోడిగుండుతోనే ఉండేది. అప్పట్లో బ్రాహ్మణుల్లో కొందరు మగవాళ్లకు అమ్మాయిలు దొరక్కపోతే.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను డబ్బిచ్చి కొనుక్కువచ్చి పెళ్లి చేసుకునేవారట. ఈమెనూ వీళ్ల అత్తవారు అలాగే కొనుక్కొచ్చుకున్నారని అమ్మ చెప్పిందోసారి. ఆమె మా నానమ్మలిద్దరికీ స్నేహితురాలు. వస్తూనే పెద్ద గొంతుతో అందరూ జడుసుకునేలా.. “ఆండాళ్లూ! ఎంత పని జేసినవే! ఒక్కమాట నాతోటి చెప్పితె నేను కూడా నీ వెనుకే వస్తును గాదె!” అంటూ రాగాలు పెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది. దాంతో అప్పటిదాకా కొద్దో గొప్పో ఏడుస్తున్న వాళ్లంతా స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్‌తో ఆమె ఏడుస్తుంటే.. సైలెంట్ అయిపోయి ఊపిరి తీసుకున్నారు.
ఓ మూడు నిమిషాలపాటు విధవిధాలుగా ఏడ్చాక ఆమె దృష్టి మా చిన్న నానమ్మ మీద పడింది.
“అయ్యో! అక్క పోయినాదే వేదా!” అని నానమ్మకు ఊపిరాడకుండా గట్టిగా కౌగలించుకుని ఏడ్చింది. వెంటనే.. “అసలు మంచిగున్న ఆండాళ్లు పోవుడు ఏంది?! ఇది (మా చిన్న నానమ్మ) ఉండుడేంది?! ఇదే చస్తదనుకున్న.. ఏ బాయిల్నో, బొందల్నో పడి ఇదే పోతదనిపిచ్చేది. ఇదే చావనుండె! అండమ్మ ఉండేదుండె..” ఇలా మా నానమ్మను చూస్తూ ఆమె ఏడుస్తూ మాట్లాడుతుంటే.. ‘ఈమెవరు? నానమ్మ చచ్చిపోవాలని అంటుంది!’ అని నాకూ, అక్కకూ పట్టరాని కోపం వచ్చింది. నానమ్మకు ఫిట్స్ వచ్చేవి. నిద్ర సరిగా లేనపుడో, బాగా అలసి పోయినపుడో ఫిట్స్ వచ్చి.. కింద పడిపోయి కొట్టుకునేది. కాసేపటికి తేరుకున్నాక ఓ రెండ్రోజులపాటు బాగా సుస్తీగా ఉండేది. అది వేరే విషయం. అంత మాత్రాన చచ్చిపోవాలా?!
ఆ తరువాత ఓ రెండ్రోజులకు.. “దాని పాడె! తప్పిచ్చుకోను వీలులేకుండ మొస మళ్లకుండ నన్ను గట్టిగ కాగలిచ్చుకొని ఏడుస్తుంటె.. దాని నోరంత వాసనే! నన్ను చచ్చి పొమ్మంటదేంది?! ఇదేమన్న యమధర్మరాజు చెల్లెనా?!” అని మా నానమ్మ అనడం విన్నాను. ఆమె ఏడుపు ఆమ్దైతే.. మా మా కజిన్ సరస్వతక్క ఏడుపు ఇంకో తీరు. ఆ రోజుల్లోనే ఆరిందాలా ఉండే మా సరస్వతక్క ఏడుపు సంగతి.. వచ్చేవారం!
– నెల్లుట్ల రమాదేవి,
రచయిత్రి