జీవితం ఓ ప్రయాణం అంటారు. ఈ యాత్రలో మనిషి ఎన్నో అనుభవాలను పోగు చేసుకుంటాడు. ఎన్నో మజిలీలను చేరుకుంటాడు. కష్టనష్టాలకు, వ్యయప్రయాసలకు ఓర్చుకుంటాడు. ఆనంద క్షణాలను ఆస్వాదిస్తాడు. అలా జీవితం అంటే నల్లేరు మీద బండి నడక అనే సామెత అందరికీ వర్తించదు. జీవితం కలిమిలేములతో చెట్టపట్టాలు వేసుకుని నడుస్తుంటుంది. ఈ విషయాన్నే జిల్లేళ్ళ బాలాజీ రాసిన ‘జీవితమొక పయనం…’ నవల కళ్లకు కడుతుంది. ఇప్పటివరకు కథలు, అనువాద సాహిత్యానికి పరిమితమైన బాలాజీకి ఇది తొలి నవల కావడం విశేషం.
ఇందులో ప్రధాన పాత్ర రాఘవ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్తాడు. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెడతాడు. తల్లిదండ్రుల మరణం, నమ్మినవాళ్లు మోసం చేయడంతో చివరికి పాల వ్యాపారంలో దిగుతాడు. అయితే, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మమార్గంలోనే బతుకు వెళ్లదీస్తాడు. అలా రాఘవ పాత్ర పాఠకులకు ఓ స్ఫూర్తిదాయకమైనదిగా కనిపిస్తుంది. 1990వ దశకం నేపథ్యంలో సాగే ఈ నవల… ‘పరిస్థితులతో సర్దుబాటు అయ్యేవాడికి సమస్యలేవీ రావు. ఒకవేళ ఒకటీ అరా వచ్చినా ఎదుర్కోవాలే కానీ దాన్ని సమస్యగా భావించకూడదు’ అనే సందేశాన్ని ఇస్తుంది.
రచన: జిల్లేళ్ళ బాలాజీ
పేజీలు: 248; ధర: రూ. 300
ప్రచురణ: పార్వతీవిశ్వం
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఘనం.. పీవీ వనం వంద వేర్ల మొక్క!
శతావరి తీగ జాతి మొక్క. ఒకటి నుంచి రెండు మీటర్ల పొడవు ఉంటుంది. సన్నని ముళ్లు ఉంటాయి. శతావరి అంటే నూరు వ్యాధుల్ని నయం చేస్తుందని అర్థం. వంద వేర్లు కలిగినదని మరో అర్థం. దీని వేర్లు సన్నగా, దృఢంగా ఉంటాయి. అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేద ఔషధాల తయారీలో శతావరి ముఖ్యమైన ధాతువు.
ఈ మొక్క మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ సులభంగా పెరుగుతుంది. ఇసుక, బంకమట్టి, రాతి, కంకర నేలలపై పెరుగుతుంది. జూన్, జూలై నెలల్లో గంట ఆకారంలో తెల్లని, లేత గులాబీ రంగులో పూలు పూస్తాయి. మంచి వాసన కలిగి ఉంటాయి. గుండ్రని పలకల ఆకారంలో చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఆకులు సూది ఆకారంలో, పచ్చగా ఉంటాయి. పేరుకు తగ్గట్లుగా అనేక అనారోగ్య సమస్యల నివారిణి. హార్మోన్ల క్రమబద్ధీకరణ, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం, నైరాశ్యం నుంచి ఉపశమనం కలిగించడం వంటి అద్భుతమైన మందుల తయారీలో ఈ వేరుపొడిని ఉపయోగిస్తారు. వంద వ్యాధుల నివారిణి అయిన ఈ శతావరిలో ఫైటో కెమికల్స్, మాంగనీస్, రాగి, జింక్, పొటాషియం, క్యాల్షియం వంటి ఆరోగ్య పోషక ఖనిజాలు ఉంటాయి. అస్పరాగస్ కుటుంబానికి చెందిన ఈ ఔషధ మొక్కను నేను దశాబ్దం క్రితం హిమాలయ యాత్రలో రుద్రప్రయాగ నుంచి తీసుకువచ్చాను. ఇప్పటికీ అది మా ఇంట్లో ఉంది.
ఆయుర్వేదంలో శతావరిని ‘ఔషధ మొక్కల రాణి’ అంటారు. ఇందులో సాపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. ఇవి అనేక రుగ్మతల నుంచి స్వస్థత చేకూరుస్తాయి. స్త్రీల గర్భాశయ సంబంధమైన అనేక రకాల వ్యాధుల నివారణ కోసం శతావరిని ఆయుర్వేద వైద్యులు ఔషధంగా ఉపయోగిస్తారు. పురుషుల్లో వీర్యకణాల పెంపు కోసం కూడా దీనిని వినియోగిస్తారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు
బుక్ షెల్ఫ్
వారధి
రచన: కటుకోజ్వల మనోహరాచారి
పేజీలు: 123;
ధర: రూ. 150
ప్రచురణ:
సాయి ఉత్పల
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్
ఫోన్: 94410 23599
మళ్లీ మనిషిలోకి..
రచన: డా. ఉదారి నారాయణ
పేజీలు: 136;
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
ఫోన్: 98487 87284
లవ్… టెన్స్
రచన: విజయలక్ష్మి వెంకట్
పేజీలు: 100; ధర: రూ. 300
ప్రచురణ: కవి పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413