జీవన యానంలో ప్రతి మనిషికీ తనకంటూ ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఆత్మకథ అంటే జీవితం మొత్తానికి అక్షర రూపం ఇవ్వాల్సి ఉంటుంది. అదే జ్ఞాపకాలైతే అవి మంచివైనా, చేదువైనా… ముఖ్యమైన వాటికే పెద్దపీట వేయాలి. అయితే వీటిని అక్షరీకరించడంలో మాత్రం నిజాయతీగా ఉండాలి. ఏమాత్రం భేషజాలకు పోకూడదు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ వారాల ఆనంద్ తాను జన్మించిన 1958 సంవత్సరం మొదలుకుని 2014 వరకు తన జీవితంతో పెనవేసుకున్న సంఘటనలను ‘యాదోంకీ బారాత్’ పేరుతో అక్షరబద్ధం చేశారు.
కరీంనగర్ పట్టణంలో తాను పుట్టి పెరిగిన మిఠాయి దుకాణం వాతావరణం మొదలుకుని, 2014 వరకు పోగు చేసుకున్న అపురూపమైన జ్ఞాపకాలను ఇందులో పేర్కొన్నారు. ఈ పుస్తకం చదివితే ఆనంద్ జీవితంతో పెనవేసుకున్న సాహిత్య, సామాజిక, సాంస్కృతిక చరిత్ర అవగతమవుతుంది. రచయిత చెప్పినట్టు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అంటే గతాన్ని నెమరువేసుకోవడం మాత్రమే కాదు.. తిరిగి జీవించడం కూడా!
రచన: వారాల ఆనంద్
పేజీలు: 272; ధర: రూ. 250
ప్రచురణ: ప్రోజ్ పోయెట్రీ ఫోరం
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94405 01281
శేషాచలం కొండలు అంటే తిరుమల వేంకటేశ్వర స్వామి, అందమైన తలకోన జలపాతాలు మాత్రమే కాదు.. ఎర్రచందనం అడవులూ గుర్తుకువస్తాయి. ఈ భూమ్మీదనే అరుదైన వృక్ష సంపద ఈ అడవుల సొంతం. ఈ చెట్ల దుంగలకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్. అందుకే ఎర్రచందనం దుంగలు, వాటిని సుదూర తీరాలకు చేర్చే దొంగలకు వార్తల్లో ప్రముఖంగా చోటు దక్కుతుంది. ఇంతటి విలువైన చెట్ల చుట్టూ అల్లుకున్న సాలెగూడును కళ్లకు కడుతూ ‘రక్తచందనం’ పేరుతో డా॥ వి.ఆర్.రాసాని నవలను రచించారు.
ఈ నవల ఎర్రచందనం కోసం సాగే క్రీడలో సామాన్యులు ఎలా సమిధలవుతున్నారో ఆర్ద్రంగా వివరిస్తుంది. రోజురోజుకూ ఒక్క ఎర్రచందనం అనే కాదు, మానవ అభివృద్ధి క్రమంలో మొత్తం అటవీ సంపదే తరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో రాసాని రాసిన ఈ నవల ‘చెట్లకే రక్తం ఉంటే… మొత్తం భూమండలమే నెత్తుటి సముద్రమై పోతుందేమో’ అనే ప్రశ్నను పాఠకుల మస్తిష్కాల్లో రేకెత్తిస్తుంది.
రచన: డా॥ వి.ఆర్.రాసాని
పేజీలు: 116, ధర: రూ. 150
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98484 43610