బాల్యం తొలిదశలో దీర్ఘకాలంపాటు నిద్రలేమితో బాధపడే పిల్లలు పెద్దయ్యాక మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధకులు ఈ అధ్యయనాన్ని ఆరు నెలలు మొదలుకుని ఏడు సంవత్సరాల వయసు పిల్లల రాత్రి నిద్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.
వీరిలో బాల్యంలో ఎక్కువకాలం పాటు తగినంత నిద్రపోని పిల్లలు పెద్దయ్యాక మతిభ్రమించే ముప్పు రెండు రెట్లు ఎక్కువని కనుక్కొన్నారు. కాబట్టి, పిల్లలు నిద్రలేమితో బాధపడుతుంటే గనుక తల్లిదండ్రులు ఆ సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలని ఈ అధ్యయనం సూచించింది.
పరీక్షలకు చదువుతున్నప్పుడు విద్యార్థులు ముఖ్యంగా టీనేజీ వాళ్లు రాత్రుళ్లు నిద్రరాకుండా ఉండటానికి టీ, కాఫీల్లాంటి కెఫీన్ ఉన్న పానీయాలను ఆరారగా తాగేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా చదువుతున్నారని మురిసిపోతారే తప్ప, ఎంత మోతాదులో తాగుతున్నారన్నది గమనించరు. అయితే, టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లాంటి కెఫిన్ ఉండే పానీయాల విషయంలో పరిమితి ఉండాలని ఓ అధ్యయనం పేర్కొంది.
కెఫిన్ వినియోగం విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించింది. టీనేజీ పిల్లలు కెఫిన్‌ను రోజుకు 100 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదని నిపుణుల సలహా. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు కెఫిన్ దుష్ప్రభావాల గురించి వివరించాలి. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా కెఫిన్ లేని పానీయాలు అలవాటు చేయాలి.
ఇప్పుడు ఇండ్లలో వేపుళ్లు, చపాతీలు లాంటివి వండుకోవడానికి నాన్‌స్టిక్ పాత్రలే ఎక్కువగా వాడుతున్నారు. అయితే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) నాన్‌స్టిక్ పాత్రల వినియోగం మీద ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రల విషయంలో. వీటిని ఉపయోగించడం, శుభ్రపర్చుకోవడం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
ఒక్కసారి కోటింగ్ చెరిగిపోయిందంటే వంట సమయంలో నాన్‌స్టిక్ పాత్రలు టాక్సిన్లు విడుదల చేస్తాయి. ఈ టాక్సిన్లను పీలిస్తే శ్వాస సమస్యలు, థైరాయిడ్ పనితీరులో సమస్యలు, కొన్నిసార్లు క్యాన్సర్‌కు దారితీయొచ్చట. ఇక ఐసీఎంఆర్ ప్రకారం నాన్‌స్టిక్ పాత్రల్లో మితమైన వేడితో వంటచేయాలి. ఖాళీ పాత్రలను వేడిచేయకూడదు. వాటిలో కొంచెం నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. ఇక కోటింగ్ చెరిగిపోయిన వాటిని అసలే వాడకూడదు. నాన్‌స్టిక్ కంటే స్టెయిన్లెస్ స్టీలు, పోత ఇనుము, సిరామిక్ వంటపాత్రలు మంచిదని ఐసీఎంఆర్ తెలిపింది.