నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై చిన్నది ప్రియాంక అరుళ్ మోహన్. అమాయకంగా చూస్తూనే ప్రేక్షకులను మాయచేసింది. తర్వాత ‘శ్రీకారం’ సినిమాలో బబ్లీ గాళ్‌గా తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. తెలుగుతోపాటు తమిళంలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకున్నది. తాజాగా ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మరోసారి తెరముందుకు వచ్చింది. త్వరలో పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’లోనూ నాయికగానూ సందడి చేయనున్న ప్రియాంక చెప్పిన కబుర్లు ఇవి..
నేను కలిసి పనిచేసిన హీరోలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వాళ్ల అనుభవం, అంకితభావం, సినిమాపై వాళ్లకున్న ప్యాషన్ నన్నెంతో ప్రభావితం చేశాయి. నటులు శివకార్తికేయన్, నాని, శర్వానంద్ తదితరులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ‘ఓజీ’లో పవన్‌కళ్యాణ్ సరసన చేస్తున్నా. ఆయన పక్కన నన్ను నేను చూసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా!
షూటింగ్స్ లేనప్పుడు కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తా! స్నేహితులతో కాలక్షేపం చేయడం ఇష్టం. పుస్తకాలు బాగా చదువుతాను. బుక్ రీడింగ్ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే ట్రావెలింగ్ అన్నా ఇష్టమే! కొత్తకొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు వంట చేసి రిలాక్స్ అవుతుంటాను.
చిన్నప్పటి నుంచి నాకు నటనంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తున్నప్పుడు.. నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుంటానా అనిపించేది. నాతోపాటు ఆ ఇష్టం కూడా పెరిగింది. బయో టెక్నాలజీలో డిగ్రీ చేశానన్న మాటే కానీ, నా మనసంతా సినిమాలపైనే ఉండేది. అందుకే, ఇలా డిగ్రీ పూర్తవ్వగానే.. అలా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను.
క న్నడ చిత్రసీమ నుంచి వెండితెరకు పరిచయమయ్యా. 2019లో విడుదలైన ‘ఒంధ్ కథే హెళ్లా’ నా మొదటి సినిమా. ఆ చిత్రం విడుదలైన రోజు నా కల నిజమైంది. మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యా. నరాలు తెగేంత ఉత్కంఠకు లోనయ్యా. చిత్ర యూనిట్ మద్దతుతో ఒత్తిడిని అధిగమించా. ఆ సినిమా షూటింగ్ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను.
‘గ్యాం గ్లీడర్’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే, పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తాను. కథ బాగుండటమే కాదు, అందులో నా పాత్రకూ ప్రాధాన్యం ఉంటేనే ఓకే చెప్తా. సవాలు విసిరే రోల్స్ నాకు ఇష్టం. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించినప్పుడే.. నటిగా గుర్తింపు సాధ్యమవుతుంది. ప్రేక్షకులను మెప్పించి, సినీ ప్రపంచంలో చెరగని ముద్రవేసే కథల్లో భాగం కావాలని కోరుకుంటున్నా! అలాగే యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో నటించాలని ఉంది. వినోదంతోపాటు స్ఫూర్తిదాయక చిత్రాలు కూడా చేయాలని ఉంది.
సినీ పరిశ్రమ పుష్పక విమానం లాంటిది. ఎందరు వచ్చినా.. మరొకరికి ఇక్కడ చోటు ఉంటుంది. ఒక్కో రాష్ర్టానికీ ఒక్కో సినీ పరిశ్రమ ఉంది. నటులకు మాత్రం అన్ని పరిశ్రమలూ ఒకటే! వివిధ భాషల్లో నటించడం.. నటనలో పరిపూర్ణతకు దోహదం చేస్తుంది. ప్రతి భాషకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. పదాల ఉచ్చారణ, భావోద్వేగాలు డిఫరెంట్‌గా ఉంటాయి. నిత్య విద్యార్థిగా పరిశ్రమిస్తేనే.. వాటిపై పట్టు సాధించగలం. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక కొత్త అంశం నేర్చుకుంటాను.