Pragya Jaiswal | ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’తో తెలుగువారికి దగ్గరైంది. ‘అఖండ’ చిత్రంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల మరోసారి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘అఖండ 2’లోనూ చాన్స్ కొట్టేసిన ఉత్తరాది ముద్దుగుమ్మ ప్రగ్యా పంచుకున్న కబుర్లు..
2015లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ జర్నీలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాను. సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గొప్ప సినిమాల్లో భాగమయ్యాను.
హీరో బాలకృష్ణ గారితో వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. కొవిడ్ సమయంలో బోయపాటి శ్రీను ‘అఖండ’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అది ఘనవిజయం సాధించడంతో నా కెరీర్ మరో స్థాయికి చేరింది. ‘అఖండ-2’లోనూ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా!
అఖండ తర్వాత హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా చేశాను. ఏడుగురు పెద్ద నటులతో కలిసి చేసిన ఆ చిత్ర నిర్మాణానికి చాలా సమయం పట్టింది. దాంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది. అంతేగానీ, మరే కారణం లేదు. ఎక్కువ భాషల్లో, ఎక్కువ సినిమాల్లో నటించాలన్నదే నా తపన.
‘కంచె’ చేసినప్పటి నుంచీ నాకు పీరియాడిక్ సినిమాలపై మమకారం పెరిగింది. చారిత్రక కథల్లో నటించాలని ఉంది. రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ తదితర అగ్ర దర్శకులు సృష్టిస్తున్న లోకాల్లో భాగం కావాలని ఉంది. యాక్షన్ ప్రధానంగా సాగే కథల్లోనూ నేను బాగా ఒదిగిపోతాననే నమ్మకం ఉంది. సమంత చేసిన ‘సిటాడెల్: హనీ బన్నీ’తోపాటు, ‘వండర్ ఉమెన్’ తరహా పాత్రల్లోనూ నటించాలని ఉంది.
నా కెరీర్లో గ్లామర్‌గా కనిపించే పాత్రలే ఎక్కువగా చేశా. కానీ, ‘డాకు మహారాజ్’లో కావేరి పాత్ర పూర్తిగా భిన్నమైంది. మేకప్, లిప్‌స్టిక్ సహా అన్నీ తీసేసి కెమెరా ముందుకు వచ్చేదాన్ని. అయినా, ఇంకా ఎక్కడైనా గ్లామర్‌గా కనిపిస్తానేమో అని డైరెక్టర్ బాబీ మొహానికి మట్టి రాసుకోమనేవారు. నేనూ అలాగే చేసేదాన్ని.
ప్రస్తుతం సినిమా తీరు చాలా మారింది. మహిళలు బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. కథను భుజాలపై మోస్తున్నారు. చాలా ఏళ్ల కిందటే అనుష్క ‘అరుంధతి’ చేశారు. ఓటీటీ వేదికలు వచ్చాక కథానాయికల పాత్రలు మరింత బలం పుంజుకున్నాయి.
నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ జీవనశైలి భలేగా ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీ తెగ నచ్చుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటా! కొత్త ప్రదేశాలను సందర్శిస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ట్రావెలింగ్తోపాటు డ్యాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టం.