సాధారణ ఫొటోగ్రఫీ.. ‘సబ్జెక్ట్’ను ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. అయితే, వీక్షకుడి దృష్టికోణాన్ని బట్టి.. ఒక్కోశైలిలో ఒక్కోరకమైన తేడా కనిపిస్తుంది. అయితే, ‘పర్స్పెక్టివ్ ప్లే’ ఫొటోగ్రఫీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇది.. ఉన్నది లేనట్టు-లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. మానవ కంటికి సాధారణంగా కనిపించే వస్తువులను కూడా.. అసాధారణంగా చూపిస్తుంది. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే.. ఈ పర్స్పెక్టివ్ మాయాజాలాన్ని సులభంగా ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం!
‘పర్స్పెక్టివ్ ప్లే’ ఫొటోగ్రఫీలో ఫోకల్ లెంగ్త్ కీలకంగా వ్యవహరిస్తుంది. కెమెరా నుంచి సబ్జెక్ట్‌ను వ్యూహాత్మక దూరంలో ఉంచి, ఫోకల్ లెంగ్త్‌ను సర్దుబాటు చేయడం ద్వారా.. విభిన్నమైన ఫొటోలను తీసే అవకాశం ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ నిజమైన పరిమాణం (సైజు) కన్నా.. పెద్దవిగా లేదా చిన్నవిగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బొమ్మ కారును ‘పర్స్పెక్టివ్ ప్లే’ ఫొటోగ్రఫీ ద్వారా నిజమైన కారులా భ్రమింపజేయవచ్చు. ఓ వ్యక్తి సూర్యుడిని చేతితో పట్టుకున్నట్టుగా.. ప్రఖ్యాత కట్టడాలను చేతిలోకి తీసుకున్నట్టుగానూ చూపించవచ్చు.
* కెమెరా యాంగిల్ : సబ్జెక్ట్‌ను కిందనుంచి పైకి (లో యాంగిల్), పైనుంచి కిందికి (హై యాంగిల్)లో ఎంచుకోండి
* ఫోర్‌గ్రౌండ్-బ్యాక్‌గ్రౌండ్ : ఒక వస్తువు (సబ్జెక్ట్) దగ్గరగా, మరొకటి దూరంగా ఉండేలా చూసుకోవాలి.
* గ్రిడ్లైన్స్ ఆన్ : కాంపోజిషన్ కచ్చితంగా ఉండేందుకు గ్రిడ్లైన్స్ను ఉపయోగించండి
మాన్యువల్ ఫోకస్ : ప్రధాన సబ్జెక్ట్‌పై ఫోకస్ లాక్ చేసి.. సబ్జెక్ట్ విభిన్నంగా కనిపించేలా ఫోకల్ లెంగ్త్‌ను అడ్జస్ట్ చేస్తూ ఫొటోలు తీయండి. ఔట్పుట్ బాగాలేకుంటే.. చిన్నచిన్న మార్పులతో మరిన్ని ఫొటోలు తీసి, బాగున్నదాన్ని ఎంచుకోండి.
సాయంసంధ్యలో సూర్యుడిని చేతితో పట్టుకునేలా (క్రియేటివ్ టైమింగ్), ఒక వ్యక్తి వాటర్ బాటిల్లో ఉన్నట్టుగా (రిఫ్లెక్టివ్ పర్స్పెక్టివ్), గుట్టలను కాళ్లతో తొక్కేస్తున్నట్టుగా (మినీయేచర్ ఎఫెక్ట్), బాటిల్ మూతతో సూర్యుణ్ని మూసేసినట్లు చూపించడం (హ్యూమర్ + ఐడియా), భవనాలు, ప్రఖ్యాత కట్టడాలను చేతితో ఎత్తినట్టు చూపించడం (డిఫార్మ్డ్ పర్స్పెక్టివ్).
సూచనలు-సలహాలు : మంచి ఆలోచనలతోనే మంచి ఫొటోలు వస్తాయి. అందుకే, ఎలా క్యాప్చర్ చేస్తే.. సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందో గమనించండి. షట్టర్ నొక్కడానికి ముందే.. సబ్జెక్ట్‌ను ఎలా ఫొటో తీయాలని అనుకుంటున్నారో ఓ అవగాహనకు రావాలి. హడావుడిగా ఫొటోలు తీయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోండి.
చివరగా.. పర్స్పెక్టివ్ ప్లే ఫొటోగ్రఫీ అనేది మీ ఊహాశక్తికి పరీక్ష. మీ కళ్లకు సాధారణంగా కనిపించే దృశ్యాన్ని.. వీక్షకులకు వింతగా, విచిత్రంగా చూపించే శక్తి.. ఈ ఫొటోగ్రఫీ శైలికి ఉంది. మీ మొబైల్ ఫోన్ ద్వారానే.. ఇలాంటి టెక్నిక్స్‌ను ట్రిక్స్‌ను ప్రయత్నించవచ్చు. చిన్నచిన్న యాంగిల్స్, ఫోకల్ లెంగ్త్‌ను మార్చుకుంటూ.. పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయండి.