సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఏదైనా సంతోషం, బాధ, కోపం ఏది వచ్చినా.. వెంటనే ఫోన్ తీసి పోస్ట్ చేసేస్తున్నాం. మనసు గదికి సోషల్ మీడియాను విండోగా మార్చేసి, దాన్ని నిరంతరం తెరిచే ఉంచుతున్నాం. అందుకే దీనిని టెక్నాలజీ పరిభాషలో ‘వెంటింగ్’గా పిలుస్తున్నారు. అంటే.. సోషల్ మీడియాలో ఏదైనా పబ్లిక్ చేయడం.. ప్రతి విషయాన్ని బయటికి చెప్పుకోవడం.. వ్యక్తిగత సమస్యలు, పని ఒత్తిళ్లు, సంబంధాలలోని విభేదాలు, ఏదైనా సంస్థపై కోపం.. ఇలాంటి వాటి గురించి చాలామంది సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెలిబుచ్చుతుంటారు. దీనివల్ల మనసుకు కొంత రిలీఫ్ అనిపించినా, కొన్నిసార్లు అది మనకే ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. ఊహించని ప్రమాదంలోకి నెట్టొచ్చు. మరైతే, షేరింగ్ పరేషాన్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
అండగా కుటుంబం, వీధిలోకి వస్తే ఇరుగుపొరుగు స్నేహితులు, కాలేజీకి వెళ్తే మిత్రులు.. చుట్టూ ఇందరు ఉన్నా.. చాలామంది సోషల్ మీడియాతో అంతగా ఎందుకు ఇంతలా వింతగా దోస్తీ చేస్తున్నారు? మనసులోని మాటలన్నీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు? దీనికి కారణాలు అనేకం. సోషల్ మీడియాలో ప్రొఫైల్ క్రియేట్ చేసింది మొదలు.. లైకులు, కామెంట్లు, ఫాలోవర్లే కొలమానాలుగా మారిపోయాయి. వాటి కోసమే ఇప్పుడు అందరూ ఆరాటపడుతున్నారు. వీలైనంత ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకోవడానికి ఉన్న మార్గాలన్నిటినీ అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మనసుకు ఏమనిపిస్తే అది షేర్ చేస్తున్నారు. సంతోషమైనా, బాధైనా కలిగిన ప్రతి భావోద్వేగాన్నీ డిజిటల్ అడ్డాలో షేర్ చేస్తున్నారు. తెలియనివారి నుంచి ఓదార్పు ఆశిస్తున్నారు. ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నారు. పాజిటివ్ కామెంట్స్‌ను బూస్టప్‌లా భావిస్తున్నారు. అదే సమయంలో ఎవరైనా ప్రతికూలంగా స్పందిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆన్లైన్ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే.. తెలిసిన వారికంటే తెలియని వారే ఎక్కువ కనిపిస్తారు. వారితో కూడా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి సంకోచించడం లేదు. కొందరైతే తెలివిగా తామెవరో తెలియకుండా జాగ్రత్త పడుతూ సోషల్ మీడియాలో అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. వీరు అనామకులుగా తమ భావాలను పంచుకోవడం సౌకర్యంగా ఫీల్ అవుతారు. దీనివల్ల తమకు ఇబ్బందులు రావనే భ్రమలో ఉంటారు. ఇక సలహా కోసం తమ కష్టాలను, నిరాశలను సోషల్ మీడియాలో పంచుకునేవారు ఎందరో!! తద్వారా నెట్‌వర్క్‌లోని తెలివైన వారి నుంచి సలహాలు పొందాలని వీరు చూస్తారు.
ఒంటరితనం నుంచి దూరమయ్యేందుకు, మాట్లాడటానికి ఎవరూ లేనప్పుడు కొంతమంది వర్చువల్ లైఫ్‌కి దగ్గరవుతుంటారు. ఏదో మానసిక ఉపశమనం ఆశించి ఇవన్నీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో తమలాగే ఆలోచించే వారంతా ఓ కమ్యూనిటీగా ఏర్పడేందుకు కొన్ని నెట్వర్కింగ్ సైట్లు ఉపయోగపడుతున్నాయి. కష్టాలు, సవాళ్లను పంచుకుంటూ ఓ పీర్ గ్రూప్‌ని ఫామ్ చేసుకుంటున్నారు. దీంతో వారికి ఇన్‌స్టంట్‌గా పంచుకునే విషయాలపై మద్దతు, సానుభూతి ఇట్టే దొరికేస్తుంది. తమ ఆవేదనను పంచుకున్నప్పుడు పాజిటివ్‌గా మద్దతు లభించడం వారికి కొంత ఊరటనిస్తుంది.
షేరింగ్ ఉపశమనం వెనకే ఊహించని నష్టాలు ఉన్నాయి. సున్నితంగా ఆలోచించకుంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. తెలియకుండానే ఇంటి గుట్టంతా తీసుకెళ్లి వీధిలో పెట్టుకున్నట్టు అవుతుంది. అందుకే ఒకసారి నెట్టింట్లో వ్యక్తిగతమైన అంశాన్ని పంచుకుంటే అందరి దృష్టి మీపై పడుతుంది. మీరు ఊహించని విధంగా చాలామంది మీ పోస్ట్‌ని వైరల్ చేయొచ్చు కూడా! అంటే.. మిమ్మల్ని వాడుకుని మరొకరు హైలైట్ అవ్వడానికి చూస్తారన్నమాట.
సోషల్ మీడియాలో ఆవేదనను పంచుకోవడం మామూలే, కానీ అప్పుడప్పుడూ మీ సంతోషాలను, విజయాలను కూడా షేర్ చేయండి. మీరు పంచుకునే అంశంలో ఎవరి ప్రమేయం ఉన్నా, వారి పేర్లు లేదా గుర్తింపు వివరాలను ప్రస్తావించొద్దు. మీ పోస్ట్‌లు ఎవరినీ ఇబ్బందిపెట్టేలా, బెదిరించేలా ఉండకూడదు. ముఖ్యంగా అన్నిటికీ సోషల్ మీడియానే వేదిక కాదు. కొన్ని విషయాలు స్నేహితులు, కుటుంబసభ్యులతో షేర్ చేసుకుంటే చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఎవరికీ చెప్పుకోలేనివి నోట్స్‌లా రాసుకున్నా తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు.
-అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్