ఇది పెండ్లిళ్ల సీజన్. పెండ్లి పందిళ్లను అరటి ఆకులతో అలంకరిస్తారు. పెళ్లే కాదు ఏ శుభకార్యమైనా అరటి ఉంటుంది. పూజలలో అరటిపండుని దైవానికి నైవేద్యంగా ఇవ్వడం హిందువుల ఆచారం. అతిథి సత్కారాల్లో, తాంబూలంలో అరటిపండు ముఖ్యమైనది. అరటి కొమ్మ లేని చెట్టు. అరటి చెట్టు బోదె (కాండం)కు పెద్ద పెద్ద ఆకులు పెరుగుతాయి. మన దేశంలో దాదాపు 50 రకాల అరటి జాతులున్నాయి. చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, కేరళ రకాలు ముఖ్యమైనవి. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి బౌద్ధ సాహిత్యంలో అరటి పండు ప్రస్తావన ఉంది. అరటి ఆకులు విశాలమైనవి. వీటిని ప్రాచీన కాలం నుంచి విస్తరిగా ఉపయోగిస్తున్నారు.
అరటిపండును సులభంగా తినేయవచ్చు. పచ్చికాయలతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అరటి కాండం మధ్యలో ఉండే సన్నని దూటని వండుకుని తింటారు. అరటిపువ్వుని కూడా వంట చేసుకుంటారు. అరటిపండు బలవర్ధకమైన ఆహారం. దీనిలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. కడుపులోని అల్సర్లను పోగొడుతుంది. మార్కెట్లో చౌకగా దొరికే రెండు అరటిపండ్లతో కడుపు నింపుకొనేవాళ్లు ఇప్పటికీ మనకు కనిపిస్తారు. భోజనానంతరం అరటిపండు తినడం చాలామందికి అలవాటు. బరువు పెరగని వారికి రోజుకో అరటిపండు తినమని సలహా ఇస్తారు.
మనదేశంలో అరటిపండ్లను డజన్ల లెక్కన అమ్ముతారు. అమెరికాలో ఒక్కోపండుని కూడా కొనుక్కోవచ్చు. వాటిని మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. బరువు పెరగడానికి రోజూ అరటిపండు తినడం అలవాటు చేసుకోమని నా చిన్నప్పుడు డాక్టర్ సలహా ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు పాటిస్తూనే ఉన్నాను. శనివారం రెండు అరటిపండ్లు, కప్పు పాలతోనే నా డిన్నర్ ముగుస్తుంది. అరటి గెలలను తెంపుకొన్న తర్వాత కాండాన్ని నరికివేస్తారు. కాండం దగ్గర వచ్చిన చిన్న పిలకలను నాటుకుంటే పెరిగి ఫలాలనిస్తాయి. ప్రస్తుతం రైతులు హెడెన్సిటీ పద్ధతి ద్వారా అరటి తోటలను పెంచుతున్నారు. ఒకసారి నాటిన అరటి తోట నుంచి మూడు నుంచి నాలుగు సార్లు దిగుబడి తీసుకోవచ్చు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు