‘ప్రసన్నవదనం’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పాయల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రసీమలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నది. ‘ద మెగా మోడల్ హంట్’లో ఫైనలిస్ట్‌గా అదరగొట్టిన పాయల్ సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌లతో బిజీగా మారిపోయింది. తాజాగా ‘చౌర్యపాఠం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం, ప్రకృతిని ఆస్వాదించడం తన అభిరుచులు అంటున్న పాయల్ రాధాకృష్ణ పంచుకున్న కబుర్లు..
నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. నా బాల్యం చాలా సరదాగా సాగింది. చిన్నప్పటినుంచీ నాకు డ్యాన్స్, సంగీతం అంటే చాలా ఇష్టం. స్కూల్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం. భిన్నమైన పాత్రల్లో నటించడం, కథలు చెప్పడం నన్ను ఎంతగానో ఆకర్షించేవి.
నాకు దీపికా పదుకొణె, రజనీకాంత్ గారు చాలా ఇష్టం. వాళ్ల నటన, వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకర్షిస్తాయి.
భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల్లో భాగం కావాలని, బలమైన పాత్రలు పోషించాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించాలని ఉంది.
సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు కుటుంబం, స్నేహితులు అందరూ ఎంకరేజ్ చేశారు. నా మొదటి సినిమా ‘బెంగళూరు అండర్ వరల్డ్’. నా కెరీర్లో మొదటి అడుగు. చాలా థ్రిల్లింగ్‌గా, నర్వస్‌గా అనిపించింది. డైరెక్టర్ పి.ఎన్ గారు నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు, ఎంతగానో ప్రోత్సహించారు.
నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం. అందులోనూ ఇడ్లీ, దోసె మరింత ప్రత్యేకం. అలాగే ఇటాలియన్ పాస్తా కూడా ఇష్టంగా తింటాను! ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించడం తప్పదు. కానీ, కాఫీ కనిపిస్తే మాత్రం మనసు ఊరుకోదు. రెడ్ షేడ్స్ ఉన్న డ్రెస్సింగ్ భలేగా అనిపిస్తుంది. ఎరుపు రంగు చాలా ఎనర్జిటిక్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది.
‘భిన్న’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రానికి మాడ్రిడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు కూడా వచ్చాయి. కొత్త భాషల్లో సినిమాలు చేయడం ఇష్టం. తొలినాళ్లలో తెలుగు, తమిళ్ సినిమాల్లో డైలాగ్‌లు చెప్పడం సవాలుగా అనిపించేది. ఇప్పుడు రెండు భాషలూ నేర్చుకున్నాను.
‘ప్రసన్నవదనం’ సినిమాతో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఎమోషనల్ డెప్త్ ఉన్న పాత్ర అది. టాలీవుడ్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. తెలుగులో మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్‌పై చర్చలు జరుగుతున్నాయి, త్వరలో అప్డేట్స్ ఇస్తాను.
నాకు ట్రావెలింగ్ ఇష్టం. కొత్త ప్రదేశాలు సందర్శించడం, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. స్విట్జర్లాండ్ లాంటి చల్లని ప్రదేశాలు చాలా ఇష్టం. ప్రకృతి సౌందర్యం నన్ను ఎంతగానో ఆకర్షిస్తుంది. సెల్ఫీలు తీసుకోవడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం నా హాబీ. అందులోనూ మిర్రర్ సెల్ఫీలు అంటే మరీ ఇష్టం!