‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
తొ లిజాము ఇంకా సగంలోనే ఉంది. రైలు పట్టాలకు అవతల ఉన్న థియేటర్లో ఇంటర్వెల్ కోసం వెలుపలికి వచ్చిన ప్రేక్షకులు తిరిగి లోపలికి వెళ్తున్నారు. పడమటి నుండి తూర్పుకు వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యంగా వస్తుండటం వల్ల ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ పైన పడిగాపులు పడుతున్నారు. ప్లాట్‌ఫామ్ చివర తూర్పు వైపు కేబిన్‌కు వెనుక వైపున సగం దాకా గోడలు లేక ఖాళీగా ఉన్న గూడ్స్ షెడ్లో కొన్ని గంగిరెద్దుల కుటుంబాలు, హరిదాసుల కుటుంబాలు సంక్రాంతి పండుగ వస్తుందని పేర్లే తెలవని ఊర్ల నుండి దిగి బస చేస్తున్నాయి. ఏ విశేషం లేని ఆ ఊరి గుర్తులు వీళ్ల మస్తిష్కంలో నుండి ఎప్పటికప్పుడు సమసి పోతూనే ఉంటాయి. ఆ దంపతుల్లో ఓ భర్త మూలన చేరగిలపడి బీడీ కాలుస్తుంటే.. భార్య మూడు రాళ్ల పొయ్యి మీద వంట ప్రయత్నాలు మొదలు పెడుతున్నది. ఒకరికొకరు తోడుగా, నీడగా బతుకుతున్న ఇంకొక ముసలి దంపతులు గిన్నెలో మిగిలిన పొద్దటన్నం మింగుడు పడక నీళ్లతో కడుపు లోపలికి పోనిస్తూ ఆకలి తీర్చుకొని బొంత వేసుకుంటున్నారు పండటానికి. ఇంకొంతమంది వయసు పిల్లలు తమ భర్తలు తెచ్చిన ఉడతల్ని కాల్చి కైమా చేసి ఉప్పు కారం చల్లి ఉడక పెడుతున్నారు.
‘సీ! ఎద్దులు పట్టుక తిరుగుడు మా వల్ల కాదు.ఏంజేస్కనైన బతుకుతం!’ అని కొడుకు దూరంగా వెళ్లిపోయిండని.. రోజోసారి రాగం పెట్టే లచ్చమ్మ శోకం పెట్టి ఏడుస్తున్నది. “గిదే మనకు తిండి పెడుతుంది. గిది బిడ్డ కాదా. దీన్నే నమ్ముక బతుకుదాం. గిది మనకు అన్యాయం చేయదు” గంగెద్దు తోకను నిమురుతూ అంటున్నాడు లచ్చవ్వ భర్త. “తందనాన భలే తందనాన. భలే తందనాన” అంటూ వచ్చి, గోడకు తాడుతో వేలాడిన మద్దెలను తీసుకొని.. అది వాయిస్తూ గంతులు వేస్తున్న భర్తను చూసి, “ఏమయ్యో! ఏడ తిరగబోతివి. పొద్దుననంగ పోతివి. తిండీ తిప్పల్లేదాయె. ఇంత సంబురంగ ఉన్నవు? ఏంకత?” అంటుంటే.. “సిలకలాగున్నావే నువ్వు. సిలకలాగా నవ్వినవే నువ్వు” అంటూ, ఆమె రెండు చేతులు తన చేతులతో కలుపుతూ ఆమెను కూడా అడుగులు వేయిస్తుంటే.. “సాల్లేవయ్యా సంబడం. ఇంగ ఆపు. నీ పాటలు ఇనలేక సస్తుంటే డాన్సులు కూడా ఏస్తున్నవ్. అది సరేగానీ, ఇయ్యాల రేపు గంగెద్దునాడిచ్చుకుంట సినిమా పాటలే బూరవూదుతాండ్రు. నువ్వేమో ఎప్పుడూ ఇదే పదం పాడుతవ్”
“గిదీంట్ల అర్థం ఎంతుంటదనుకున్నవ్. లోకంల ఉన్నోడికి లేనోడికి బమ్మ దేవుడు ఒక్కడే. ఆకలి నిద్ర ఒక్కటే. సచ్చినంక స్మశానం కూడా ఒకటేనని గీ పాటకు అర్థం. గందుకే నాకిష్టం” అంటూ, అన్నం తిని మళ్లీ రాగం అందుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న వెంకటయ్య కండ్లు నలుపుకొంటూ నిద్రలేచి.. “నీ మద్దెలమోతిని తెల్లారిందనుకున్న కొడ్క. ఇంక సీకటి పోనే లేదు” ఆవలిస్తూ మళ్లీ ముసుగు తన్నిండు. దుబ్బ గచ్చు మీద పండుకున్నందుకు ఒంటిమీద దుబ్బ పేరినా ఓ చేత్తో గోక్కుంటూ మళ్లీ గుర్రు పెట్టిండు. చిన్నయ్య వైపు జాలిగా చూస్తూ.. ‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే. అండనే బంటు నిద్ర అదియూనొకటే.. తందానానా.. బలా తందనాన..’ అని పాడుతూ.. “ఊరంతా తిరిగొచ్చిన. వెయ్యి గడపలున్నయ్. గంగెద్దు బిచ్చానికి, మన బిచ్చానికి కొద్వలేదు. ఈ మధ్యన దానికి కడుపునిండక గొడ్డంత దగ్గరబడ్డది. ఈ ఊరినుండి పోయ్యేవరకు దాన్ని నున్నగ జేస్త. గందుకే ఈ సంబరమంత” అని భార్య సాలమ్మతో చెప్పుకొంటూ, ముసుగు పెట్టి నిద్ర రాకున్నా గట్టిగా కళ్లు మూసుకున్నాడు బాలయ్య.
* * *
తెల్లారగానే ఎద్దుకు దానా పెట్టి కుడితి కలిపాడు. ముద్దు ముద్దుగా మూతి చాపుతున్న దాని మొహాన్ని దగ్గరగా తీసుకొని ప్రేమగా నిమిరాడు. ఒక బకెట్ వేడివేడి నీళ్లతో దాని ఒళ్లంతా కడిగి తుడిచి మూపురం నుండి తోక వరకు రంగురంగుల బొంతను కప్పాడు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి చివరన ఊలు దారాల కుచ్చులు కట్టాడు. మూతికి తోలుతో కుట్టిన పట్టీ కట్టాడు. నొసటన అందమైన తోలుకుచ్చుకు గవ్వలను కుట్టి కట్టాడు. పొట్ట చుట్టూ పువ్వులతో కుట్టిన తోలు బెల్టును, గవ్వల హారాన్ని కట్టి యజమానులు ఇచ్చిన రంగురంగుల దుప్పట్లు, చీరలు ఆ ఎద్దు వీపుమీద వేశాడు. గంగిరెద్దు అంటేనే అలంకరించిన ఎద్దు అనే అర్థాన్ని నిజం చేస్తూ.. దాన్ని అలంకరించి కాళ్లకు గజ్జెలుకట్టి తన కోరమీసాలు మెలి తిప్పుతూ, నొసలు ఎగిరేస్తూ.. “నా గంగిరెద్దు సాచ్చాత్తు నందికేశ్వరుడే. నా కన్నతండ్రి. నా రామయ్య. దేవుడు దైవం అన్ని నువ్వేనయ్యా” అంటూ చేతులు జోడించి నమస్కరించుకున్నాడు బాలయ్య. చిన్నయ్య ఎంకటయ్యను బూర, డోలు తీసుకొని కోటు వేసుకొని రమ్మని పురమాయించాడు. తల్లీతండ్రి దిక్కులేక చిన్నప్పటినుండి అన్నీ తానై సాదిన పోరడు సూరిగాడ్ని తలకు రుమాల్ చుట్టుకుని జోలెలాంటి సంచిని తగిలించుకొని రమ్మన్నాడు. బాలయ్య శృతి, సన్నాయి, చేతిలో చిన్న కంచుగంట, చెవులకు కమ్మల జోడ, నెత్తికి రంగుల తలగుడ్డ, మూతిమీద కోరమీసాలు, ఒంటిమీద పాతకోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, పంగనామాలతో ఆకర్షణీయంగా తయారై గంగెద్దు మెడకు కట్టిన పగ్గాలను పట్టుకొని బయలుదేరుతుంటే.. ఉతికిన చీర కట్టుకొని, చింపిరి తలను శుభ్రంగా దువ్వుకొని, నుదుటన కుంకుమ బొట్టుదిద్దుకుని చేతిలో డోలు పట్టుకొని వీళ్లందర్నీ అనుసరించింది సాలమ్మ.
ముందు గంగెద్దు నడుస్తుంటే దాని పక్కన తాడు పట్టుకొని బాలయ్య నడుస్తూ పాట పాడుతుంటే.. సూరయ్య జోలె మోస్తూ అప్పుడప్పుడూ పక్కతోవ పడుతున్న గంగిరెద్దును అటకాయిస్తూ నడిపిస్తుంటే.. వెంకటయ్య వాయిద్యాన్ని వాయిస్తూ జానపద బాణీలో బుర్రకథ లాంటి రాగంతో పదాలల్లుతూ పాడుతుంటే.. సాలమ్మ తన చేతిలో ఉన్న డోలు లాంటి వాయిద్యాన్ని లయబద్దంగా వాయిస్తూ, వెంకటయ్య రాగానికి శృతి కలుపుతుంటే.. బాలయ్య సన్నాయి వాయిస్తూ ఒక ఇంటి ముందు ఆగాడు. అది చాలా పెద్ద లోగిలి. ఆ విశాలమైన స్థలంలో ఎద్దు నోటిలో మెడను ఇరికించి అందరికీ చూయిస్తున్నాడు. వాయిద్యానికి అనుగుణంగా గజ్జెల కాళ్లతో గంగిరెద్దు నృత్యం చేస్తున్నది. పడుకోమంటే పడుకుంటున్నది. ‘అయ్యగారికి దండం పెట్టు!’ అంటే.. ముందు కాళ్లు మలుచుకొని కూర్చొని వినయంగా తలవంచుతున్నది. గజ్జెల మోత మోయిస్తూ అక్కడి నుండి ఉరుకుతూ దూరంగా వెళ్లి..
“ఒరేయ్ రాముడు!” అని గొంతు చించుకొని అరుస్తుంటే.. యజమాని వైపు ‘ఏమిటి?’ అన్నట్టు తలపైకెత్తి చూస్తున్నది. అక్కడి నుండి ఇంకొక ఇంటికి, మరో ఇంటికి. కొందరు గంగిరెద్దు తమ ఇంటి ముందుకు వచ్చి ముగ్గు తొక్కితే తమకు శుభం కలుగుతుందనే నమ్మకంతో.. దాని రాకకై ఎదురుచూస్తూ మంగళ హారతులతో, ధూపదీప నైవేద్యాలతో దాన్ని పూజిస్తూ.. సూరన్న జోలెలో ధాన్యం పోస్తూ.. గంగిరెద్దుకు పండ్లు తినిపిస్తూ.. భక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నారు. గంగిరెద్దుల యజమానులు తమ ఎడ్లను ‘బసవన్న’ అని పిలుస్తారు. కొందరు రాముడని, నాయనా, తండ్రి అని రకరకాలుగా పిలుస్తుంటారు. అనేక విన్యాసాలు నేర్పిస్తుంటారు. అవి ఒక్కొక్క ఇంటిలో ప్రదర్శింపజేస్తూ వారిచ్చే కానుకలను జోలెలో వేసుకొని మరొక ఇంటికి కదిలిపోతుంటారు. ఈ హంగామాను చూస్తూ ఊర కుక్కలు కొన్ని మొరుగుతున్నాయి. ప్రతి ఊర్లో బక్క చిక్కిన రైతులు ఉంటారు. కామందులు ఉంటారు. వీళ్లు వారి యాచక వృత్తి చేస్తున్నప్పుడు.. అయ్యా, దొరా, పటేలా అని రకరకాలుగా పిలుస్తుంటారు. “ఆ! ఏం సంగతి. మీరందరూ బాగున్నారా” అడిగాడు లింగమయ్య అనే రైతు. “ఆ.. యేం బాగు. గిట్లున్నం.. మీ దయతోటి బతికేటోళ్లం” దిగులుగా అంటున్న బాలయ్యను చూసి, “అందరి బతుకులు గట్లనే ఉన్నయ్. మాకు ఎంత లేకున్నా వేరేటోళ్లను అడగలేం. మీరు కాలమెట్లున్నా ధైర్యంగా అడుక్కుంటారు. మీ బతుకే నయ్యం” అంటుంటే..
“మాదేముందయ్యా! ఊరూరు తిరిగి అడుక్కునేటోళ్లం. మునుపటి లెక్క గౌరవం లేదు. వట్టి బిచ్చగాళ్లం అయిపోయినం. ఇండ్లులెవ్వు. భూముల్లేవు. సర్కార్లు మార్తనే ఉన్నయ్. మా కోసం ఏందేందో స్కీములు వస్తున్నయంట. అయి మాకు తెలిపే నాథుడు లేడు. మా బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడ్నే అన్నట్టున్నయ్. ఓట్లప్పుడు సైతం మమ్ములను పట్టించుకోరు. గంతెందుకు.. మాకు ఇంతవరకు రేషన్ కారట్లు లేవు. మా పోరగాండ్లు గీ బిచ్చమెత్తుక బతకలేమంటూ దేశానికోడు బతకటానికి ఎల్లిపోయిండ్రు” బాలయ్య చెప్పేదంతా వినుకుంటూ లింగమయ్య అవునన్నట్టు తల ఊపుతూ.. “అవును! ఇప్పుడు దేనికీ విలువ లేదు. గౌరవంలేదు. డబ్బు డబ్బు. ఎక్కడ చూసినా అదే రాజ్యమేలుతున్నది. మీరు కూడా ఈ వృత్తి మానుకొని ఏదైనా పని చేసుకోవడం మేలు” “అవునయ్యా! ఒక్కోనాడు ఇసుగుపుట్టి గట్లనే అనిపిస్తది. కానీ, మనిషి జన్మ అన్ని జీవాలతో ముడిపడి ఉందిగదయ్య. చెట్టు కాయలు, పండ్లు ఇస్తది. ఆవు పాలిస్తది. బాయి నీళ్లిస్తది. కోళ్లు, మేకలు మాంసాన్నిస్తాయి. అయ్యన్నీ మూగజీవులైనా.. మనిషికి మేలు చేస్తయి. మరి వాటిని మనం చూసుకోవాలి కదయ్యా! మా ముత్తాతల, తాతల, తండ్రుల కాన్నుంచి ఈ వృత్తి, ఈ ఎద్దులే మమ్మల్ని సాదుతున్నయ్. మాకు కష్టకాలం వచ్చిందని వీటిని వదిలితే వాటి ఉసురు తగుల్తది కదయ్యా! భూమ్మీద మనిషి మిగలడు. ఈడికే పిట్టలు, కాకులు, గద్దలు, శానశాన పక్షులు, జంతువులు కీటకాలు లేకుండా పోతున్నయి. అందుకే.. మనిషికి తీరొక్క రోగాలు. అయినా నా తనువున్నంతసేపు గీ తండ్రే నా బతుకు” అంటూ దాన్ని ప్రేమగా నిమిరుతూ పగ్గాలు పట్టుకొని తన బస దగ్గరికి నడిచాడు బాలయ్య.
* * *
“ఊర్ల పెద్ద పంతులు సచ్చిపోయినందుకు దినాలప్పుడు మన గంగెద్దును ఆడించమంటాండ్రు. నాకు బిచ్చం లేకుంటెబాయె గానీ, నా ఎద్దుకు గడ్డి కావాల్నని బతిమిలాడుకున్న. ‘నీ ఎద్దును ఎంత మంచిగ ఆడిస్తవో.. గంత గడ్డి నీకిస్త!’ అన్నడు చిన్న పంతులు. ఇంకొన్నాళ్ల దాక నా తండ్రికి తిండిగోస పోతది” అని సంతోషంగా చెప్పాడు భార్యకు. అది గుర్తుకు రాగానే బాలయ్యకు తన ఎద్దును చూడాలనిపించింది. ‘అందరికీ శ్రీహరే అంతరాత్మా. తందనాన బలేతందనాన’ అని పాడుతూ బయటికి నడిచాడు. తన పాట వింటూ మువ్వల చప్పుడు చేసే శబ్దాలు లేవు. భయంకరమైన నిశ్శబ్దం. చీకటిని చీల్చుకొని చూశాడు. కట్టుకొయ్య దగ్గర ఎద్దు లేదు. బాలయ్య గుండె గుభేలుమంది. తాడు తెంపుకొని ఎటో వెళ్లిపోయింది. లోపలికి వచ్చి భార్యను లేపాడు. విషయం చెప్పాడు. సరిగ్గా కట్టెయ్యనందుకు నోటికొచ్చిన తిట్లు తిట్టాడు. అక్కడ కొంప మునిగిపోతే గుర్రు పెట్టి నిద్రపోతున్నావని ఒక్క లెంపకాయ వేశాడు. “నేను గట్టిగనే కట్టిన. అయినా తెంపుకోవడం దాని తప్పుకాదు. నువ్వే కదయ్యా దానికి దొంగతనం నేర్పించినవు. మనకు పని దొరకని రోజులన్నీ కూలి పని చేసుకుని కడుపు నింపుకొంటిమి. అది ఆకలైనా ‘అంబా!’ అంటూ నీ చుట్టూ నా చుట్టూ తిరిగింది గానీ, ఏ చేనులల్ల పడలే. దానిగోస చూల్లేక నువ్వే దానికి కడుపు నిండాల్నని చేన్లమీద వదిలినవ్. నువ్వు నేర్పించినవన్నీ నేర్చుకున్నట్టే.. దొంగతనం కూడా నేర్చుకుంది. అంతకుముందు పగ్గంపెట్టి కట్టేయడం మనకు తెలుసా!?” భార్య మాటలు వింటూ చికాకుగా లేచి బయటకి వెళ్లబోతున్న బాలయ్యతో.. “యాడికి ఇంత చీకట్ల” అడిగింది సాలమ్మ. ఉలుకు పలుకు లేకుండా పెద్దగా అడుగులు వేస్తూ ఊరంతా తిరిగాడు. అతనికేం తోచడం లేదు. ఎద్దును వెతకడానికి పంట పొలాలన్నీ తిరిగాడు. ఎక్కడా ఎద్దు జాడలేదు. అప్పుడప్పుడే చీకటి పల్చబడి తెల్లారుతున్నది. రాత్రంతా పొలాలల్ల కావళ్లు పండుకొని ఊరికి వస్తున్న వాళ్లందరినీ తన ఎద్దుజాడ చెప్పమని అడిగాడు.
“మాకు తెల్వదు”.. అన్న మాట విన్నప్పుడల్లా బాలయ్యకు గుండె గుభేలు మంటున్నది. చివరికి ఒకతను తన పక్కచేన్లో రాత్రంతా దొంగ గొడ్డేదో మేసిందని, దాన్ని బందర దొడ్లో కట్టేసిండ్రని విన్న బాలయ్య.. వాళ్లను వీళ్లను బందరదొడ్డి ఎక్కడుందని అడుగుతూ ఉరికినట్టు వెళ్లాడు. తన ఎద్దును చూసి నిలువు గుడ్లు వేశాడు బాలయ్య. దాని ఒంటినిండా రక్తపు మరకలే. చేను మేసిన కోపాన తన నోరులేని గొడ్డును ఆ యజమాని చావ బాదాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. బాలయ్యను చూసిన ఎద్దు.. ‘అంబా!’ అని అరిచింది. ఆ అరుపు అతని మనసుకు బాకులా గుచ్చుకుంది. కళ్ల వెంట నీరు కారుస్తూ.. బొడ్లో దోపుకొన్న కాగితాల నోట్లు అక్కడ ఇచ్చి ఎద్దును తోలుకొచ్చుకున్నాడు. “తప్పు నీదికాదు తండ్రీ.. నాది! నా పాపం నోరులేని నువ్వు మోస్తున్నావ్. వచ్చే జన్మల నీ కడుపున పుట్టి రుణం తీర్చుకుంట. నువ్వే కద నా తండ్రి. మా ఆకలి తీర్చే ఆస్తి. నువ్వే దేవునివి. తల్లివి. అన్నీ నువ్వే.. నన్ను క్షమించు!” అంటూ, గట్టిగా ఏడ్చాడు బాలయ్య. దెబ్బల బాధకు గంగెద్దు, దాని బాధను చూసి బాలయ్యకు కండ్ల నీళ్లు ధారలు కట్టినయ్. ఆ రోజు పెద్ద పంతులు దినాలు. దాని ఒంటి మీద దెబ్బలు మానలేదు. అయినా అలంకరించక తప్పలేదు. “నా రాముడూ! నా మాట దక్కించు. ఈ ఒక్క ఆట ఆడితే నీకు ఆరు నెల్లగాసం దొరుకుతది. అప్పటిదాకా నీకు విశ్రాంతి. నిన్ను బాధ పెట్టను. నిన్ను సంటి పాపోలె సాదుకుంట. నా మాట నిలపెట్టు”.. చేతులు జోడించి వేడుకుంటున్న బాలయ్యను, దీనమైన చూపుతో తల ఊపి ఓదార్చింది నోరులేని ఆ పశువు. కానీ, ఆడేటప్పుడు వాయిద్యానికి అనుగుణంగా అడుగులు వేయలేక పోతున్నది. అటూఇటూ పరిగెత్తలేక పోతున్నది.
‘డూ.. డూ.. బసవన్న! రారా… రారా.. బసవన్న!’ అంటుంటే.. చిట్టి అడుగులతో, హుషారుగా నృత్యం చేయాల్సిన రాముడు.. అడుగు వేయలేక పోతున్నది. మూడు కాళ్ల మీద కూర్చోలేక పోతున్నది. ప్రశ్నలు వేస్తూ డమడమ డోలు వాయిస్తుంటే.. అర్థమైనట్టే వింటూ, సమాధానాలు చెప్పే బసవన్న తలను నేలకు వాలుస్తున్నది. ‘అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు!’ అంటుంటే.. కాలు పైకెత్తలేక పోతున్నది. ఇదంతా చూస్తున్న బాలయ్య గుండెలు బద్దలవుతున్నాయి. అతని కళ్లు కన్నీరు కారుస్తుంటే.. కండువాతో తుడుచుకుంటుంటే.. అంతే విషాదంగా సన్నాయి పాట వినిపిస్తున్నది. అది చూస్తున్న జనం..
“చిన్న పంతులు కళ్లల్ల నీళ్ల సుక్క లేదు. ఈ గంగెద్దు, ఆడించేటోడు దుఃఖంతోటి వాయించలేకపోతుండు” అంటూ గుసగుసలాడుతున్నారు. చిన్న పంతులు బాలయ్యను పిలిపించి.. “నీకు కావలసినంత గడ్డి తీసుకో పో! గంగెద్దును మంచిగ ఆడించినవ్. నీతోపాటు నీ ఎద్దు కూడా మా నాయన కోసం కన్నీళ్లు కార్చింది. ఆయన ఆత్మ శాంతించినట్టే!” అంటుంటే బాలయ్య దుఃఖం రెట్టింపైంది. “నేను మళ్లొస్త. నా ఎద్దు ఆడిఆడి అలిసింది” అంటూ ఎద్దుతోపాటు ముందుకు నడిచాడు. గంగెద్దు కాలు తీసి కాలు వేయలేక పోతున్నది. నిలబడటమే కష్టంగా ఉంది. దారిలోనే కూలబడిపోయింది. “నా తండ్రీ.. నా రాముడూ!” అంటూ దాని పెయ్యంతా నిమురుతున్న బాలయ్య మొహంలో.. నాలుకతో అతని కన్నీరు తుడుస్తూ మెడలు విరుచుకొని ప్రాణం వదిలింది గంగెద్దు. అతనికి ఇంకేదో ఆశ. దాని చర్మాన్ని గిల్లి గిల్లి చూశాడు. జీవం లేదు. కచ్చితంగా చచ్చిపోయింది. పక్కనే అచేతనంగా భార్య, చిన్నయ్య, సూరయ్య కూలవడి ఏడుస్తున్నారు. దాని చావును ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.
“నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలె. నీతో నాకు ఎన్నేండ్ల బంధం. ఇన్నేండ్లు నువ్వు అన్నీ ఇచ్చినవ్. స్నేహం, ప్రేమ, సేవ, తిండి, వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రాణం కూడా” బావురుమన్నాడు బాలయ్య. దుఃఖం ఆగకుండా ఉంది. చెంపల వెంబడి బాధ కరిగి కారిపోతున్నది. ఇవే ఆఖరి క్షణాలనుకుని ఒకసారి గంగెద్దు మీద కప్పిన మెత్తటి శాలువను రెండు చేతులతో దగ్గరకంటూ కళ్లకద్దుకొన్నాడు. ఆ స్పర్శ తండ్రిని స్పర్శించినట్టే ఉంది. ఆ స్పర్శ తనను ఓదారుస్తున్నట్టుంది. బాలయ్య శరీరం బుగబుగ ఉడికింది. “నా తండ్రికి నేను గడ్డి పెట్టుకోలేక పోయాను. నేనేం చెప్పినా, ఏం నేర్పినా.. చూడు బసవన్న అనగానే తల ఊపింది. చెప్పినట్టు చేసింది. అలాంటి బుద్ధిగలదాన్ని విశ్వాసం ఉన్నదాన్ని బతికించుకునే యోగ్యత నాకు లేకపోయింది. అలాంటి నేను చచ్చేం.. బతికేం!?” అదే పనిగా ఏడుస్తున్న భర్తతో.. “నీ బాంచన్. ఇంగ ఏడ్వకయ్యా! ఏ ప్రాణి పోకుండా భూమ్మీద ఉండదయ్యా!” అని భార్య బతిమిలాడుతుంటే..
“గది కాదే! దానికి దొంగతనం నేర్పి నేనే చంపిన. ఈ పాడు లోకంల మనిషికి రకరకాల తిండి కావాలెనట. కానీ, ఏ జీవి తిండి ఆ జీవికొద్దట! ఇదివరకు రోజుల్ల కల్లాల దగ్గరకి పోతే గడ్డిమోపులు ఇచ్చెటోళ్లు. గిప్పుడు గడ్డి లేదు. గడ్డివాము లేదు. పొలాలల్లనే గడ్డిని తగలబెడుతుండ్రు. పాడు కాలం. పాపపు కాలం. అదే నా తండ్రిని మింగింది” అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా.. “నేను ఇప్పుడే వస్త!” అనుకుంట లేచి.. కాసేపటికి నాలుగు కట్టెలు, గడ్డిమోపు తీసుకొచ్చి పాడె పేర్చి, నలుగురు మోసుకొని శ్మశానం వైపు నడిచారు. నలుగురు చేతులు కలిపి పెద్దగా గొయ్యి తవ్వి.. గంగెద్దు కళేబరాన్ని లోపలికి కుక్కి మట్టితో పూడ్చాడు. పక్కనే ఎవరో మహారాజు గంధం చెక్కలతో కాలిపోతున్నాడు. అతికష్టంగా కాలుతున్న రెండు చెక్కలు తెచ్చి.. దాన్ని పూడ్చిన మట్టిమీద పెట్టి, పక్కన పెట్టిన సన్నాయిని తీసుకొని వెంకటయ్యను బూర ఊదమని, భార్యను మద్దెల వాయించమని పాటనందుకున్నాడు బాలయ్య. “మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి కరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే!” అంటూ.. దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఒకచోట కూలబడిపోయాడు. ఆ నిశ్శబ్దంలో అతనికి ‘అంబా!’ అన్న అరుపు లీలగా వినిపిస్తున్నది. తనకు మాత్రమే అర్థమయ్యే మూగ భాషలో తన మనసుతో ఇంకేదో మాట్లాడుతున్నట్టు. అక్కడి నుండి వెళ్లిపొమ్మని, సంచార జీవులైన తమను మరోచోటికి కదిలి పొమ్మని..
వేముగంటి శుక్తిమతి అట్టడుగు వర్గాల ఎతలే కథలుగా రాస్తున్నారు రచయిత్రి వేముగంటి శుక్తిమతి. ఎంఏ (తెలుగు), తెలుగు పండిట్ శిక్షణ పొందారు. 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. సంగీతం, సాహిత్యాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇప్పటివరకూ వీరు రాసిన 25 కథలు, 60కి పైగా వ్యాసాలు వివిధ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. మళ్ళీ పల్లె ఒడిలోకి, నేను సైతం, సంధి కాలం, జననీ జన్మభూమి, సాయి ఒడిలోకి పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ మన చరిత్ర, కాకతీయుల వైభవంతోపాటు కొన్ని కథానికలు, పండగల సందర్భంగా అనేక రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. గిడుగు రామమూర్తి వంతులు ఫౌండేషన్, శంతరం వేదిత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పురస్కారాలలో ‘నేను సైతం’ నవలకు బహుమతి లభించింది. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఎన్జీవోస్ నెట్వర్క్ (భారత్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘జాతీయ జీవన సాఫల్య ’అవార్డుతోపాటు ‘సేవారత్న’ బిరుదు అందుకున్నారు. ఎక్సేరే సంస్థ ద్వారా ప్రతిష్ఠాత్మకమైన మదర్ థెరిసా అవార్డు తీసుకున్నారు.