న్యూఢిల్లీ : వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబం దాఖలు చేసిన కేసులో రూ. 29 మిలియన్ డాలర్లు(రూ. 262 కోట్లు) నష్టపరిహారం చెల్లించేందుకు సీటెల్ అధికారులు అంగీకరించారు. 2023 జనవరి 23న సీటెల్ క్యాంపస్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొంది. నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సీటెల్ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో జాహ్నవి మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. పోలీసు అధికారి అతివేగమే తమ కుమార్తెను బలిగొన్నదని ఫిర్యాదుచేస్తూ 2024లో జాహ్నవి కుటుంబ సభ్యులు సీటెల్ నగరంలో దావా వేశారు.
కారును అతివేగంగా నడిపిన పోలీసు అధికారి కెవిన్ డావే గత ఏడాది ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ప్రమాద బీమా కింద ఆమె కుటుంబానికి 20 మిలియన్ డాలర్లు పరిహారం వస్తుందని అంచనా వేయగా 29 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఎమర్జెన్సీ పిలుపురావడంతో గంటకు 25 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్లో 74 మైళ్ల వేగంతో డావే కారు నడిపారు. ఎమర్జెనీ లైట్లు, సైరన్ ఉపయోగించినప్పటికీ రోడ్డు దాటుతున్న జాహ్నవిని కారు ఢీకొంది. కారు వేగానికి జాహ్నవి శరీరం 100 అడుగులకు పైగా గాలిలో ఎగిరి ఆమె అక్కడికక్కడే మరణించారు.