ఒకప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ఆలోచన వస్తే వెంటనే.. పక్కింట్లోనో.. పక్క వీధిలోనో.. ప్లే గ్రౌండ్లోనో ఉంటారులే అనుకునే వాళ్లు. ‘రేయ్.. జాగ్రత్త. తోసుకోవద్దు. దెబ్బలు తగులుతాయ్. జాగ్రత్తగా ఆడుకుని రండి’ అని చెప్పేవాళ్లు. మీ పని మీరు చేసుకునే వాళ్లు. మరి, ఇప్పుడు? ‘రేయ్.. ఏం చేస్తున్నావ్?’ అంటే.. ఆన్లైన్లో ఉన్నామంటూ.. వాట్సాప్‌లో సమాధానం చెబుతున్నారు. ఎమోజీలతో స్పందిస్తున్నారు. పేరెంట్స్‌లో కొందరు ఓ థమ్స్అప్ సింబల్ పెట్టేస్తున్నారు. అతి కొద్దిమందే వాళ్లేం చేస్తున్నారా? అని ఓ కన్నేద్దాం అనుకుంటే.. వర్చువల్ వరల్డ్‌లో నేటితరం వాడే ప్లాట్‌ఫామ్‌లు అన్నీ-ఇన్నీ కాదు. మెసేజింగ్ అడ్డాలు, సోషల్ మీడియా వేదికలు, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు.. ఇలా అన్ని ఆన్లైన్ గల్లీల్లో తెగ తిరిగేస్తున్నారు.
Parenting | పిల్లలు బడికి వెళ్తుంటే జాగ్రత్తలు చెబుతారు తల్లిదండ్రులు. సెలవుల్లో అమ్మమ్మగారి ఊరికి వెళ్తుంటే.. వారం ముందునుంచే అక్కడ ఎలా నడుచుకోవాలో హితబోధ చేస్తుంటారు. కానీ, సెల్‌ఫోన్ చేతికి ఇచ్చేటప్పుడు మాత్రం ‘పదిహేను నిమిషాలయ్యాక ఇచ్చేయాలి’ అని సింగిల్ కండిషన్ పెడుతుంటారు. ఈ పదిహేను నిమిషాల్లో పది యాప్‌లు సెర్చింగ్ చేసేస్తున్నది నేటితరం. వాళ్లేం చేస్తున్నారో కూడా గమనించనంత బిజీగా ఉంటున్నారు తల్లిదండ్రులు. ఫుల్ వైఫై జోన్లో ఉన్నప్పుడు ఈ హస్తభూషణం.. నాగుపాము కన్నా డేంజర్. ఓ యాప్ కర్కోటకుడిలా కస్సుమంటే.. మరో గేమింగ్ యాప్ తక్షకుడిలా తక్షణం కాటు వేస్తుంది. ఈ తరుణంలో పేరెంట్స్‌గా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారు? పిల్లల ప్రైవసీ రోడ్డున పడకుండా ఉండాలంటే.. ఈ సలహాలను విధిగా పాటించండి.