వైద్యుణ్ని నారాయణుడితో పోల్చారు మన పెద్దలు. దేవుడు గుడికే పరిమితం కాదు. సర్వాంతర్యామి. ఈ వైద్య నారాయణుడు కూడా కేవలం దవాఖానకే పరిమితం కాలేదు. తన దగ్గరికి రాలేనటువంటి పేదల గడప ముందుకు వెళ్లాడు. తానొక్కడే కాదు.. తన వెంట మరో ఆరవైమంది వైద్యులను తీసుకెళ్లాడు. మారుమూల పల్లెల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉస్మానియాలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ రాజీవ్ ‘ఆరోగ్యమిత్ర యాత్ర’కు శ్రీకారం చుట్టాడు. తన మిత్రబృందంతో సేవాపథంలో పయనిస్తున్నాడు.
ఉస్మానియా దవాఖానలో పల్మనాలజీ విభాగంలో డాక్టర్ రాజీవ్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. ఆయనది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నూతనకల్ గ్రామం. చిన్నప్పటినుంచి సామాజిక స్పృహ ఎక్కువ. సమాజం కోసం ఏదైనా చేయాలని తపించేవాడు. డాక్టర్ అయితే.. పేదలకు సేవ చేయవచ్చని భావించాడు. అనుకున్నట్టే డాక్టర్ అయ్యాడు. ఎంబీబీఎస్ రెండో ఏడాదిలో ఉన్నప్పుడే మానసిక వికలాంగుల కోసం ఆరోగ్య సదస్సు నిర్వహించాడు. ఇలాంటి క్యాంప్‌లు నిర్వహిస్తే మరింత మందికి వైద్యసేవలు అందుతాయని భావించాడు.
ఉస్మానియాలో వైద్యుడిగా చేరిన తర్వాత తన సేవలు మరింత విస్తృతం చేశాడు. 2019లో సూర్యాపేట ప్రాంతంలోని పలు గ్రామాల్లో, 2021లో హైదరాబాద్ శివారులోని బస్తీల్లో ఉచితంగానే వైద్య శిబిరాలు నిర్వహించాడు. తనతో పనిచేస్తున్న వైద్య మిత్రుల సహకారం తీసుకున్నాడు. ఈ క్రమంలో మారుమూల పల్లెల్లో ప్రజలు వైద్యానికి ఎంత దూరంగా ఉంటున్నారో రాజీవ్‌కు అర్థమైంది. కనీస వైద్యం అందక సీజనల్ వ్యాధుల బారినపడుతున్న ఏజెన్సీ ప్రాంతవాసుల అవస్థలు పత్రికల్లో చదివి చలించిపోయాడు. అలాంటివారి కోసం తనవంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయత్నంలో వరంగల్‌కు చెందిన డాక్టర్ శ్రీనాథ్ సహకారం తీసుకున్నాడు. కనీస వైద్య సదుపాయాలు లేని మారుమూల పల్లెలు పర్యటించి, అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ‘ఆరోగ్యమిత్ర యాత్ర’కు శ్రీకారం చుట్టాడు.
తొలి ప్రయత్నంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మారుమూల అటవీపల్లె దామరవాయిలో శిబిరం నిర్వహించాడు. ఆ ప్రాంతంలో వానకాలం వస్తే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ క్రమంలో 60 మంది వైద్యులు అడవిబాట పట్టారు. స్టెతస్కోప్‌లు ధరించి, తెల్లకోట్లు వేసుకొని వైద్యులంతా కదిలారు. ఉస్మానియా, గాంధీ దవాఖానల నుంచి వచ్చిన యువ వైద్యబృందానికి రాజీవ్, వరంగల్ వైద్యులకు శ్రీనాథ్ నేతృత్వం వహించారు. ఏ రోగమొచ్చినా అడవితల్లికి దండం పెట్టుకునే అభాగ్యుల చెంతకు అశ్వినీ దేవతల్లా చేరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకొని.. అక్కడివారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో కొందరికి మధుమేహం ఉన్నట్టుగా తేలింది.
మరికొందరు బీపీతో బాధపడుతున్నారు. ఇంకొందరు థైరాయిడ్ సమస్యకు గురయ్యారు. తమకు వచ్చిన రుగ్మతలు ఏంటో కూడా తెలియకుండా రోజులు వెళ్లదీస్తున్నారని వైద్యులు గుర్తించారు. వాళ్లందరికీ సరైన మందులు అందించి.. పరిస్థితి ఎలా ఉందో కూడా మళ్లీ వాకబు చేస్తున్నారు. ‘ఆరోగ్యమిత్ర యాత్ర’ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డాక్టర్ రాజీవ్ చెబుతున్నాడు. మారుమూల పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి సదా సిద్ధంగా ఉన్నామని ఆయన అంటున్నాడు. ఈ క్రతువులో మరింతమంది యువ వైద్యులు భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నాడు. ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా ‘ఆరోగ్యమిత్ర యాత్ర’ నిరంతరం కొనసాగుతుందని చెబుతున్న డాక్టర్ రాజీవ్‌కు మనమూ హ్యాట్సాఫ్ చెబుదాం!
– రాజు పిల్లనగోయిన