రాజకీయ మంత్రాంగాలకు చిరునామాగా నిలిచిన ప్రాసాదం అది. అధికార యంత్రాంగానికి ఆలవాలమై అలరారింది. రాచరికపు పోకడలకు, ప్రజాస్వామ్య వైభవానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన వరంగల్ నగరంలోని సుబేదార్ బంగ్లా ఇప్పుడు ప్రజలకు సాదర స్వాగతం పలుకుతున్నది. పర్యాటక ప్రియులను ఆహ్వానిస్తున్నది. 139 ఏండ్ల పురాతనమైన ఈ చారిత్రక భవనం టూరిస్టు స్పాట్‌గా అందుబాటులోకి రానున్నది.
నిజాం కాలం నుంచి ఇప్పటివరకు పరిపాలన కేంద్రంగా ఉన్న సుబేదార్ బంగ్లా ఇప్పుడు గత జ్ఞాపకాలను మనకు తెలియజేస్తున్నది. కొన్నేండ్లుగా ఈ బంగ్లానే హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలోనూ సమీకృత కలెక్టరేట్లు, వాటి పక్కనే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు అధికారిక నివాసాలను నిర్మించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ఈ ఏడాది జనవరిలో అధికారిక నివాసానికి మారడంతో… సుబేదార్ బంగ్లా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో బంగ్లా నిర్మాణ శైలి దెబ్బతినకుండా మరమ్మతులు చేసి రంగులు వేశారు. ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లరంగు వేసి, లైటింగ్ ఏర్పాటుచేశారు. రకరకాల మొక్కలు నాటి పచ్చదనానికి చిరునామాగా మార్చారు. ఈ చారిత్రక భవనాన్ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాట్లు చేసింది. చరిత్రకు సాక్షిగా, అప్పటి నిపుణుల నిర్మాణ శైలికి గుర్తుగా సుబేదార్ బంగ్లా నిలిచింది.
నిజాం ఏలుబడిలోని రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఐదు సుబాలుగా విభజించారు. వాటిలో ఒకటి వరంగల్. ఒక్కో సుబాకు సుబేదార్ హోదాలో అధికారి ఉండేవాడు. వరంగల్ సుబేదారి అధికారిక నివాసం, కార్యాలయంగా ఉపయోగించేందుకు 1886 ఆగస్టు 10న ఈ భవన నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. 13 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో అత్యంత పటిష్టంగా దీన్ని నిర్మించారు. సుబేదార్ ఆవాసంగా ఉన్న ఈ బంగ్లాను 1950 నుంచి జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా, హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా వినియోగంలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 43 మంది కలెక్టర్లు, మరికొందరు ఇన్చార్జ్ కలెక్టర్లు సుబేదారీ బంగ్లాలో నివాసం ఉన్నారు. విశాలమైన భవనంలోని అవసరాల కోసం ప్రత్యేకంగా బావిని తవ్వారు. 1982లో జవహర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు బావి పూడికతీశారు. అప్పుడు నిజాం కాలం నాటి కత్తులు, ఇతర సామగ్రి లభించాయి. వాటిని రాష్ట్ర పురావస్తు శాఖ వారికి అప్పగించారు.
అసఫ్‌జాహీల కాలం నాటి నిర్మాణ శైలికి అద్దం పడుతుంది సుబేదార్ బంగ్లా. దీనిని పూర్తిగా డంగు సున్నంతో నిర్మించారు. కోటను తలపించేలా ప్రవేశ ద్వారం, దానిపై పెద్ద గడియారం ఏర్పాటుచేశారు. గతంలో కొంతకాలం మూగబోయిన ఈ గడియారం మళ్లీ చక్కగా సమయాన్ని చూపుతున్నది. గంటకోసారి గంట కొడుతూ.. హనుమకొండ వాసులకు సమయాన్ని గుర్తు చేస్తుంటుంది. ఇక బంగ్లా ప్రాంగణంలో తోటలు అబ్బురపరుస్తాయి. నీటి కొలను, అందులో ఫౌంటెయిన్ ముచ్చటగొలుపుతాయి. నిజాం హయాంలో ముఖ్యమైన పట్టణాలలో నిర్మించిన ప్రభుత్వ భవనాల్లో వరంగల్‌లోని సుబేదార్ బంగ్లా పెద్దది. ఇందులో సుమారు 22 గదులు ఉన్నాయి.
20 అడుగుల ఎత్తున సీలింగ్ ఉంటుంది. దానికి వేలాడదీసిన భారీ శాండిలియర్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. మొదటి అంతస్తులో ఒక విశాలమైన టెర్రస్ ఉంది. కలపతో చేసిన మెట్లు ఇప్పటికీ చెకు చెదరకుండా ఉండటం విశేషం. సుబేదార్ బంగ్లా చుట్టూ పూల మొక్కలు, పండ్లచెట్లు, శ్రీ గంధం, నల్లతుమ్మ, రాగి, వేప, అల్లనేరేడు ఇలా రకరకాల జాతులకు చెందిన వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇన్నాళ్లూ.. అధికారుల చిరునామాగా ఉన్న సుబేదార్ బంగ్లా.. ఇప్పుడు ప్రజల చెంతకు చేరిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పర్యాటక సిగలో మరో మేలి ముత్యం వచ్చి చేరిందని సంబురపడుతున్నారు.
– పిన్నింటి గోపాల్
– గొట్టె వెంకన్న