‘రాముడు భీముడు’నిర్మాతగా రామానాయుడికి తొలి చిత్రం. ఎన్టీయార్ ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం.ఈ సినిమాలో సినారె మూడు యుగళ గీతాలు రాశారు. 1964లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో, ఇందులోని పాటలన్నీ అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘తెలిసిందిలే తెలిసిందిలే’ అప్పటి ప్రేక్షక లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇందులో జమున చిలిపితనం, ఎన్టీయార్ అమాయకత్వంతో కూడిన కొంటెతనం సమపాళ్లలో కుదిరి.. సంగీత, సాహిత్యాలకు అదనపు వన్నె తెచ్చాయి. ఎవర్గ్రీన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఆనాటి మేటి గీతం ముచ్చట్లు ఈ వారం..
‘అనురాగం చిత్రం పాటల రచన సందర్భంలో మాతోపాటు సన్నగా, నున్నగా, ఎత్తుగా ఉన్న ఒక యువకుడు కూర్చునేవాడు… ఆ యువకుడే తరువాతి కాలంలో బహు భాషల్లో చలన చిత్రాలు నిర్మించిన అచంచల యశోధనుడు దగ్గుబాటి రామానాయుడు’ అంటూ ‘రాముడు భీముడు’ చిత్రం గురించి రాస్తున్నప్పుడు పరిచయం చేస్తారు సినారె. ఈ చిత్రం కోసం సినారె మూడు యుగళ గీతాలు రాశారు. ఈ మూడు గీతాలు సంగీత దర్శకుడు పెండ్యాల ఇచ్చిన ట్యూన్లకు కవి రాసినవే!‘తెలిసిందిలే తెలిసిందిలే… నెలరాజ నీ రూపు తెలిసిందిలే’ మొదటిది. ‘అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది/ ఏదోలాగు మనసు లాగుతున్నది’ ఈ చిత్రంలోని మరో ప్రసిద్ధ గీతం.
పల్లవి:
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే! ॥2॥
పై గీతాన్ని ఒకచోట ప్రస్తావిస్తూ “ఆ రోజుల్లో డ్యూయెట్లు రాసినా అవి పాత్రల స్వభావాన్ని ఆశ్రయించుకుని ఉండేవే” అంటారు సినారె. ఈ చిత్రంలో నాయికానాయకులు జమున, ఎన్టీయార్. ‘రాముడు భీముడు’లో ఒకటి అదిరి పడేది, మరొకటి అదరగొట్టేది. ఈ గీతాన్ని కూడా ఆ కోవలోనే రాశారు సినారె. నాయిక తనకు నచ్చిన నాయకునితో తొలుత పాడేపాట ఇది. తరువాత నాయకుడు కూడా గొంతును జత కలుపుతాడు.
చరణం
ఆమె: చలిగాలి రమ్మంటు పిలిచిందిలే
చెలిచూపు నీపైన నిలిచిందిలే
అతను: ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుందిలే
నీ ముందుందిలే ॥తెలిసిందిలే॥
చరణం
ఆమె: వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా!
అతను: ఔనందునా! కాదందునా
ఔనందునా! కాదందునా
అయ్యారె! విధిలీల అనుకొందునా!
అనుకొందునా! ॥తెలిసిందిలే॥
సినారె ఇతర సినీ ప్రణయ గీతాలను, ఈ గీతాన్ని చూస్తే కవిత్వం మెరుపులు కనిపించకపోవచ్చు. కానీ, సందర్భానికి అనుగుణంగా కూర్చిన చక్కని పదాల పొందికతో కూడిన అద్భుత రచనను చూడవచ్చు. నాయిక జమున… వెండితెర మీద తెలుగువారి నెరజాణగా, సత్యభామగా ఖాయం చేసుకున్న నటి. ఈ గీతంలో ఆమె వైఖరి ఈ స్వభావాలకు దగ్గరగా ఉండేదే! తన ఎదుట ఉన్నవాడు ఆమె ఎదలో కొలువైవున్న నాయకుడు. అతనిపైన ఆమె మనసు పారేసుకుంది. ఆ విషయం అతనికి చెప్పాలి. కానీ, అతనేమో గడుసరి. బెదిరిపోయేవాడి స్థానంలోకి అనుకోకుండా వచ్చిపడతాడు. పూర్వ పరిచయం ఉన్నట్టుగా నాయిక ప్రవర్తిస్తుంటుంది. కొత్త పరిచయంతో పేచీ ఎందుకన్నట్టు మొదట్లో మిన్నకుంటాడు రాముడి పాత్రలో ఉన్న భీముడు. అందుకే, ఆమె ‘వరహాల చిరునవ్వు కురిపించనా….’ అంటే, అతను ‘ఔనందునా… కాదందునా’ అంటూ తప్పుకోబోతాడు. ఇంకా ‘విధిలీల అనుకొందునా’ అంటూ తలపోస్తాడు. నాయిక మాత్రం వదలదు. తమ ఇద్దరి జోడి ఎంత బాగుంటుందో కింది చరణంలో చెప్పి నాయకుడిని అలరించే ప్రయత్నం చేస్తుంది.
చరణం
ఆమె: సొగసైన కనులేమొ నాకున్నవి
చురుకైన మనసేమొ నీకున్నది
మనం అనుకున్నాం కదా! పాపం నాయకుడు ఉలికిపడే వాడి స్థానంలో వచ్చిపడ్డాడని. అందుకే అతని అభిప్రాయిన్ని తన మాటగా చక్కని చతురోక్తితో చెబుతారు సినారె. అది కూడా ‘శ్రుతిమించి’ందని చెబుతూ..
అతను: కనులేమిటో! ఈ కథ యేమిటో
కనులేమిటో! ఈ కథ యేమిటో
శ్రుతిమించి రాగాన పడనున్నది
పడుతున్నది! ॥తెలిసిందిలే॥
ఇక్కడ ఈ చిత్ర కథ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. రాజుపేద నవలలో ఏవిధంగానైతే పాత్రలు మారిపోతాయో.. ఇందులోనూ అదే కనిపిస్తుంది. ఈ సినిమా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలోకి రీమేక్ అయింది. తర్వాతి కాలంలో వాణిశ్రీ ప్రధాన పాత్రగా వచ్చిన ‘సీత గీత’, చిరంజీవి ‘యముడికి మొగుడు’, బాలకృష్ణ ‘రాముడు భీముడు’ తదితర చిత్రాల్లోనూ ఎన్టీయార్ ‘రాముడు భీముడు’ ఛాయలు కనిపిస్తాయి.
-పత్తిపాక మోహన్