Vintage Movie posters trending as Interior Design | వచ్చేపోయేవారికి వివరించే గోడ మీద బొమ్మ .. పోస్టర్. ఏ సినిమాలో ఏం ఉందన్నది గోడపై నిలిచిన పోస్టర్ కండ్లకు కడుతుంది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా 24 కళల సారాన్నీ సింగిల్ ఫ్రేమ్‌లో ఆవిష్కరించేది పోస్టరే. అప్పట్లో తారలకు గుళ్లు కట్టినట్టే, ఇప్పుడు పోస్టర్లకు ఇండ్లు కడుతున్నారు వీరాభిమానులు. ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌లో గోడల అలంకరణలో సినిమా పోస్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు డిజైనర్లు.
సినిమా.. సింగిల్ లైన్ స్టోరీ నుంచి మొదలై వందల పేజీల స్క్రిప్ట్‌తో వేల మీటర్ల రీల్‌పైకి వస్తుంది. అంతటితోనే ఆగిపోదు. అంతులేని కథలా సాగిపోతుంది. సినిమా సక్సెస్ కావాలంటే టేకింగ్ సూపర్‌గా ఉన్నంత మాత్రాన సరిపోదు. కథను ఎంత కష్టపడి తెరకెక్కించారో అంతే కష్టపడి ప్రచారం చేయాలి. ఆ ప్రచారానికి నాంది.. పోస్టర్. వెండితెర మీద చూడబోయే సినిమా కథకు పోస్టర్ అద్దం పడుతుంది. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అన్నట్టు ప్రేక్షకుడిని సినిమా ప్రేమలో పడేసేది పోస్టరే. ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రకారుడిగా పేరు గడించక ముందు సినిమా పోస్టర్లను గీసినవాడే. 1990 వరకు సినిమా పోస్టర్లన్నీ పేరున్న చిత్రకారులు రూపొందించినవే.
సినిమాయే మా అభి‘మతం’ అనుకునేవారికి తారలే దేవుళ్లు! రెండున్నర గంటలు సినిమా చూస్తూ ఈలలు వేస్తే సినిమా కథ అయిపోతుందేమో కానీ అభిమానాన్ని చాటుకోవడం మాత్రం ఆగిపోదు. ఆ మక్కువ కొద్దీ పోస్టర్లు దాచుకునేవారూ ఉన్నారు. ఆ జాబితాలో సినిమా దిగ్గజాలూ ఉన్నారు. ‘మొఘల్ ఎ ఆజం’ సినిమా ఒరిజినల్ పోస్టర్‌ను ఆన్లైన్ వేలంలో కొనేశాడు షారుక్ ఖాన్. దీనిపై దిలీప్ కుమార్ ఆటోగ్రాఫ్ తీసుకుని మన్నత్ (షారుక్ నివాసం)లో ఓ గోడకు అలంకరించుకున్నాడు. తనే కాదు అలనాటి సినిమా పోస్టర్లను చాలామంది ఇల్లు, ఆఫీసు అలంకరణలో భాగం చేసుకుంటున్నారు. దీనివల్ల అనేక ఉపయోగాలు. ఖరీదైన ఇంటీరియర్స్ కంటే పోస్టర్లే అతిథుల దృష్టిని ముందుగా ఆకర్షిస్తాయి. వచ్చీ రాగానే చూస్తారు. ఏ ఫలహారమో ఆరగిస్తూ చూస్తారు. వెళ్తూ వెళ్తూ కూడా ఓ చూపు అటు పడేస్తారు.
దీంతో ఇంటీరియర్ డిజైనర్లు గృహాలంకరణలో పోస్టర్లనూ ఓ భాగం చేయిస్తున్నారు. కొనగలిగేవారు వేలం పాటలలోనో, యాంటిక్స్ దుకాణంలోనో వేలకువేలు పెట్టి అలనాటి ఒరిజినల్ పోస్టర్ల మూలచిత్రాలను కొంటారు. అంత ఖర్చు ఎందుకు అనుకుంటే.. వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ ప్రింట్లు కొంటున్నారు. చాలామంది తెలుగువాళ్లు ‘మాయాబజార్’ పోస్టర్లపై ఆసక్తి చూపుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి.. తదితర దిగ్గజాలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు కాబట్టే ఆ ఆదరణ. రెస్టారెంట్లు కూడా పోస్టర్లను అలంకరణలో ఓ భాగం చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని కార్ఖానాలో ‘మాయాబజార్’ పేరుతో ఓ రెస్టారెంట్ కూడా ఉంది.
హిందీ సినిమాల్లో షోలే పోస్టర్లదే ఏకఛత్రాధిపత్యం. ముంబైలోని చోర్ బజార్లో ఇప్పుడు బాలీవుడ్ సినిమా పోస్టర్లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ సినిమా పోస్టర్లు అమ్మే హాజీ అబూ దగ్గర ముప్పై లక్షల హిందీ, ఇంగ్లిష్ వింటేజ్ సినిమా పోస్టర్లు ఉన్నాయి. దశాబ్దాల నుంచి నిర్వహిస్తున్న ఈషాపులో వందేళ్లనాటి పోస్టర్లు కూడా దొరుకుతాయి. షోలే విజయంలో పోస్టర్ పాత్రే ఎక్కువని అంటారు దర్శకుడు రమేశ్ సిప్పీ. షోలే తర్వాతే బాలీవుడ్ దర్శకులు పోస్టర్ల మీద దృష్టి పెట్టారని ఓ వాదన. మొఘల్-ఎ-ఆజం, ఆవారా, గైడ్, మహల్, మదర్ ఇండియా, కిస్మత్, కాగజ్ కే ఫూల్, డాన్.. సినిమాల పోస్టర్లు వాల్ ఇంటీరియర్స్‌లో భాగం అవుతున్నాయి.
టాలెంట్‌కు చేతులతో పనేంటి.. కాళ్లు, నోటితోనే అద్భుతమైన బొమ్మలు గీసేస్తున్నరు !!
కాగితాలతో అబ్బురపరిచే శిల్పాలు తయారు చేస్తున్నాడు
ఈయన బొమ్మ గీస్తే రోజూ చూసే హనుమంతుడైనా కొత్తగా కనిపించాల్సిందే !!