felix semper paper sculpture | చేతిలో కళ ఉండాలే కానీ శిల్పాలనూ కదిలించవచ్చు – అంటాడు క్యూబాకు చెందిన సెంపర్. అనడమే కాదు అక్షరాలా నిజం చేసి చూపించాడు ఈ కళాకారుడు. కదిలే బొమ్మల కనికట్టులో సూపర్ ప్రతిభ సాధించాడు సెంపర్.
రాతి శిల్పాలు, చెక్క వస్తువులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు మనకు సుపరిచితమే. క్యూబాలో పుట్టి అమెరికాలో నివసిస్తున్న ఫెలిక్స్ సెంపర్ మాత్రం వీటికి భిన్నంగా కేవలం కాగితాలతోనే శిల్పాలు రూపొందిస్తున్నాడు. ‘ఎలాస్టిక్ పేపర్ స్కల్ప్చర్’ కేటగిరీలోకి వచ్చే ఈ ఆకృతులు చూడ్డానికి రాతితోనో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో ప్రాణంపోసినట్టు అనిపిస్తాయి. చాలా దగ్గర్నుంచి చూసినా కాగితపు జాడలే కనిపించవు. కానీ బొమ్మ పూర్తయ్యాక, ఒక చివర పట్టుకుని లాగితే ఎలాస్టిక్లా సాగిపోతాయి. మహాద్భుతంగా అనిపిస్తాయి. వీటిలో మనుషుల ఆకృతుల్లో బొమ్మల్ని రూపొందించడానికి ఫెలిక్స్ ఏడువేల కాగితాల దాకా ఒకదానికొకటి ఓపిగ్గా అతికిస్తాడు. మొత్తం నెలరోజుల ప్రక్రియ ఇది. అతికించిన కాగితాల్ని కత్తుల్లాంటి పదునైన పరికరాల సాయంతో శిల్పంలా చెక్కేస్తాడు. ఆపైన రంగులు అద్దుతాడు. మనుషుల రూపాలే కాదు పిజ్జాలు, బర్గర్ల్లు, చాక్లెట్లు, కూల్డ్రింకు సీసాలు, బ్యాగులు, పర్సులు, షూలను మరిపించే యాక్సెసరీల ఆకృతుల్నీ రూపొందిస్తున్నాడు ఫెలిక్స్. వివిధ ఎగ్జిబిషన్లలో మంచి స్పందన రావడంతో నెమ్మదిగా ఈ బొమ్మల్ని అమ్మకానికి పెడుతున్నాడు. ఆర్డర్ పెడితే.. మన బొమ్మల్నీ తయారు చేసిస్తాడు. ఇంటర్నెట్ పుణ్యమాని ఈ పేపర్ జక్కన్న పేరు మారుమోగుతున్నది.