మనకు మామిడి పండ్లంటే ఎంత ఇష్టమో.నూర్ అలీ కుటుంబానికి మామిడి చెట్ల పెంపకం అంత ఇష్టం! దేశంలో పండే మామిడి రుచులే కాదు విదేశాల్లోని మామిడి రకాలు తమ తోటలో పెంచుతున్నారు. దశాబ్ద కాలానికిపైగా శ్రమించి వందల రకాల మామిడి పండ్లను ఒకే తోటలో పండిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. అదిప్పుడు మామిడి తోట కాదు మామిడి పండ్ల మ్యూజియం!
నూర్ అలీ వీర ఝరియా ఒక సాధారణ రైతు. గుజరాత్‌లోని సంగోద్రా అనే ఊరిలో ఉండేవాడు. తనకు ఆరు ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమిని అమ్ముకున్నాడు. గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భాల్ఛెల్ గ్రామంలో తక్కువ ధరకు ఎక్కువ భూమి కొన్నాడు. అతనికి మామిడి పండ్లంటే చాలా ఇష్టం. అందులో గుజరాతీలు ఇష్టపడే కేసరి రకం మామిడి మొక్కలు నాటాడు. అయిదేండ్లలో ఆయన కలలు పండాయి. మామిడి పండ్లతో లాభాల ఫలం అందుకున్నాడు. మామిడి తోటలనే మొక్కలను అంటుకట్టే నర్సరీని ఏర్పాటు చేశాడు. ఈ నర్సరీతో నూర్ అలీకి లాభాలు రెండింతలయ్యాయి.
మ్యాంగో నెట్వర్క్
నర్సరీలో మామిడి మొక్కలు కొనేందుకు వచ్చిన రైతులతో నూర్ అలీ మాటలు కలిపినప్పుడు వాళ్ల ఊళ్లలో పెరిగే మామిడి రకాల గురించి ఆరా తీసేవాడు. ఆ రైతుల సహకారంతో ఊళ్ల నుంచి కొత్త రకం మామిడి మొక్కలు సేకరించేవాడు. అలా దశాబ్దంగా ఆయన తెచ్చి నాటిన మొక్కలతో ఆయన పొలమంతా మామిడి చెట్లతో నిండిపోయింది. 14 రకాల జాతులకు చెందిన వందలాది చెట్లు ఇక్కడ నిగనిగ కాస్తున్నాయి. నూర్ కొడుకు సంషుద్దీన్ కూడా తండ్రి బాటలో నడిచాడు. కొత్తగా మరికొన్ని మామిడి రకాలను పెంచేందుకు పూనుకున్నాడు. ఇంటర్నెట్, గూగుల్ లేని రోజుల్లో ఎక్కడెక్కడ ఏ రకం మామిడి ప్రసిద్ధో తెలుసుకోవడం కష్టమైన పని. కేవలం వ్యక్తుల పరిచయాలతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మామిడి జాతుల సేకరణకు రైతులతో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని సహకారంతో రకరకాల మామిడి మొక్కలను గుర్తించి, సేకరించాడు. తండ్రీకొడుకులు దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు వెళ్లి, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న నిపుణులను కలిసేవాళ్లు. కొత్త రకం మామిడి చెట్ల గురించి తెలుసుకునేవాళ్లు. స్థానిక రైతులు పెంచుతున్న మామిడి చెట్లను పరిశీలించి, సాగు పద్ధతులను గమనించేవారు. ఆ మొక్కలు సేకరించి, తమ తోటలో పెంచేవాళ్లు. ఆ చెట్టు కాసిన తర్వాత.. ఆ పండ్లను రుచి చూసి ఇది ప్రత్యేకమైనదని నిర్థారించుకుంటారు. తర్వాత ఆ రకం చెట్ల పెంపకానికి పూనుకునేవాళ్లు. ఇలా అనేక రకాలైన మామిడి చెట్లను ఒకే తోటలో పెంచుకుంటూ పోతున్నారు.
దేశ, విదేశీ రుచులు
కొంకణ్ పోతే అక్కడ అల్ఫోన్సో మామిడి దొరుకుతుంది. యూపీలో దశేరి ఇష్టపడతారు. గుజరాత్లో కేసరి పండ్లకు గిరాకీ. తెలుగు రాష్ర్టాల్లో బంగినపల్లి మామిడి పండ్లు ప్రత్యేకం. దక్షిణ భారత దేశంలో చంద్రమా రకం బాగా కొంటారు. ఉత్తర భారతంలో చౌన్సా లంగ్డా ఎక్కువగా ఇష్టపడతారు. ఝరియా కుటుంబం తోటకు వెళ్తే దేశంలోని అన్ని రకాల మామిడి పండ్లనూ రుచి చూడొచ్చు. విదేశాలకు చెందిన అమ్రఫలం చెట్లు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. అమెరికా, థాయ్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌తోపాటు ఐరోపా దేశాలలోనే పండే మామిడి మొక్కలను సేకరించి, ఇక్కడ పెంచుతున్నారు. ఝరియా వారి 12 ఎకరాల తోటలో ఇప్పుడు 230కి పైగా రకాల మామిడి చెట్లున్నాయి. ఒకే రకమైన మామిడిని సాగు చేసే కంటే పలు రకాల మామిడి ఫలాలను సాగు చేయడం వల్ల రైతుకు ఎక్కువ లాభాలున్నాయని అంటారు వీళ్లు. రైతులు తోటలో కనీసం పది శాతం అయినా భిన్నమైన మామిడి చెట్లను పెంచాలని, ఇది పరపరాగ సంపర్కానికి దోహదపడి రైతుకు మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఒకే చెట్టుకు పలు రుచులు!
ఒక మామిడి మొక్క పెరిగి, పూతకొచ్చి, కాపు కాసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి దాకా వచ్చే కొన్ని తెగుళ్లను ఆ చెట్లు తట్టుకుని నిలబడాలి. ఒకవేళ అది చనిపోతే ఎంతో దూరం నుంచి సేకరించి, పెంచిన శ్రమంతా వృథాగా పోతుంది. అందుకని అరుదైన మామిడి రకాన్ని నిలబెట్టుకునేందుకు అంటుకట్టు విధానాన్ని పాటిస్తున్నారు. సేకరించిన మొక్కను పెంచుతూనే, దాని శాఖను ఒకటి కత్తిరించి, మరోమొక్కకు అంటు కడతారు. సేకరించిన మొక్క తెగుళ్ల బారినపడి చనిపోయినా మరో మొక్కకు ఆ రకం మామిడి పండ్లు కాస్తాయి. ఇలా చేయడం వల్ల ఒకే చెట్టుకు పలురుచుల మామిడిపండ్లు పండిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. ఝరియా కుటుంబం పెంచుతున్న ఈ మామిడి తోటలో అంటుకట్టిన మామిడి చెట్లలో ఒక చెట్టుకు 80 రకాల మామిడి పండ్లు కాస్తున్నాయి. అద్భుతం కదా!
మ్యాంగో హౌస్
ఝరియా కుటుంబం సాగు చేస్తున్న మామిడి తోటలో పెద్ద పరిమాణంలో ఉండే మామిడి పండ్లు కాస్తాయి. టెంక లేని సింధూ రకం బాపతు 117 చెట్లున్నాయి. మూడు నెలలకు ఒకసారి కాపుకొచ్చే కటిమోన్, బజరంగ్ బరమాసి, బరమాసి వల్సాడ్ వంటి మామిడి చెట్లున్నాయి. వీటి కాపు చూడాలని, సాగు తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి. అరుదైన మామిడి పండ్లను రుచి చూసేందుకు, ఆ చెట్ల మధ్య విహరించేందుకు సందర్శకులు కూడా వస్తుంటారు. మామిడి తోటను చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఒక ఫామ్‌హౌస్ నిర్మించారు. ఈ విడిదింట్లో ఉంటూ సేంద్రీయ పద్ధతిలో మామిడి సాగు గురించి తెలుసుకుని పోవచ్చు. రైతులు ఇక్కడే ఉండి సాగు పద్ధతులను నేర్చుకునే అవకాశం కూడా ఉంది.