అందంలో అద్భుతం. హావభావాలు పలికించడంలో అత్యద్భుతం. ఈ కేరళ కుట్టి ఒక్క నవ్వు రువ్విందంటే తపోనిష్ఠలో ఉన్న ముని కూడా మాసిన గడ్డాన్ని సవరించుకోవాల్సిందే! యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్.. ఇలా అనేక కళల్లో ప్రావీణ్యం ఉన్న కథానాయిక నివేదా థామస్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్లో టాప్‌హీరోల సరసన వరుస చాన్స్‌లు కొట్టేసిన నివేద కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. లేటెస్ట్గా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ‘35 చిన్న కథ కాదు’ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని పరిచయం చేస్తూ అభిమానులకు షాకిచ్చిన నివేద పంచుకున్న కబుర్లు ఇవి..
ఒక్కో పరిశ్రమకు ఒక్కో ప్రత్యేకత, శైలి ఉంటాయి. బలమైన కథనాలకు మలయాళ సినిమా, వైబ్రెంట్, ప్రయోగాత్మక చిత్రాలకు తమిళ సినిమా ప్రాధాన్యం ఇస్తాయి. అదే తెలుగు సినిమాకు వస్తే.. గ్రాండియర్ లుక్, మాస్ అప్పీల్ కనిపిస్తుంది. వివిధ భాషా చిత్రాలు చేయడం వల్ల.. నటిగా ఎన్నో నేర్చుకోగలిగాను. నేను నటిగా ఎదగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది.
వైవిధ్యం ఉన్న పాత్రలు ఎంచుకోవడానికి ఇష్టపడతాను. ‘నిన్ను కోరి’లో అలాంటి విభిన్నమైన క్యారెక్టరే! ఆ సినిమా ైక్లెమాక్స్ చేసేటప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యా. చాలా రోజులు షూటింగ్ జరిగింది. ప్రతిరోజూ ఎమోషన్ అయ్యేదాన్ని. నిజానికి ఆ ఎండింగ్ నప్పుతుందో లేదో అని భయపడ్డా! కానీ, మేం ఊహించిన దాని కన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అది చూసి నేను పడిన కష్టమంతా మర్చిపోయా.
ఏ పనిచేసినా పక్కాగా చేయాలి అనుకుంటాను. నేను ఏదైనా కథ విన్నప్పుడు, అందులో నా పాత్రను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ క్యారెక్టర్లోకి వెళ్లిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. షూటింగ్ పూర్తయ్యే దాకా.. అదే పాత్రతో ట్రావెల్ చేస్తాను.
నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ట్రావెలింగ్ అంటే ప్రాణం. కొత్త విషయాలు తెలుసుకోవడానికి పుస్తకాలు గొప్పమార్గం. ఇక విహారంలో ఎన్నో సంస్కృతులు పరిచయం అవుతాయి. ఎందరో కొత్తవ్యక్తులు తారసపడతారు. ఈ ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో దర్శించగలుగుతాం.
నేను చాలా చిన్న వయసులోనే నటించడం మొదలుపెట్టాను. ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చాను. ఎలాంటి కష్టం లేకుండానే మొదటి అవకాశం అందుకున్నా. బుల్లితెరపై కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లోకి వచ్చాను. నా కెరీర్ విషయంలో నా తల్లిదండ్రుల మద్దతు ఎప్పుడూ ఉంది.
ఎన్ని సినిమాలు చేశాం అనేదానికన్నా ఎలాంటి సినిమాలు చేశామనేదే ముఖ్యం. అందుకే కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటా. ఏ పాత్ర పోషించినా,
ఏ సినిమాలో నటించినా డబ్బులు వచ్చినా, రాకపోయినా నటిగా నేను సంతృప్తి చెందాలి. అప్పుడే తెరపై నేను కాకుండా పాత్ర కనిపిస్తుంది.
విజయం ఒక్కరోజులోనే రాదు. కష్టపడాలి.. నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి. జీవిత ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ఓపిక చాలా అవసరం. నటనపై ఇష్టాన్ని తెరపై కనిపించేలా పాత్రలో ఇమిడిపోవాలి.. అప్పుడు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.