మీసాల పిల్ల.. అని నయన్‌ను ఊరికే ఉడికించలేదు మెగాస్టార్. ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏండ్లు దాటింది. అప్పుడెప్పుడో చంద్రముఖిలో ‘కొంత కాలం.. కొంత కాలం..’ అంటూ తెరంగేట్రం చేసింది. ఎంత కాలం గడిచినా.. తన కవ్వింత ఇంత కూడా తగ్గలేదని నిరూపించుకుంది నయనతార. ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’లో చిరంజీవితో కలిసి ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నది. ఈ సందర్భంగా నయన్ పంచుకున్న కబుర్లు ఇవి..
కష్టం వచ్చినప్పుడు తప్పించుకోవడం కాకుండా దాన్ని ఎదుర్కోవడమే నేను నేర్చుకున్న గొప్ప పాఠం. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో నా పాత్ర డైలాగులు పలకడంలో, భావోద్వేగాలు పలికించడంలో ఒత్తిడికి గురయ్యేదాన్ని. దీంతో రాత్రంతా కూర్చొని, డైలాగులు ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా నన్ను నేను మెరుగుపర్చకున్నాను.
అందరూ అనుకున్నట్లు నా ఫిట్నెస్ సీక్రెట్ ఖరీదైన జిమ్ వర్కవుట్స్, ఫ్యాన్సీ కాస్మోటిక్స్ కాదు. సింపుల్ డైట్ ఫాలో అవుతాను. సౌత్ ఇండియన్ మెనూ పాటిస్తాను. రోజూ పరగడపున వెజిటబుల్ జ్యూస్, మజ్జిగ తాగుతాను. మధ్యాహ్నం భోజనంలోకి పప్పు, సాంబార్, రసం, పెరుగు తీసుకుంటాను. రాత్రి రాగి జావ, సిరిధాన్యాల రొట్టే లేదా లైట్ ఇడ్లీ తింటాను. వేసవిలో మామిడిపండ్లు ఆస్వాదిస్తూ తింటాను. రెగ్యులర్‌గా అరటిపండ్లు తీసుకుంటాను.
ఒక తల్లిగా పిల్లలే నాకు పెద్ద ఆస్తి. షూటింగ్లో అలసిపోయి ఇంటికి వచ్చేలోపే పిల్లలు పడుకుంటారు. అయినా వారి పక్కన కూర్చొని మాట్లాడుతాను. అదే నాకు పెద్ద రిలాక్సేషన్.
చిరంజీవి పెద్ద స్టార్ అయినా చాలా నిరాడంబరంగా ఉంటారు. ప్రతి విషయాన్నీ ఓర్పుగా వింటారు. గాడ్‌ఫాదర్‌లో ఆయనతో కలిసి నటించాను. తాజాగా‘మన శంకరవరప్రసాద్ గారు’లో ఆయనకు జోడీగా చేశాను. ఆయన టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆయనతో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.
బాలకృష్ణతో ఇప్పటికే సింహా, జై సింహా, శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకోగలిగాను. శ్రీరామరాజ్యంలో సీతాదేవిగా నటించి ప్రేక్షకుల మదిలో దేవతలా నిలిచిపోయా. బాలయ్యతో నాలుగో సినిమాకు కూడా ఒకే చెప్పాను. ఇందులో నేను కొత్తగా కనిపిస్తాను.
విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్నాక ప్రేమ విలువ తెలిసింది. రోజూ కలిసి భోజనం చేయడం మా ఇద్దరి అలవాటు. మొదటి ముద్ద నాకు తినిపించాకే శివన్ తింటాడు. ఆ సందర్భాన్ని నేను తెగ ఎంజాయ్ చేస్తాను. మా మధ్య చిన్నాచితకా గొడవలు అయినా.. తొలిముద్ద పెట్టకుండా ఉండడు.