పొద్దున లేవగానే ఒకటే ఉరుకులు పరుగులు. స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఓవైపు.. ఆఫీస్‌కి రెడీ అవుతూ భార్యాభర్తలు మరోవైపు.. ఈ సమయంలో అందరికీ కావాల్సింది బ్రేక్‌ఫాస్ట్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకునే వారే ఈరోజుల్లో ఎక్కువ. ఎందుకంటే.. రోజూ స్పెషల్స్ ఉండవుకదా. ఇలాంటి సందర్భాల్లో చటుక్కున బ్రెడ్‌ని క్షణాల్లో టోస్ట్ చేసి ఇచ్చేస్తే!! సూపర్ కదా.. అందుకే బజాజ్ అందుబాటులోకి తెచ్చిన ATX 4 750-Watt 2-Slice Pop-up Toasterని వంటగదిలో పెట్టేయండి. 6 రకాల పద్ధతుల్లో బ్రెడ్‌ని టోస్ట్ చేసేస్తుందిది. ఒకవేళ ఎక్కువ మాడిపోతుందేమో అనిపిస్తే.. మధ్యలోనే బయటికి తీసేందుకు ‘మిడ్ క్యాన్సిల్’ ఫీచర్ కూడా ఉంది. ఇంకా డస్ట్ కవర్, ైస్లెడ్ అవుట్ క్రబ్ ట్రే లాంటి అదనపు ఫీచర్లూ ఉన్నాయి.
అలనాటి మధుర గీతాల్ని తాత ముత్తాతలు గ్రామఫోన్‌లో వింటూ ఎంజాయ్ చేసేవారని వినుంటాం. కొన్ని సినిమాల్లోనూ చూసుంటాం. ఇప్పుడూ అదే ఫీల్‌తో మ్యూజిక్ ట్రాక్స్ వినేద్దాం అనుకుంటే.. ఈ గ్రామ్‌ఫోన్‌ని ట్రై చేయొచ్చు. దీని పేరు కూడా Vintage Gramophone Bluetooth Speaker. రెట్రోలుక్తో కాస్త మోడ్రన్‌గా దీన్ని డిజైన్ చేశారు. బ్లూటూత్ 5.0 వెర్షన్‌తో కనెక్ట్ అవుతుంది. 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్ పనిచేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 6 గంటలు పనిచేస్తుంది. 3.5 జాక్తోనూ స్పీకర్‌ని కనెక్ట్ చేయొచ్చు. ఎక్కడికైనా సౌకర్యంగా తీసుకెళ్లి మ్యూజిక్ మస్తీ చేయొచ్చు. కార్డ్ రీడర్ కూడా ఉంది. పాటలు వినడమే కాదు.. ఫోన్ కాల్స్‌ను కూడా ఈ స్పీకర్ నుంచే స్వీకరించొచ్చు.
ఉద్యోగంలో భాగంగానో.. వ్యక్తిగతంగానో ఎక్కువగా వీడియో లేదా వాయిస్ కాల్స్ మాట్లాడాల్సి వస్తున్నదా? అయితే, మీ కోసమే ఈ హెడ్‌ఫోన్స్. అమెజాన్ కంపెనీ ‘బేసిక్స్’ పేరుతో అందించే ఉత్పత్తుల్లో ఇదొకటి. నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ హెడ్‌ఫోన్ పనిచేస్తుంది. ఎక్కువ సమయంపాటు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీటిని డిజైన్ చేశారు. రెండు మఫ్స్ చెవుల్ని పూర్తిగా కవర్ చేయడం వల్ల సౌండ్ చక్కగా (7.1 చానెల్ వర్చువల్ సరౌండ్ ఆడియో) వినిపిస్తుంది. గేమింగ్ ప్రియులకూ చక్కని ఎంపిక. మల్టీ ప్లేయర్ గేమింగ్‌లో సహచరులతో సంభాషిస్తూ చలాకీగా గేమ్స్ ఆడొచ్చు.
ఇంటిల్లిపాదీ ఎవరి పనిలో వాళ్లు బిజీనే. అయినప్పటికీ ఇల్లాలు మాత్రం ఇంటినీ, ఆఫీస్‌నీ బ్యాలెన్స్ చేయాల్సిందే! వంటలు ఓవైపు.. ఇంటి పరిశుభ్రత మరోవైపు. తెగ హైరానా పడిపోవడం చూస్తూనే ఉంటాం. అందుకే అమ్మకు కాస్త పనిభారం తగ్గించేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటే సరి. అదెలాగంటే.. ఇదిగో ఈ వాక్యూమ్ క్లీనర్‌తో. షావోమీ కంపెనీ దీన్ని తయారుచేసింది. పేరు Xiaomi Robot Vacuum Cleaner S10. దీన్ని ఇంట్లో అమ్మకు స్మార్ట్ అసిస్టెంట్‌గా పెట్టేయొచ్చు. ఇంట్లో ఓ మూల సెట్ చేస్తేచాలు.. ఇల్లంతా నాదే అంటూ.. తుడిచేస్తుంది. ఆ వెంటనే తడిగుడ్డ పెట్టేస్తుంది. రోజులో ఎన్నిసార్లు.. ఎక్కడెక్కడ తుడవాలి.. మాప్ పెట్టాలి అనేవి క్లీనర్‌లో సెట్ చేస్తే చాలు. ఆ సమయం కాగానే ఆటోమేటిక్‌గా దానంతట అదే డాక్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తుంది. మ్యాపింగ్ చేసిన ప్రకారం మాప్‌తో తుడిచేస్తుంది. గదిలో వస్తువుల్ని లేజర్ కిరణాల సాయంతో గుర్తిస్తూ.. చకచకా సోఫాలు, టేబుల్స్ కింద కూడా శుభ్రం చేస్తుంది. గదుల్లో పోగైన చెత్త ఆధారంగా మోడ్స్ సెట్ చేసుకునే వీలుంది. క్లీనర్ బ్యాటరీ సామర్థ్యం 3,200 ఏంఏహెచ్. స్టాండర్డ్ మోడ్‌లో 130 నిమిషాలపాటు పనిచేస్తుంది. ఫోన్‌నే రిమోట్‌గా చేసుకుని బయటినుంచే ఈ క్లీనర్‌కు ఆదేశాలు జారీచేయొచ్చు.