‘తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి..’ ఇది మన తెలుగువారి నానుడి. అంత అద్భుతమైన మహాభారతంలో రసవత్తర ఘట్టం విరాటపర్వం. ఇదే ‘కీచక వధ’గా, ‘నర్తనశాల’గానూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. విరాటపర్వం ఆధారంగా పలు సినిమాలు తెరకెక్కినా.. నాటకంగా దీనికి ఉన్న ప్రశస్తి వేరు. నేటికీ ఈ నాటకానికి ఆదరణ తగ్గలేదు. ఆ విశేషాలే ఈ వారం..
రైతుల పన్నెండేండ్ల వనవాసం తర్వాత పాండవులు ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. పంచ పాండవులు, ద్రౌపది మారుపేర్లతో మత్స్యదేశపు ప్రభువైన విరాటరాజు కొలువులో చేరతారు. ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వంటచేసే వలలుడిగా, అర్జునుడు పేడి రూపంతో బృహన్నలగా, నకులుడు గుర్రాల కాపరి గ్రంథికుడిగా, సహదేవుడు ఆలమందల ఆలనాపాలనా చూసుకునే తంత్రీపాలుడిగా అజ్ఞాతవాసం ప్రారంభిస్తారు. పాండవ పట్టమహిషి ద్రౌపది సైరంధ్రిగా రంగప్రవేశం చేస్తుంది. మత్స్యదేశపు మహారాణి సుధేష్ణాదేవి ఆంతరంగిక పరిచారికగా జీవితం గడుపుతుంటుంది.
అజ్ఞాతవాసంలో భారంగా రోజులు గడుపుతున్న పాండవులకు ఓ చిక్కొచ్చి పడుతుంది. మహారాణి సోదరుడు కీచకుడు సింహబలుడు. రాజ్యంగేతర శక్తిగా దేశాన్ని శాసిస్తుంటాడు. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని నిశ్చయింకుంటాడు. అధికారం, అహంకారం, ఆరోగ్యం, వయసు, మగవాడినన్న దురహంకారం ఇలా పంచమదాలతో విర్రవీగుతుంటాడు. ఓ రోజు కీచకుడు.. ద్రౌపదిని చెరపట్టేందుకు ప్రయత్నించగా ‘రక్షించండీ..’ అంటూ ఆమె నిండు పేరోలగంలో ప్రవేశిస్తుంది. సభయావత్తు మాన్పడిపోయి స్తంభిస్తుంది. ఎవరూ పల్లెత్తి మాట్లాడరు. ఆమె అయిదుగురు భర్తలు సహా… అప్పుడు ద్రౌపది ఆక్రోశంతో… ‘ఇంత బహిరంగంగా పట్టపగలు నాపై అత్యాచారం జరుగుతుంటే ఒక్కరు మాట్లాడరు. మీ అధికారమెందులకు? పదవులెందుకు? న్యాయ సూత్రాలెందుకు?’ అంటూ అప్పుడు ద్రౌపది వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ మనకు సమాధానం దొరకదు. ప్రాసంగికత అది.
విధిలేని పరిస్థితుల్లో కీచకాంతానికి పాండవులు ద్రౌపది, కృష్ణునితో కలిసి ప్రణాళిక రచిస్తారు. ద్రౌపది నేర్పుగా రాత్రి నర్తనశాలకు రమ్మని కీచకుడికి కబురు చేస్తుంది. అక్కడ ద్రౌపది ముసుగులో భీముడు ఉంటాడు. కాముకావేశంలో వచ్చిన కీచకుడిని భీముడు నిశ్శబ్దంగా మట్టుబెడతాడు. కథ సుఖాంతమవుతుంది.
కోనేటి సుబ్బరాజు రచనా దర్శకత్వంలో మార్చి 25న నర్తనశాల పద్య నాటకాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించారు. రసరంజని 32వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ ప్రదర్శన జరిగింది. మొత్తం నాటకం రెండున్నర గంటలకుపైగా సాగింది. నాందీ ప్రస్తావనగా భీమునిచే హిండింబాసురిని వధ, బకాసుర వధ, జరాసంధ వధ చూపిస్తారు. పద్యనాటకాన్ని గ్రామాల్లో మూడు, నాలుగు గంటలైనా చూస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో నాటక వీక్షణకు ప్రేక్షకులు రావడం అరుదు.
పద్యం తెలుగువారికి హృద్యమైనది. శ్రుతి పక్వరాగాలాపనతో కూడిన భావయుక్త పద్యపఠనం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. అదే దృశ్యమాధ్యమం అయితే ఇక చెప్పేదేముంది! అందుకే ఇది తెలుగువారి సొత్తు! పద్యనాటకమే 20వ శతాబ్దాన్ని ఏలినట్టు సినారె ప్రకటించారు. పౌరాణిక పద్య నాటకాల్లోని రూపలావణ్యం, ఆహార్యం, వచనం, గేయం, పద్యం, సంగీతం, నృత్యం, రంగాలంకరణ, రంగోద్దీపనం, అభినయం.. ఇలా అన్నీ ఒకదానితో ఒకటి తులతూగుతూ ప్రేకక్షకులను రసార్ణవంలో బందీచేస్తాయి. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ, పద్య నాటకాన్ని మించిన రసరమస్య కావ్యం మరొకటి ఉండదేమో!
నాటకం : నర్తనశాల
రచన, దర్శకత్వం: కోనేటి సుబ్బరాజు
సమర్పణ: సుబ్బరాజు
నాటక కళాపరిషత్, తిరుపతి
నటీనటులు: బాబు రాజు,
రఘురాం, డి.ఎస్.వి. రావు,
మల్లికార్జునయ్య, సుబ్రహ్మణ్యం,
సురభి రమాలక్ష్మి, సురభి వెంగమాంబ,
సురభి హారిక తదితరులు..
సాంకేతిక వర్గం: సురభి సంతోష్,
శ్రీనివాసాచారి, రెడ్డి శంకర్,
కొండలరావు తదితరులు