ఘోటకముఖుడు తన కథ చెబుతున్నాడు. ..అలా తన భార్య అయిన మిత్రవింద చేత ప్రబోధింపబడిన చక్రధర నాయకుడు.. భోజనం తరువాత నన్ను కచేరీ చావిడికి తీసుకువెళ్లాడు. అక్కడ విపులుని నగరం నుంచి చక్రధరుడు వెంటబెట్టుకుని తెచ్చిన వేశ్యాపుత్రికలు ఉన్నారు. మమ్మల్ని చూడటంతోనే లేచి నిలబడ్డారు. “అమ్మాయిలూ! మీరెవరో, ఎక్కడినుంచి వచ్చారో వివరంగా చెప్పండి. మీ స్వస్థానానికి మిమ్మల్ని చేర్చే పూచీ నాది” అన్నాడు చక్రధర నాయకుడు.“మహారాజా! మాది పాటలీపుత్రం. మేము రతినూపుర అనే వేశ్యపుత్రికలం. నా పేరు చిత్రసేన, దీనిపేరు రతిమంజరి.
నా భర్త దత్తుడనే విద్వాంసుడు. దీని భర్త గోణికాపుత్రుడు. మేము తల్లి సంపదలను, గుణాన్నీ వదిలేశాం. మగనాలులుగా మారిపోయాం. గోణికాపుత్రుని వెంట దత్తుణ్ని కలుసుకోవడానికి ధారానగరం వెళ్తుండగా.. ఒక మతంగ యోగిని మా వెంట పడింది. ‘మేం వేశ్యాధర్మాలను విడిచిపెట్టాం’ అని ఎంత చెప్పినా వినలేదు. చివరికి ధారానగరం నుంచి ఒక బండిలో మమ్మల్ని బలవంతంగా తీసుకుపోయి, విపులుడనే మహారాజు చెంతకు చేరింది. వెలయాలికి నీతి ఎక్కడిదని ఆ మహారాజు మమ్మల్ని ఈసడించాడు. అయినా మేము మా వ్రతాన్ని విడిచిపెట్టలేదు. ఇంతలో అతగాడు మిమ్మల్ని ఎందుకో పిలిపించాడు. మీవెంట పంపాడు. ఇదీ జరిగింది” అని చిత్రసేన చెప్పడం పూర్తి చేసింది.
ఆ మాటతో నాకు మేను ఉప్పొంగింది.
“రాజా! ఈ గణికల భర్తలు నాకు ప్రాణస్నేహితులు. ప్రస్తుతానికి వారు ధారానగరంలో ఉన్నారు. వీళ్లను తమ భర్తలతో కలిపే బాధ్యత నాకు అప్పగించండి. నేను తీసుకువెళ్తాను” అని కోరాను.
“అంతకంటే కావాల్సింది ఏముంది? మీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడ విశ్రాంతి తీసుకుని బయల్దేరవచ్చు” అని సెలవిచ్చాడు చక్రధరుడు. నేను ఒకనాడు చక్రధరుని ఇల్లాలు మిత్రవిందతో.. ఆమెను పరమ పతివ్రత, దత్తభాగవతంలో గొప్ప వైరాగ్యభోధ చేసిన మహాతల్లి అయిన మదాలసతో పోల్చాను. మదాలస చరితాన్ని ఆమె మనసుకు ఆనందం కలిగేలా చెప్పాను. దాంతో పరోక్షంగా త్వరలో నీకు పుత్రసంతానం కలగాలి! అని కథాశ్రవణ ఫలరూపంగా ఆశీర్వదించినట్లయింది.
వారు ఆ కథ విని ఆనందిస్తున్న సమయంలో.. ముసలావిడతో నా మనోభీష్టాన్ని తెలియచేశాను. దానికి చక్రధర నాయకుడు, మిత్రవింద సైతం ఆమోదించారు. సుముహూర్తం చూసి, వారి కుమార్తె అయిన జాంబవతిని నాకిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం ఆమెతో సుఖించిన తరువాత, నాకు మిమ్మల్ని కలుసుకోవాలనే సంగతి జ్ఞాపకం వచ్చింది. చిత్రసేనను, రతిమంజరిని వెంటబెట్టుకుని ఇలా వచ్చేశాను. మీరున్న చోటు తేలికగానే తెలుసుకోగలిగాను. ఇదీ జరిగింది.
..అని ఘోటకముఖుడు తన కథను పూర్తి చేశాడు.
“మిత్రమా! నీకొక సంగతి చెప్పనా?” అని
అడిగాడు గోణికాపుత్రుడు.
“ఏమిటీ!?” అని ఘోటకముఖుడు ఆశ్చర్యంగా చూస్తుండగానే..
“ఇంతకాలం నుంచి ఏ మహాసాధ్విని రక్షించడానికి నువ్వు ప్రయత్నించావో ఆ లీలావతి.. ఇప్పుడిక్కడే ఉంది” అని పూర్తి చేశాడు.
“మిత్రమా! ఇంకో ఆశ్చర్యం కలిగించే సంగతి చెప్పనా?” అన్నాడు సువర్ణనాభుడు.
మధ్యలోనే గోణికాపుత్రుడు అందుకుని..
“నువ్వు ఇంతకాలం ఏ పెద్దమనిషికి సహకరించి, ఈ లీలావతిని ఆయనతో కలపాలని ప్రయత్నించావో.. ఆ పెద్దాయన మరెవరో కాదు.. సాక్షాత్తూ భోజ మహారాజు” అని చెప్పాడు.
ఘోటకముఖుడికి మరింత ఆనందం కలిగింది.
చారాయణుడు కొనసాగిస్తూ..
“నన్ను గాడిదగా చేసిన భైరవుడే భోజ మహారాజును, ఆయన భార్య లీలావతిని కూడా జంతువులుగా మార్చాడు. భోజులవారు వాడి బారినుంచి కాళిదాసు చాతుర్యంతో తప్పించుకున్నారు. మహారాణి లీలావతి కూడా ఇదిగో.. ఈ సువర్ణపదిక వల్ల తన పూర్వరూపానికి రాగలిగారు” అని చెప్పాడు.
మిత్రుల మధ్య ఆ మాటలు జరుగుతుండగా, మేలిముసుగు మాటున లీలావతి వారి వద్దకు వచ్చింది. ఘోటకముఖునికి నమస్కరించింది.
అతడు సంతోషించాడు.
“ఇంతకూ మన దత్తకుడేమయ్యాడు?” అని
ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు సువర్ణనాభుడు సమాధానమిచ్చాడు.
“ఒక యక్షుని శాపం వల్ల మన దత్తకుడు స్త్రీగా మారాడు. ఏడాది తరువాత తన పూర్వరూపానికి వచ్చాడు. కానీ, శాపావశాన్ని చెబుతూ యక్షుడు పెట్టిన నియమాన్ని మరిచిపోయి, మళ్లీ స్త్రీరూపానికి మారిపోయాడు. నిజానికి వాడెక్కడున్నాడో తెలియదు. కానీ, యువరాజు చిత్రసేనుల వారి ప్రియురాలిగా ఉన్నది వాడేనని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు!”.
“ఏమిటీ గందరగోళమంతా.. వాడే అని మనకు తెలిసి ఉంటే మనమే వెళ్లి, గతాన్ని గుర్తుచేద్దాం. ఆ యక్షుడు ఎక్కడున్నాడో తెలుసుకుని, మన్నించమని కోరుదాం” అన్నాడు ఘోటకముఖుడు సాలోచనగా.
“ఆ అవకాశమే లేదు. భైరవుడు ఆ యక్షుణ్ని కూడా ఏదో జంతువుగా మార్చాడు. ముందు వాడి భరతం పడితే తప్ప, మనం దత్తకుణ్ని రక్షించుకోలేం” అని చెప్పాడు సువర్ణనాభుడు.
“మరో రెండురోజుల్లో ఆ భైరవుడి జంతుప్రదర్శన జరగబోతున్నది. అప్పుడు నా సిద్ధులతో వాణ్ని భయపెడతాను. లొంగివచ్చేలా చేస్తాను. వాడు జంతువులుగా మార్చిన వారందరినీ విడిపిస్తాను” అని కుచుమారుడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రదర్శన రోజు రానేవచ్చింది. పురమందిరంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. దాదాపు వెయ్యిమంది ప్రేక్షకులు వచ్చారు. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా ఆసనాలు సమకూర్చారు. లీలావతి, రుక్మిణి మొదలుగా గల స్త్రీలందరూ ఒకపక్క కూర్చున్నారు.
చారుమతి వేషంలో ఉన్న దత్తకుడు కూడా.. ప్రదర్శన చూసివద్దామని యువరాజు చిత్రసేనుణ్ని తెగ బతిమాలాడు. దాంతో చిత్రసేనుడు ఒక ఆలోచన చేశాడు. చారుమతికి పురుష వేషం వేయించాడు. వారిద్దరూ ఎవరికంటా పడకుండా ఒకమూలగా కూర్చున్నారు.
కుచుమారుడు మొదలైన ఆరుగురు మిత్రులూ ఒక దగ్గర కూర్చున్నారు. కాళిదాసుతోసహా భోజరాజు సమయానికి విచ్చేశాడు. ఘోటకముఖుడు ఆయనను సందర్శించాడు.
భోజరాజు తనకు ఎంతో సాయం చేసిన ఘోటకముఖుణ్ని ఆలింగనం చేసుకుని, సన్మానించాడు.
“ఆహా! నా లీలావతి కూడా లభిస్తే నా జీవితంలో ఇదే సుదినం అవుతుంది” అన్నాడు ఆనందబాష్పాలు రాల్చుతూ.
“మహారాణిగారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రభూ!” అని ఘోటకముఖుడు విన్నవించాడు.
“ఈ ప్రదర్శన పూర్తయిన తరువాత ఆమెను కలుసుకోవచ్చు” అని చెప్పాడు.
భైరవుడి జంతు ప్రదర్శన మొదలైంది.
క్రూర జంతువులు, అడవి జంతువులు, పెంపుడు జంతువులు అనేకం బోనులలో వేదిక మీదికి తీసుకువస్తున్నారు. ఒక్కొక్క జంతువు చేత ఒక్కొక్క విన్యాసం చేయించసాగాడు భైరవుడు.
కొద్దిసేపటి తరువాత కుచుమారుడు పైకిలేచాడు. వేదికను సమీపించాడు. తన మెడలోని అస్థిమాలను చేత పట్టుకుని, మృగాలనే చూస్తూ హుంకారహేల చేశాడు. అంతే.. వెనువెంటనే మృగాలన్నీ వచ్చి కుచుమారుని పాదాలవద్ద వినయం చూపుతూ నిలిచిపోయాయి.
భైరవుడు తన చేతనున్న బెత్తాన్ని చూపిస్తూ వెనక్కు రమ్మని ఒక ఎలుగుబంటిని పిలిచినా, వెనక్కి పోలేదు. బెత్తంతో కొట్టబోయేసరికి బొబ్బపెడుతూ భైరవుణ్ని రక్కింది. మరో పులిని బెదిరించేసరికి, కరవబోయింది. భైరవుడు ఎంతగా ప్రయత్నించినా ఏ మృగమూ వెనుతిరిగి రాలేదు. అప్పుడు వాడు చెయ్యెత్తి కుచుమారుడి వైపు చూపిస్తూ..
“వీడెవడో ప్రయోగం చేశాడు మహారాజా! ఇలా అయితే నా ప్రదర్శన జరిగేట్లు లేదు. వీణ్ని ప్రయోగం ఉపసంహరించమని ఆజ్ఞాపించండి” అని భోజరాజును ప్రార్థించాడు.
వెనువెంటనే చారాయణుడు పైకి లేచాడు.
“ఓరీ! నన్నెప్పుడైనా చూశావా? నా ముఖం చూసి చెప్పు” అని గద్దించాడు.
భైరవుడు గుటకలు మింగాడు.
“గురువును చంపిన మహాపాతకుడా! నీ పాపం నేటికి పండింది” అన్నాడు చారాయణుడు.
“ఆడవారిని చెరపట్టిన నీకు ఏ శిక్ష విధించినా తక్కువే!” అని ఘోటకముఖుడు గద్దించాడు.
ఇంతలో వేదికమీద నుంచి భైరవుడు పారిపోతుండగా కోతులు ఆటంక పరిచాయి. కుక్కలు తరిమాయి. గుర్రాలు తన్నాయి. వాడు వేదికపైనే అటూఇటూ పరుగెడుతుండగా.. ప్రేక్షకులు గొల్లున నవ్వసాగారు.
కుచుమారుడు మరోసారి హుంకారం చేశాడు. ఒక ఎలుగుబంటి వెళ్లి, భైరవుణ్ని చాచి లెంపకాయ కొట్టింది. వాణ్ని లాక్కువచ్చి, కుచుమారుని పాదాలమీద పడేసింది. కుచుమారుడు అప్పుడు భైరవుడి తలను పాదాలతో తన్నుతూ..
“గురుద్రోహీ! పరమ తపోనిధి అయిన ఆ సిద్ధుని పరిమార్చి ఏం గొప్ప సంపదలు మూట కట్టుకున్నావు? యముడు నీ నిమిత్తమై కొత్త నరకాన్ని కట్టిస్తున్నాడు. పదపద. నీవింక ఈ భూమిలో ఉండదగినవాడవు కావు” అని పలికాడు.
భైరవుని కాళ్లకు, చేతులకు సంకెళ్లు తగిలించారు.
ఆరుగురు మిత్రులూ కలిసి, జంతువులన్నిటినీ పరీక్షించ సాగారు. వాటి మెడల్లోని తాయెత్తులను లాగివేయసాగారు. ప్రతిఒక్క జంతువు నుంచీ ఒక్కొక్కరు చొప్పున మనుషులే వస్తున్నారు. వారిలో యక్షుడు కూడా ఉన్నాడు.
సువర్ణనాభుడు తన తోడల్లుడైన యక్షుని వద్దకు వెళ్లి..
“మహాభాగా! రండి. మేమంతా మీకోసమే చూస్తున్నాం!” అంటూ తనతో తీసుకువెళ్లాడు.
భోజమహారాజుకు ఆ యక్షుణ్ని చూపించాడు.
“మహాత్మా! నువ్వు మానవాతీతుడివి. అయినా మాతోపాటు కలిసిమెలిసి తిరుగుతూ మహోపకారాలు చేశావు. నీ దయ లేకపోతే ఆ భైరవుని వల్ల చారాయణుడు ఈపాటికి పిండివంటగా మారి ఉండేవాడు. నా భార్యను రక్షించడం కోసం కూడా మీరెంతో శ్రమ తీసుకున్నారని తెలిసింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు” అని యధోచితంగా స్తోత్రం చేసి, నమస్కరించాడు.
తన చరిత్రను కావ్యరూపంగా రచించిన కాళిదాసుకు, యక్షుడు పాదాభివందనం చేశాడు.
చిత్రసేనుడి పక్కన కూర్చున్న దత్తుణ్ని మొదటిగా గోణికాపుత్రుడు గుర్తించాడు.
“అడుగో దత్తుడు..” అని కేకపెట్టాడు.
అందరూ వచ్చిచూశారు. పెదవి విరిచారు.
“ఇతను దత్తుణ్ని పోలి ఉన్నాడు కానీ, దత్తుడు కాదు. మనల్ని గుర్తుపట్టనే లేదు!” అన్నారు.
ఆ సందడిలో రుక్మిణి వచ్చింది.
“నాకు గర్భాన్ని కలిగించిన వ్యక్తి.. అచ్చంగా ఈ పోలికలోనే ఉన్నాడు. కానీ, ఇతను మాత్రం అతను కాదు” అన్నది.
అయితేమరి చిత్రసేనుడితో ఉన్నది ఎవరు? అని సమస్య వచ్చింది.
అప్పుడు..
“అల్లుడే కోడలైంది కదా!” అని భోజరాజు సంస్కృత ఛందస్సులో ఒక సమస్యను కాళిదాసు ముందు పెట్టాడు.
దానికి కాళిదాసు శ్లోకంలోనే చెప్పిన సమాధానానికి సారాంశం ఇది..
మన్మథుని పోలి ఉన్న దత్తకుడు భోజరాజ పుత్రికకు గర్భం కలగచేసి.. యక్షుని శాపం వల్ల అమ్మాయిగా మారాడు. చిత్రసేనుడికి భార్యగా ఉన్నాడు. అందువల్ల ఓ రాజా! నీకు అల్లుడే కోడలయ్యాడు.
కాళిదాసు చేసిన ఆ పూరణ వింటూనే సభాసదులందరూ ముక్కుమీద వేలేసుకున్నారు.
సువర్ణనాభుడు మొదలైన ఆరుగురు మిత్రులూ యక్షుణ్ని ఆశ్రయించారు.
“ఇతను మా మిత్రుడు. దయచేసి కాపాడండి” అని కోరారు.
అప్పుడు యక్షుడిలా పలికాడు.
“ఓ కాంతా! అజ్ఞానం కొద్దీ పూర్వం నా రహస్యాన్ని వెల్లడి చేసినందువల్ల నువ్విలా ఉన్నావు. ఇప్పుడు కాళిదాసుగారి అనుగ్రహంతో పురుషునిగా.. దత్తకుడిగా మళ్లీ మారు!”.
ఈ మాటలు పలకగానే దత్తకుడికి పూర్వరూపం వచ్చింది.
భైరవుడికి ఉరిశిక్ష పడింది.
చివరికి ఏడుగురు మిత్రులలో..
ఇద్దరు రాజులయ్యారు.
వారే గోనర్దీయుడు, కుచుమారుడు.
మరో ఇద్దరు రాజులకు అల్లుళ్లయ్యారు.
వాళ్లే ఘోటకముఖుడు, దత్తకుడు.
భోజరాజుకు అల్లుడిగా మారడంతో దత్తకుడు అందరికంటే ఎక్కువ పరపతి కలిగినవాడయ్యాడు. అతనికి వేశ్యాపుత్రిక అయిన చిత్రసేన రెండో భార్య అయింది. అలాగే ఘోటకముఖుడు వరాహపురాన్ని ఏలే చక్రధర నాయకుడికి అల్లుడైన సంగతి విదితమే.
ఐదోవాడైన గోణికాపుత్రుడు ఎప్పుడూ భోజరాజ కుమారుడైన చిత్రసేనుడి చెలిమిని విడిచిపెట్టలేదు. ఆరోవాడైన సువర్ణనాభుడు యక్షకన్యను పెళ్లాడాడు.
ఏడోవాడైన చారాయణుడు వేదపండితుని కుమార్తెను పెళ్లాడి సుఖించాడు.
ఈ ఏడుగురు మిత్రులూ తదనంతర కాలంలో కామశాస్త్ర ప్రవక్తలలో అగ్రగణ్యులుగా కీర్తి గడించారు.
(వచ్చేవారం.. మదాలస పూర్వజన్మ)