మద్యపాన నష్టాల గురించి తరచూ ఏదో ఒక పరిశోధన వినిపిస్తూనే ఉంటుంది. వాటన్నిటి సారాంశం ఏమిటంటే.. ఒక మోతాదు వరకూ మద్యం వల్ల మేలే కానీ కీడు జరగదు. అంతేకాదు, ఈ మోతాదు గురించి కూడా ప్రతి దేశంలోనూ ఏవో లెక్కలు వినిపిస్తూ ఉంటాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలని అనుకున్నారు బ్రిటన్ వైద్యులు. ఇందుకోసం 40-60 ఏండ్ల మధ్య ఉన్న మూడున్నర లక్షల మంది అలవాట్లను పరిశీలించారు. ఏడు సంవత్సరాల పాటు వాళ్లను నిశితంగా గమనించిన తర్వాత.. పరిమితితో మద్యాన్ని స్వీకరించినవారిలోనూ, హృదయ సంబంధ సమస్యలు కనిపించాయట. మోతాదు పెరిగినకొద్దీ ఈ ప్రమాదం మరింతగా పెరుగుతూ వచ్చిందట. కాబట్టి, కాస్త పుచ్చుకుంటే మద్యం మంచిదే అన్న వాదన వైద్యరంగంలోనే అతి పెద్ద అపోహ. మద్యం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రతి అవయవం మీదా తనదైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి, సాధ్యమైనంత దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.