చింతన, ధ్యానం బుద్ధుని ఆలోచన. వ్యక్తిగత అంతఃశుద్ధి ఉపకరణం. ‘మార్పు నిరంతరం. కార్యకారణ సంబంధంతో సృష్టి పరిణామం సంభవం. ఇదే సత్యం. ఇదే నిత్యం’ అని చెప్పాడు బుద్ధుడు. దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాలు, పంచశీల సూత్రాలు అమలుపరచడం శ్రేయస్కరమని ప్రవచించాడు. ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటకంలో ఈ విషయాలు రేఖామాత్రంగా విదితమవుతాయి.
‘హిందువుగా జన్మించడం నా చేతుల్లో లేదని, అంటరాని కులంలో జన్మించావంటూ అడుగడుగునా అస్పృశ్యునిగా చూస్తూ… అనుక్షణం ప్రాణాంతక వివక్షకు గురయ్యేలా ఈ హైందవమత సంస్కృతి నన్ను ఓ బహిరంగ జైలు ఖైదీలా మార్చింది. హిందువుగా పుట్టాను. కానీ, హిందువుగా చావను. నాలాంటి కోట్లాది మంది భారతీయులను ఈ భయంకర కులమత దురహంకార ఛాందసత్వం నుండి విముక్తి చేయడం నా అంతిమ లక్ష్యం’ అని తన పోరాట మార్గాన్ని ఈ నాటక ప్రారంభంలో అంబేద్కర్ ప్రకటిస్తాడు.
చివరకు నాగపూర్లో ఐదు లక్షల మంది అనుచరగణంతో కలసి బౌద్ధమతాన్ని స్వీకరించి అంబేద్కర్ నిశ్షేషుడవుతాడు.బుద్ధుని చరిత్ర అధ్యయనం కోసం అంబేదర్క్ ప్రయత్నిస్తాడు. ఆ అధ్యయన మథనంలో ఆయనకు నూతన విజ్ఞానకాంతులు గోచరిస్తాయి. సిద్ధార్థుని కరుణామృతగాథ, కపోత చికిత్సతో మొదలవుతుంది. భార్య యశోధర, కుమారుడు రాహులుడు, యావత్ రాజ్యాన్ని పరిత్యజించి దీర్ఘ తపస్సు కోసం గౌతముడు పయనమవుతాడు. తపస్సు వల్ల శరీరం శుష్కించడం తప్ప కించిత్ ప్రయోజనం ఉండదని గ్రహించి, ఆరోగ్యాన్ని నిలుపుకొంటూ దుఃఖ నివారణ సత్యశోధనకు ఉపక్రమిస్తాడు. 39వ ఏట జ్ఞానవంతుడైన గౌతముడు బుద్ధుడిగా మారతాడు. అప్పటి నుంచి బౌద్ధ భిక్షువుగా మారి దేశాటన చేస్తూ శిష్యగణాన్ని సమకూర్చుకుంటాడు.
బుద్ధుడు చిత్తశుద్ధితో నమ్మి నిర్వాణ పథాన్ని ఆచరిస్తాడు. అదే జనావళికి ప్రబోధిస్తాడు. బుద్ధుని ఉపదేశాలు ఆచరణ యోగ్యమైనవి. జనులందరూ సులభంగా ఆచరించగలవి. ఆయన బోధనలు పాటించడం సుసాధ్యమని అనతికాలంలో తేటతెల్లమవుతుంది. జీవహింసతో యజ్ఞయగాదులు వద్దని అనడంతో పాడిపంటలు వృద్ధి చెందుతాయి. సహజ ప్రాకృతిక పరిణామ విషయాలే ఉదాహరణలుగా చూపుతూ సమాజానికి సత్యమార్గంలో బాటలు పరుస్తాడు. మనుషులంతా సమానమేనంటూ తన శిష్యగణంలో సబ్బండ వర్గాలకు చోటిస్తాడు. అంబేద్కర్ సందేహాలను బుద్ధుడి బోధనలు నివృత్తి చేస్తాయి. ‘మానవాళి విముక్తికి బుద్ధుని బోధనలే శరణ్యం’ అంటూ అశేషజనవాహినితో దమ్మదీక్ష స్వీకరించడంతో నాటకం పరిసమాప్తమవుతుంది.
మనిషి కేంద్రంగా బుద్ధుని ప్రయాణం ఉంటుందని శీలం, సమాధి, ప్రజ్ఞా వ్యవస్థలు ప్రతి వ్యక్తికీ.. అవశ్యమని ఈ నాటకం వక్కాణిస్తుంది. దాదాపు రెండున్నర గంటలపాటు నడిచే నాటకం లైటింగ్, సెట్టింగ్లతోపాటు స్క్రీన్ షాట్స్ కలిసి సినిమా అనుభూతిని కలిగిస్తుంది. గతంలో ‘సాంగ్ అండ్ డ్రామా’ వారు నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి భారీ రూపకాలకు దగ్గరగా ఉంటుంది. అది అవుట్డోర్. ఇది ఇన్డోర్. ఈ నాటక రూపకల్పనకు దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు నిర్వాహకుల అంచనా. ఈ నాటకం ఉభయ రాష్ర్టాల్లో ప్రదర్శితమవుతున్నది.
‘బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి.
సంఘం శరణం గచ్ఛామి’ నేడు విశ్వమంతటా వర్థిల్లుతున్నాయి. ఎవరు ఏం చెప్పినా (నాతో సహా) విశ్వసించకుండా,అంతఃకరణ శుద్ధితో, స్వీయానుభవంతో గమనించి,వివేచనతో లోకంలో వ్యవహరించాలని, అహింస పాదుకలపై సత్యం పయనించాలని బుద్ధుడు కోరుకున్నాడు. బౌద్ధ తత్వాన్నిఎవరికి వారు, ఎంతగా స్వీకరిస్తున్నామో, ఎంతగా ఆచరిస్తున్నామో పరిశీలించుకోవాలి. ఆచరణలో పరీక్షించుకోవాలి. వ్యక్తికైనా, సమూహానికైనా, సమాజానికైనా ఆచరణే కదా గీటురాయి.
పేరు: బుద్ధునితో నా ప్రయాణం: డా. బీఆర్ అంబేద్కర్
రచన: కె. దేవేంద్ర
దర్శకత్వం: తూము శివప్రసాద్
ప్రదర్శన: అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్
ప్రదర్శకులు: దాదాపు 40 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు
నిర్వహణ: ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు