సుగంధ్ తండ్రి ఎలా చనిపోయాడో కనిపెట్టిన ఇన్స్పెక్టర్ రుద్రకు.. సుగంధ్‌ను ఎవరు చంపారన్న విషయం అర్థంకాలేదు. ఇంతలో కానిస్టేబుల్‌తో కలిసి గౌతమ్ స్టేషన్‌కు చేరుకొన్నాడు. ‘సార్! సుగంధ్ వాళ్ల నాన్నను ఎవరు చంపారో తెలిసిందా?’ ఆత్రుతగా అడిగాడు గౌతమ్.‘యెస్.. తెలిసింది. అది పక్కనబెడితే, మీ ఫ్రెండ్ సుగంధ్ కూడా చనిపోయినట్టు మాకు సమాచారం అందింది’ అని ఉన్న విషయాన్ని చెప్పాడు రుద్ర.ఒక్కసారిగా షాక్ తిన్నాడు గౌతమ్.
‘మాఫ్రెండ్ ఎలా చనిపోయాడు సర్?’ అని అడిగాడు గౌతమ్.‘ఆ విషయం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అవునూ.. సుగంధ్ ఫోన్ ఎప్పుడు స్విచ్చాఫ్ అయ్యింది?’ అడిగాడు రుద్ర.‘ఆదివారం నేను ఫంక్షన్‌కు వెళ్లేముందు వాడికి ఫోన్ చేశాను సర్. అప్పుడే స్విచ్చాఫ్ అని వచ్చింది. తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా అలాగే వచ్చింది’ అని చెప్పాడు గౌతమ్. ‘సుగంధ్తో చివరగా ఎప్పుడు మాట్లాడారు?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘శుక్రవారం సర్. వాడు బెంగళూరు చేరుకోగానే నాకు రాత్రి ఫోన్ చేశాడు. కాసేపు మాట్లాడాను. అంతే!’ గౌతమ్ సమాధానం.
‘సరే.. కేసును మేం దర్యాప్తు చేస్తాం. అవసరమైతే, మళ్లీ స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ఇక మీరు వెళ్లొచ్చు’ అని రుద్ర అన్నాడు. ‘ఓకే సర్.. కానీ, అంకుల్‌ను ఎవరు చంపారో చెప్పలేదు’ అని ఆందోళనతో అడిగాడు గౌతమ్.‘అదంతా ఇప్పుడే చెప్పలేం. నిందితుడు తప్పించుకొనే అవకాశముంది. వాణ్ని పట్టుకొన్నాక అన్ని విషయాలు చెప్తాం’ అని గౌతమ్‌ను పంపించేశాడు రుద్ర.
సుగంధ్ ఇంట్లో పేపర్ వేసే వ్యక్తి కోసం గాలింపు చేపట్టిన రుద్ర టీమ్.. మరుసటిరోజు ఎట్టకేలకు అతణ్ని పట్టుకొన్నారు. పేపర్బోయ్కు 20 ఏండ్లు కూడా ఉండవు. సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. తనను ఎందుకు పట్టుకెళ్తున్నారో అర్థం కావట్లేదంటూ తొలుత బుకాయించిన పేపర్‌బోయ్.. రుద్ర టీమ్ విచారణతో నిజాన్ని ఒప్పుకొన్నాడు.
‘అవును సార్.. నాన్నను నేనే హత్య చేశా’ అని ఎలాంటి జంకు లేకుండా చెప్పాడు పేపర్‌బోయ్.
‘నాన్న??’ ఆశ్చర్యపోయాడు రుద్ర. ‘అవును. సార్. చనిపోయిన వ్యక్తి నాకు నాన్న అవుతాడు. ఇంట్లో పనికి కుదిరిన మా అమ్మను వంచించి గర్భవతిని చేశాడు. మేమెవరమో తెలియదన్నాడు. దీంతో ఐదేండ్ల వయసున్నప్పుడే మా అమ్మ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పుడే, నిర్ణయించుకొన్నా.. మా అమ్మ చావుకు కారణమైన వాళ్లను చంపాలని..’ అలా చెప్పుకొంటూ పోయాడు పేపర్‌బోయ్.
‘సరే.. ఈ ప్రతీకారం నీ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఊహించలేదా?’ అడిగాడు రుద్ర.
‘పేదరికంతో బతుకీడుస్తున్న మాలాంటి వారికి బంగారు భవిష్యత్తు కూడా ఉంటుందా.. సార్?’ అంటూ సినిమా డైలాగ్ వేశాడు.
సాయంత్రమైంది… సుగంధ్ కేసు విషయమై రుద్ర, రామస్వామి, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బెంగళూరు చేరుకొన్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఇతర సాక్ష్యాలతో అర్ధరాత్రికి హైదరాబాద్ తిరిగొచ్చారు.
మర్నాడు ఉదయం.. ‘ఏంటి సర్! ఇక్కడ తండ్రి ఎలా హత్యకు గురయ్యాడో తెలిసింది కానీ, అక్కడ కొడుకును ఎవరు చంపారన్న విషయం అస్సలు తెలియట్లేదు. ఆ హంతకుడు ఒక్క క్లూ కూడా విడిచిపెట్టలేదు’ కారును డ్రైవ్ చేస్తూ రుద్రతో అన్నాడు రామస్వామి. ‘ఏమో బాబాయ్. మనం కేసును కరెక్ట్ డైరెక్షన్లోనే విచారిస్తున్నామా? అన్న అనుమానం కలుగుతుంది.
అవునూ.. సండే మ్యాగజీన్లో ఏదో డిటెక్టివ్ స్టోరీ అన్నావ్.. ఆ మ్యాగజీన్ ఎక్కడ?’ బోర్ కొట్టడంతో అడిగాడు రుద్ర. చటుక్కున వెనుక సీట్లో ఉన్న మ్యాగజీన్‌ను రుద్రకు అందించాడు రామస్వామి. స్టోరీ చదువుతున్న రుద్ర కండ్లు మెరిశాయి. ఇంత చిన్న విషయం తానెలా మర్చిపోయానా? అని కాస్త ఫీల్ అయిన ఇన్స్పెక్టర్.. కారును వేగంగా పోనియమంటూ చెప్పాడు.
రుద్ర గొంతులో మార్పును గమనించిన రామస్వామి.. ‘సర్.. కేసుకు సంబంధించి ఏమైనా క్లూ దొరికిందా?’ ఆసక్తితో అడిగాడు. ‘క్లూ కాదు బాబాయ్.. హంతకుడు దొరికేశాడు..’ అని అరిచినంత పనిచేశాడు రుద్ర. ‘ఎవరు సర్.. హంతకుడు?’ ఆత్రుతగా అడిగాడు రామస్వామి. ‘ముందు స్టేషన్‌కు పద బాబాయ్.. ఆ గౌతమ్‌ను రప్పించండి. ఇక జరగబోయేది చూడండి’ అంటూ కారులో కాస్త రిలాక్స్ అయ్యాడు రుద్ర.
గౌతమ్ స్టేషన్‌కు వచ్చాడు. పేపర్‌బోయ్ సెల్లో ఉన్నాడు. ‘మిస్టర్ గౌతమ్. మీ ఫ్రెండ్ చనిపోయాడు. నిన్ననే బెంగళూరుకు వెళ్లి నిర్ధారణ చేసుకొన్నాం’ గంభీరమైన గొంతుతో అన్నాడు రుద్ర. విషాదంలో మునిగిపోయిన గౌతమ్.. టేబుల్ మీద గ్లాసులో నీటిని తాగాడు. రుమాలుతో కండ్లు తుడుచుకొన్నాడు. కాసేపయ్యాక రుద్ర మళ్లీ ప్రారంభించాడు. ‘గౌతమ్.. మీరు మొన్న అడిగినట్టు.. సుగంధ్ వాళ్ల నాన్నను చంపిన హంతకుడు ఇతనే’ సెల్ వైపు చూపించాడు రుద్ర. సెల్లో పేపర్బోయ్ను చూసిన గౌతమ్ షాక్ అయ్యాడు. ‘సర్.. ఇతను మా ఇంట్లో పేపర్‌బోయ్. ఇతను అంకుల్‌ను చంపాడా?’ నిశ్చేష్టుడయ్యాడు గౌతమ్. ‘యెస్.. గౌతమ్. అతడే సుగంధ్ నాన్నగారిని చంపాడు’ అన్నాడు రుద్ర. చంపడానికి కారణాన్ని కూడా వివరించాడు. అది విన్న గౌతమ్ ఒక్కసారిగా కూలబడిపోయాడు.
గౌతమ్ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నాడో రుద్రకు అర్థంకాలేదు. అదే విషయం అడిగాడు. దీంతో అసలు విషయాన్ని గౌతమ్ ఇలా చెప్పుకొంటూ పోయాడు.. ‘ఏంలేదు సర్. వీడు కొన్నేండ్లుగా మా వీధిలోని వారందరికీ పేపర్ వేస్తున్నాడు. ఎన్నడూ ఏం ఆశించలేదు. ఏమైనా పని చెప్తే విసుగులేకుండా చేసేవాడు. ఇటీవల మా అమ్మగారితో మాట్లాడుతూ.. తనకెవ్వరూ లేరని చెప్పాడట. దీంతో వీడిని మన ఇంట్లోనే పెట్టుకొని ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయిద్దామని అమ్మ నాతో చెప్పింది. ఇంతలో.. వీడు ఇలాంటివాడని’ భయపడుతూ ఆగిపోయాడు గౌతమ్. ‘యెస్.. గౌతమ్. వీడు ఎలాంటివాడో ఇంకా తెలియాల్సింది చాలా ఉంది’ అంటూ సెల్ వైపు లాఠీతో నడిచాడు రుద్ర.
అది చూసి భయపడిపోయిన పేపర్‌బోయ్.. ‘ఏంటి సర్! ఒకర్ని చంపినంత మాత్రాన.. ఆ బెంగళూరులో సుగంధ్‌ను కూడా నేనే చంపానని కేసు రాద్దామనుకొంటున్నారా?’ జంకుతూనే అడిగాడు పేపర్‌బోయ్. తాను ఏం వినాలనుకొన్నాడో అదే విన్న రుద్ర చిన్నగా నవ్వుతుండగా.. హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, గౌతమ్‌తోపాటు స్టేషన్‌లోని వాళ్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, సుగంధ్‌ను కూడా పేపర్బోయే చంపినట్టు కేసు రాశాడు రుద్ర. ఇంతకూ, సుగంధ్‌ను పేపర్‌బోయ్ చంపాడని రుద్ర ఎలా కనిపెట్టాడు?
బెంగళూరులో హత్యకు గురైన సుగంధ్ చనిపోయాడని మాత్రమే పోలీసులు చెప్తూ వచ్చారు. గౌతమ్ అడిగినా కూడా అలాగే చెప్పారే గానీ, మర్డర్ అయినట్టు చెప్పలేదు. అయితే, ఏమీ అడగకముందే ‘నేను చంపానా?’ అంటూ సుగంధ్ది మర్డర్ అని పేపర్‌బోయ్ కన్ఫామ్ చేశాడు. దీంతో అతని ట్రావెల్ హిస్టరీ చూడగా, పేపర్‌బోయ్ బెంగళూరుకు వెళ్లి వచ్చినట్టు తేలింది. మ్యాగజీన్లోని డిటెక్టివ్ స్టోరీలో కూడా ఇలాగే ఆ డిటెక్టివ్ హంతకుడిని పట్టుకొన్నాడు. దీంతో అదే ట్రిక్‌ను రుద్ర ఇక్కడ అమలుచేశాడు. పేపర్‌బోయ్ దొరికిపోయాడు. కాగా, ‘మాలాంటి వారికి బంగారు భవిష్యత్తు కూడా ఉంటుందా.. సర్?’ అన్న పేపర్‌బోయ్.. గౌతమ్ కుటుంబం ఇవ్వాలనుకొన్న మంచి భవిష్యత్తును ఈ హత్యతో కోల్పోయాడు.
…? రాజశేఖర్ కడవేర్గు