‘ఏక్ మినీ కథ’, ‘బిచ్చగాడు 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముంబయి బ్యూటీ కావ్య థాపర్. తెలుగు, తమిళ సినిమాలతోపాటు హిందీలోనూ రాణిస్తున్న కావ్య వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది.
‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్న కావ్య టాలీవుడ్లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నించింది. ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో మరోసారి
టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. భిన్నమైన పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉందంటున్న కావ్య పంచుకున్న కబుర్లు..
యాక్సిడెంట్ వల్ల చాలా బరువు పెరిగా. బొద్దుగా కనిపించేదాన్ని. హీరోయిన్గా రాణించాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకే రెండు నెలలు కష్టపడి ఫిట్‌గా తయారయ్యా. నా వ్యక్తిత్వానికి సరిపోయే పాత్రలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతాను. అప్పుడే వాటిలో పూర్తిగా లీనమై నటించే అవకాశం ఉంటుంది.
ఏ పాత్రలకు నేను సరిపోతానో పరిశ్రమ అర్థం చేసుకుంది. ఒక నటిగా ఏం చేయగలనో మూవీ మేకర్స్ తెలుసుకున్నారు. దానికి అనుగుణంగానే నాకు అవకాశాలు ఇస్తున్నారు. తొలినాళ్లలో నేను పోషించిన పాత్రలు నాలో విభిన్న కోణాలను చూపించాయి. ‘ఈగల్’ సినిమాలో ఒకలా, ‘ఊరు పేరు భైరవకోన’లో మరొకలా కనిపిస్తా. ‘డబుల్ ఇస్మార్ట్’లో ఇంకా డిఫరెంట్ పాత్ర పోషించా. వైవిధ్యమైన పాత్రల్లో నటించడం కన్నా తృప్తి ఏముంటుంది!
సరదాగా ఉండే బబ్లీ పాత్రలు చేయడం అంటే ఇష్టం. యాక్షన్ ప్రధానమైన రోల్స్ ఇష్టమే. ఆ కోరిక డబుల్ ఇస్మార్ట్ సినిమాతో కొంతవరకు నెరవేరింది. యాక్షన్ తరహా సినిమాలన్నా, ఆ తరహా పాత్రలన్నా నాకు చాలా ఇష్టం. త్వరలోనే ఆ జానర్ సినిమాల్లో నటిస్తాననే నమ్మకం ఉంది. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం గోపీచంద్- శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘విశ్వం’ సినిమాలో నటిస్తున్నా.
నటిగా తెరకు పరిచయమై పది సంవత్సరాలు పూర్తయ్యింది. హిందీలో ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా నా కెరీర్ మొదలైంది. తెలుగు పరిశ్రమ చాలా ఆదరించింది. హిందీతోపాటు తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా సంతోషంగా ఉంది.
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేశా. నటిగా ప్రయాణం ప్రారంభించాక పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్గా నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఆడిషన్ ఇచ్చాను. పూరి విజన్ అద్భుతంగా ఉంటుంది. సినిమాపైనా, జీవితంపైనా ఆయనకున్న స్పష్టత సూపర్బ్. అందుకే ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా. మొత్తానికి నా కోరిక నెరవేరింది.
కొవిడ్ నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. లాక్డౌన్ సమయాన్ని నాకోసం నేను కేటాయించుకున్నా. నాలోని లోపాలను అన్వేషించుకుని వాటిని జయించేందుకు శ్రమించా. కుటుంబంతో గడిపేందుకు అదొక మంచి అవకాశంగా వినియోగించుకున్నా.
నేను చాలా అల్లరిపిల్లని. కానీ కొన్నిసార్లు నాకు నేనే కొత్తగా అనిపిస్తాను. కొన్నిసార్లు సరదాగా, ఇంకొన్నిసార్లు కోపంగా, మరికొన్నిసార్లు శక్తిమంతమైన అమ్మాయిగా కనిపిస్తుంటా. డబుల్ ఇస్మార్ట్‌లో మార్ ముంత… పాట షూటింగ్ మొదటి రోజే నేను అనారోగ్యానికి గురయ్యా. నా పరిస్థితిని గమనించి ఛార్మి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిరిగొచ్చాక ఆ పాటని చాలా హుషారుగా చేశా.