బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీబీఈ – ‘కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు’ తాజాగా ఓ తెలంగాణ బిడ్డను వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన డా. కన్నెగంటి చంద్రకు ఆ అరుదైన జాబితాలో చోటు దక్కింది. హాలీవుడ్ దిగ్గజం, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ స్టీవ్ రైట్, రచయిత అలెగ్జాండర్ మెక్కాల్ స్మిత్, బ్రెగ్జిట్ మద్దతుదారు టిమ్ మార్టిన్ల సరసనఇందూరు బిడ్డ సగర్వంగా నిలిచారు.
నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన కన్నెగంటి చంద్ర వైద్య విద్య పూర్తిచేశాక అవకాశాల్ని వెతుక్కుంటూ బ్రిటన్ వెళ్లారు. ముప్పై ఏండ్లుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. హస్తవాసి కలిగిన జనరల్ ఫిజీషియన్‌గా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ప్రవాసులకు పెద్ద దిక్కుగా మారారు. జనం మద్దతు చంద్రను రాజకీయాల వైపు అడుగులు వేయించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి స్టోక్ ఆన్ ట్రెంట్ సిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ లార్డ్ మేయర్ అయ్యారు. లార్డ్ మేయర్ పీఠాన్నీ అధిరోహించారు. వైద్యుడిగా, నాయకుడిగా ఆయన సేవలకు మెచ్చి అక్కడి పభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీబీఈ అవార్డును ప్రకటించింది. మన పద్మభూషణ్‌కు ఇది సరిసాటి అని చెబుతారు. బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఈ స్థాయి గుర్తింపు దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తి డాక్టర్ చంద్ర.
ముగ్గురు పిల్లల్ని పెంచడానికి అమ్మ సరోజిని పడిన కష్టాలే తనలో పట్టుదల పెంచాయని చెబుతారు చంద్ర. ఆ రోజుల్లో ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు. ఇన్ని సీట్లూ లేవు. ఎంబీబీఎస్‌లో సీటు సాధించడం ఏమంత సులభం కాని పరిస్థితులు. అయినా, తల్లి కలను నిజం చేసేందుకు శతవిధాలుగా శ్రమించారు. పట్టుదలతో వైద్య కళాశాలలో సీటు సంపాదించారు. ఎంబీబీఎస్‌తో ఆగకుండా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌పై గురిపెట్టారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పీజీ చేస్తున్న సమయంలో పీఎల్‌ఏబీ (ప్రొఫెషనల్ లింగ్విస్టిక్ అసెస్మెంట్ బోర్డు) పరీక్ష రాయాలనుకున్నారు. అయితే, ఫీజు కట్టేందుకు డబ్బులు సరిపోలేదు. తనలోతానే కుమిలిపోతున్న కొడుకు మనసు ఆ తల్లికి అర్థమైంది. పోపుల పెట్టెలో పోగేసుకున్న చిల్లర పైసల్ని, పాత నోట్లనూ లెక్కగట్టి పదిహేనువేల రూపాయలు చేతిలో పెట్టింది.
‘బాగా చదువుకో బిడ్డా’ అని ఆశీర్వ దించింది. ఆ పరీక్ష ఫలితాలే బ్రిటన్‌లో అవకాశాల ద్వారాలు తెరిచాయి. అంతదూరం వెళ్లాక కూడా ఎన్నో అవరోధాలు. జాత్యంహకారం బుసలుకొడుతున్న సమయమది. ఆ వివక్షను తట్టుకుని బ్రిటన్ పౌరుల ప్రేమాభిమానాల్ని పొందేందుకు నాలుగేండ్ల సమయం పట్టిందని చెబుతారు చంద్ర. మహాత్ముని అహింసా మార్గమే తనకు దిశానిర్దేశం చేసిందని గుర్తుచేసుకుంటారు. ‘ఆ సంయమనం, ఓరిమి బ్రిటన్ ప్రజలకు మరింత దగ్గర చేశాయి. క్రమంగా అక్కడి ప్రజలు నన్ను తమవాడిగా ఆమోదించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో లార్డ్ మేయర్‌గా గెలిపించారు’ అంటారాయన. కొవిడ్ సమయంలో డాక్టర్ చంద్ర.. లార్డ్ మేయర్ హోదాలో స్టోక్ ఆన్ ట్రెంట్ సిటీని అద్దంలా ఉంచారు. స్వయంగా రంగంలో దిగి చెత్త ఏరి పడేశారు, గుంతలు పూడ్చారు. దీంతో సామాన్యులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. స్వచ్ఛతకు, శుభ్రతకు శ్రీకారం చుట్టారు.
బ్రిటన్‌లో డా.చంద్ర కన్నెగంటి ప్రస్థానం సాధారణ జనరల్ ప్రాక్టిషనర్‌గా మొదలైంది. హెల్త్ కాంట్రాక్ట్ బిడ్ వేస్తూ నిలదొక్కుకున్నారు. మూడు హెల్త్ కేర్ సెంటర్లు ప్రారంభించారు. నాలుగు పదులు నిండకుండానే.. బ్రిటిష్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్‌కు చైర్మన్ అయ్యారు. క్రమంగా కన్జర్వేటివ్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. కౌన్సిల్ ఎలక్షన్స్‌లో.. లేబర్ పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతంలో డాక్టర్‌గా కన్జర్వేటివ్ పార్టీ తరఫున బరిలో నిలిచి స్టోక్ ఆన్ ట్రెంట్ సిటీ కౌన్సిల్ మెంబర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో బర్మింగ్‌హామ్ నుంచి ఎంపీగా పోటీ చేసినా.. కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నిరుత్సాహ పడకుండా.. ప్రజాసేవకు పునరంకితం అయ్యారు. స్టోక్ ఆన్ ట్రెంట్ సిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత లార్డ్ మేయర్ పదవి చేపట్టారు. రానున్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ‘అమ్మ ఆశీస్సులు, ప్రజల అండదండలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి’ అని సవినయంగా చెబుతారు డాక్టర్ చంద్ర.
సంవత్సరాది సందర్భంగా ఒకసారి, బ్రిటన్ రాజు అధికారిక పుట్టిన రోజున మరోసారి సీబీఈ అవార్డులను అందిస్తారు. బ్రిటన్‌కు అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇదో శతాబ్ద కాల సంప్రదాయం. బ్రిటన్ ప్రధాని ప్రాథమిక ఆమోదం తర్వాత.. బ్రిటన్ రాజు రాజముద్ర వేశాకే జాబితా విడుదల అవుతుంది. అక్కడ ఈ పురస్కారాలకు అత్యంత విశ్వసనీయత ఉంది.
..? జూపల్లి రమేశ్ రావు