Mohammed Rafi | ఆయన గళంలోంచి పల్లవించిన.. యుగళగీతం.. సరసమాడుతుంది. విరహ గీతం… పరితాపం చెందుతుంది. భజన అయితే.. దేవుణ్నే పరవశింపజేస్తుంది. దేశభక్తి గీతమైతే.. నరనరాల్లో నిప్పుకణికలు రాజేస్తుంది. శాస్త్రీయ గీతమైతే.. స్వరాభిషేకం చేసుకుంటుంది. ఖవ్వాలీ ఖుషీ అవుతుంది. గజల్ వహ్వా అంటుంది. ఇలా నవరసాలొలికించే గాత్రం మొహమ్మద్ రఫీ సాబ్ది. నేపథ్య గీతానికి భాష్యం చెప్పిన ఆయన పాట ఓ చోట అలల అలజడి లేని కోవెల కోనేరులా ప్రశాంతంగా వినిపిస్తుంది. వేరేచోట కొత్త వరదొచ్చిన గంగలా ఉప్పొంగుతుంది. మరోచోట ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి కెరటాన్ని గుర్తుచేస్తుంది. ఇన్నేసి వింతలున్న రఫీ గొంతు హిందీ చలనచిత్ర సంగీత సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాలు ఏలింది. ఆయన ఆలపించిన వేల పాటల్లో వెలకట్టలేనివే అధికం. గాయకుడిగా రఫీ చిరునామా హిమశిఖరాగ్రం. వ్యక్తిత్వం పరంగా ఆయన నివాసం అనంతాకాశం. డిసెంబర్ 24న ఆ మహాగాయకుడి శతజయంతి. ఆ గానవిద్వాంసుడిని తలుచుకోవడానికి ఇంతకన్నా గొప్ప సందర్భం ఏముంటుంది? తెరిచిన పుస్తకమే అయిన రఫీ జీవితం.. ఆయన పాడిన గమకాల కన్నా మధురం..
‘ఓదునియాకే రఖ్వాలే.. సున్ దర్ద్భరే మేరే నాలే..’ కొండంత బాధను నింపుకొన్న పాట ఇది. పిచ్చివాడైన బైజూ వెర్రిగా గొంతు చించుకొని పాడుకున్న పాట. హృదయానికి గాయమైన ఓ గాయకుడి మనోవేదనకు ఈ గీతం అద్దం పట్టాలని ‘బైజూ బావరా’ చిత్ర దర్శకుడు విజయ్ భట్ ఉద్దేశం. ఈ గీతానికి సాహిత్యం సమకూర్చింది షకీల్ బదాయునీ. సంగీతం అందించింది నౌషాద్ అలీ.
సాహిత్యం, సంగీతం మనసును హత్తుకునేలా కుదిరాయి. రఫీ గొంతెత్తాడు.. ఆ పాట అజరామరమైంది. తాన్‌సేన్‌తో తలపడిన బైజూ.. రఫీని పూనాడేమో అన్నారు కొందరు! లేదు లేదు ఆ బైజూనే మళ్లీ పుట్టాడని తీర్మానించుకున్నవారు ఎందరో!! ఆ పాట విన్నాక.. రఫీది గంధర్వాంశ అని కొనియాడనివాళ్లు లేరు. 1952 నాటి సంగతి ఇది. అప్పటికే కేఎల్ సైగల్, గులామ్ ముస్తాఫా దురానీ లాంటి హేమాహేమీ గాయకులు బాలీవుడ్లో బాసింపట్టు వేసుకొని కూర్చున్నారు. నూనూగు మీసాలు రాకముందే.. సైగల్ కచేరీలో గొంతు సవరించుకున్నవాడు రఫీ! ఆ గళాన్నే నమ్ముకొని 1944లో ముంబయికి వచ్చాడు. తొలి రెండేండ్లు కోరస్కే పరిమితమయ్యాడు. తర్వాత రెండేండ్లు అందమైన గీతాలు కొన్ని ఆలపించాడు. 1948 నుంచి రఫీ హవా మొదలైంది. ‘బైజూ బావరా’ తర్వాత అది కాస్తా రఫీ శకంగా రూపుదిద్దుకుంది.
గుండెకోతకు గురైన బైజూ ఆవేదనను ‘ఓ దునియాకే రఖ్వాలే..’ పాటలో సింబాలిక్‌గా చూపించడానికి దర్శకుడు ఓ ప్రయోగం చేశాడు. శివుడి విగ్రహం ముందు బైజూ తన మనోవేదనను గీతంగా నివేదిస్తాడు. ‘అబ్ తో నీర్ బహాలే’ అని ఎలుగెత్తి పాడతాడు. ఆ పంక్తుల దగ్గర శివుడి నేత్రాల నుంచి రక్తం ధారలుగా కారుతుంది. సినిమాటిక్ స్వేచ్ఛలో ఇలాంటి దృశ్యాలు కామన్! కానీ, రికార్డింగ్ సమయంలో రఫీ గళం నుంచి పాట రూపంలో అమృతం పల్లవించింది. ఆ పాట పాడే క్రమంలో రఫీ గొంతులోంచి రక్తమూ వచ్చింది. రికార్డింగ్ తర్వాత నౌషాద్ వెళ్లి రఫీని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు. అదే సినిమాలో మరో పాట.. ‘తూ గంగా కీ మోజ్ మేఁ.. జమునా కా ధారా.. హో రహేగా మిలన్.. యే హమారా, తుమ్హారా’. ఇదీ సూపర్ హిట్. గంగాజమునల్లా కలిసిపోదామని హీరోహీరోయిన్లు పాడుకునే పాట అది. ఆ గీతం రఫీ-నౌషాద్ విషయంలో అక్షరాలా నిజమైంది. హిందీ చిత్రసీమ-రఫీ విషయంలో అయితే శిలాక్షరమైంది. దాదాపు మూడు దశాబ్దాలు.. అంటే ఆయన తుదిశ్వాస విడిచేవరకు.. హిందీ సినిమా పాటలు… రఫీ గొంతులో దాచుకున్న అమృతాన్ని ఆస్వాదిస్తూ అమరత్వాన్ని పొందాయి.
తరాలు దాటినా మర్చిపోలేనన్ని మధురమైన గీతాలు జాతికి అందించిన రఫీ బాల్యం నుంచే స్వరజ్ఞుడు. అవిభాజ్య భారతంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న కోట్లా సుల్తాన్సింగ్ గ్రామంలో పుట్టాడు రఫీ. హజీ అలీ, అల్లారఖీ బాయి దంపతుల ఆరుగురు సంతానంలో ఐదోవాడు. అప్పుడు రఫీకి ఎనిమిదేండ్లు ఉంటాయి. ఇంటి బయట అరుగు మీద కూర్చున్నవాడు ఎవరో పిలిచినట్టు దిగ్గున దిగాడు. ఏదో మంత్రమేసినట్టు ఓ ఫకీరు వెంట కదిలాడు. ఆ బిచ్చగాడి పాట బాలరఫీని అంతలా ఆకట్టుకుంది. అతని వెంటే తిరిగాడు. ఆ ఫకీరు ఏ ఇంటి ముందు ఆగితే అతనూ అక్కడే నిలబడిపోయాడు. అతను కదలగానే.. ఇతనిలోనూ కదలిక. అతని గొంతులోంచి జాలువారుతున్న గీతాల్లో తన్మయత్వంతో ఓలలాడాడు. ఫకీరు ఊరు దాటే దాకా అతని వెంటే ఉన్నాడు. మళ్లీ ఇంటికి వచ్చేశాడు. మర్నాడూ ఇదే తంతు! ఆ తర్వాతి రోజూ అదే తీరు!! ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాలేదు తండ్రికి. ఎందుకు వెళ్తున్నాడో అప్పటికైతే తెలియదు. ఓ రోజు ఫకీరు ఊరు దాటగానే.. తన తండ్రి దుకాణానికి చేరాడు. అప్పటి దాకా ఫకీరు పాడిన పాటలను ఒక్కొక్కటిగా శ్రావ్యంగా ఆలపించడం మొదలుపెట్టాడు. అచ్చంగా అతనిలాగే పాడటం మొదలుపెట్టాడు. వయసు పైబడిన ఫకీరు పలికిన ప్రతి గమకాన్నీ.. ఈ కుర్రవాడూ చిలికాడు. పులకించిపోయాడు తండ్రి. చుట్టూ చేరినవారంతా ఆశ్చర్యపోయారు. ఆ మర్నాటి నుంచి అంగట్లోని వారంతా రఫీ రాకకోసం ఎదురుచూసేవాళ్లు. ఇవాళ ఏం పాడతాడో అని చెవులు రిక్కించేవాళ్లు. పదేండ్లు కూడా రాకుండానే తన మనోహర గాత్రంతో ఆబాలగోపాలన్నీ వశపరుచుకున్నాడు మొహమ్మద్ రఫీ.
రఫీకి పదకొండేండ్లు ఉన్నప్పుడు అతని తండ్రి కోట్లా నుంచి లాహోర్‌కు మకాం మార్చాడు. అక్కడి ఓ బజార్లో సెలూన్ పెట్టుకున్నాడు. లాహోర్ వీధులు హిందుస్థానీ సంగీతానికి కాణాచిగా అలరారుతున్న రోజులవి. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్, వహీద్ ఖాన్, పండిత్ జీవన్‌లాల్ మట్టూ, ఫిరోజ్ నిజామీ లాంటి సంగీత విద్వాంసులతో స్వరపారిజాతంలా పరిమళించేది ఆ నగరం. అప్పటికే రఫీలోని గాయకుణ్ని నిశితంగా పరిశీలించాడు అబ్దుల్ హమీద్. రఫీ పెద్దన్నయ్య స్నేహితుడు అతను. ఈ బాలగాయకుణ్ని ఆ సంగీత విద్వాంసులకు పరిచయం చేసింది హమీదే! ఆ మహామహుల దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించాడు. రాగాలపై పట్టు సాధించాడు. గీతాలను అలవోకగా పాడటం అలవర్చుకున్నాడు. రోజులు సాదాసీదాగా గడిచిపోతున్నాయి. అనుకోని అదృష్టం ఓ రోజు రఫీని పలకరించింది. అప్పటికప్పుడు అందలం ఎక్కించకున్నా.. రఫీని గుర్తుపెట్టుకొని మరీ అవకాశం ఇప్పించగలిగింది.
లాహోర్‌లో ఓ రోజు కేఎల్ సైగల్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముంబయి నుంచి సైగల్ అక్కడికి చేరుకున్నాడు. కచేరీ రెండు గంటల్లో మొదలు అవుతుందనగా కరెంటు పోయింది. అప్పటికే.. కాన్సర్ట్ జరిగే ప్రాంగణమంతా జనంతో కిటకిటలాడుతున్నది. ఆ జనంలో కేఎల్ సైగల్‌ను ప్రత్యక్షంగా చూస్తే చాలు అనుకున్న రఫీ కూడా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు సైగల్ సాబ్ వస్తాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. కరెంటు వచ్చిందన్న సిగ్నల్ ఇస్తే గానీ సైగల్ అక్కడికి రాడు. జనంలో గగ్గోలు మొదలైంది. రఫీ దగ్గరే ఉన్న హమీద్‌కు ఐడియా తట్టింది. వేదిక దగ్గరికి వెళ్లి.. ‘నా స్నేహితుడి తమ్ముడు అద్భుతంగా పాడతాడు. సైగల్ సాబ్ వచ్చే దాకా.. అతణ్ని పాడనివ్వండి. ప్రజలు కూడా నెమ్మదిస్తారు’ అన్నాడు. నిర్వాహకులకు ఇదేదో బాగుందే అనిపించింది. రఫీని వేదిక పైకి రమ్మన్నారు. ఆ యువగాయకుడు గొంతెత్తాడు. అంతా నిశ్శబ్దం. అప్పటి వరకూ ఎప్పుడూ వినని మాధుర్యం చెవిసోకే సరికి అందరిలోనూ ఏదో తన్మయత్వం పూనింది. పావుగంట గడిచింది. అరగంట దాటింది. గంట అయిపోయింది. కరెంటు రాలేదు… సైగల్ హోటల్ గదిలోనే ఉన్నాడు. రఫీ గాత్రం మాత్రం లాహోర్ గాలిలో హోరుమని వీచింది. మరో గంటకు కరెంటు వచ్చింది. కాసేపటికి సైగల్ వచ్చాడు. రఫీ వేదిక దిగి వెళ్లిపోయాడు. సైగల్ పాటలను వింటూ పరవశించిపోతున్నాడు. వెనక నుంచి ఓ చెయ్యి అతని భుజంపై వాలింది. వెనక్కి తిరిగి చూశాడు రఫీ. ‘సినిమాలో పాడతావా? నేను నీకు అవకాశం ఇస్తాను’ అన్నాడు ఆ చెయ్యేసిన వ్యక్తి. రఫీ దగ్గర చిరునామా తీసుకొని వెళ్లిపోయాడు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్యామ్‌సుందర్.
మూడేండ్లు గడిచాయి. 1942లో శ్యామ్‌సుందర్ నుంచి రఫీకి పిలుపు వచ్చింది. ఆయన సంగీత సారథ్యం వహించిన పంజాబీ చిత్రం ‘గుల్ బలోజ్’ సినిమాలో రఫీతో ఓ పాట పాడించాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మరో రెండేండ్లు గడిచాయి. హిందీ సినిమా అంతా ముంబయిలో ఉంటే.. రఫీ లాహోర్‌లో ఉండటం సబబు కాదనిపించింది హమీద్‌కి. చలో ముంబయి అన్నాడు. తనలో సంగీతజ్ఞుణ్ని చూసిన హమీద్ మాట రఫీకి వేదవాక్కు. సరే అన్నాడు. 1944లో ఇద్దరూ ముంబయిలో దిగారు. భిండీ బాజార్లో ఓ ఇరుకు గది అద్దెకు తీసుకున్నారు. అప్పటికే ముంబయికి వచ్చిన శ్యామ్‌సుందర్‌ను కలిశాడు రఫీ. అతనే హిందీలోనూ రఫీకి మొదటి అవకాశం ఇచ్చాడు. ‘గావ్‌ఁ కీ గోరీ’ సినిమాలో పాట పాడించాడు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కోరస్ సింగర్‌గా తన ప్రతిభ చాటుకుంటూనే.. లీడ్ గాయకుడిగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
ప్రతిభ చాలామందిలో ఉంటుంది. అణకువ ఉన్నవారిలోనే అది మరింతగా రాణిస్తుంది. రఫీ విషయంలోనూ అదే జరిగింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ మనిషి తన మూలాలను మర్చిపోలేదు. ఒకరికి ఇబ్బంది కలిగించిన దాఖలాల్లేవు. ఒకరివల్ల ఇబ్బందైనా పట్టించుకున్న సందర్భాలూ లేవు. రఫీ కోరస్ సింగర్‌గా కొనసాగుతున్న రోజులవి. ఓ రోజు నౌషాద్ సాబ్ రికార్డింగ్‌కు వెళ్లాడు. ఏదో కారణం వల్ల ఆ రోజు రికార్డింగ్ రద్దయింది. అందరూ వెనక్కి వెళ్లిపోయారు. రఫీ మాత్రం దిగాలుగా అక్కడే మెట్ల దగ్గర అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. ఇంతలో అటుగా వచ్చాడు నౌషాద్. రఫీని చూడగానే.. అమాంతం కౌగిలించుకునేంత మైత్రి కుదరలేదు అప్పటికి! కనీసం రఫీ కోరస్ బృందంతో పాడటానికి వచ్చాడని కూడా నౌషాద్కు తెలియదు. ‘ఏం బాబు.. ఎవరు నువ్వు?’ అన్నాడు. ‘కోరస్ కోసం వచ్చాను’ అన్నాడు రఫీ. ‘ఈ రోజు రికార్డింగ్ క్యాన్సిల్ అయిందిగా! రేపు వద్దువు’ అన్నాడు. రఫీ ముఖం మరింత దిగాలుగా మారిపోవడం గమనించాడు. ‘ఏమైనా కావాలా?’ అని అడిగాడు. రఫీ మొహమాటంగానే ‘రికార్డింగ్ వాయిదా పడుందని అనుకోలేదు. వెనక్కి వెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. నౌషాద్ జాలిగా చూస్తూ… ఓ రూపాయి అతని చేతిలో ఉంచాడు.
రోజులు దొర్లిపోయాయి. ఏండ్లు గడిచిపోయాయి. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన రఫీ ఇంటికే దర్శక, నిర్మాతలు క్యూ కట్టడం మొదలైంది. ‘మాకు నువ్వే పాడాలి’ అని హీరోలు కోరడమూ జరిగిపోయింది. ఓ రోజు రఫీ ఇంటికి నౌషాద్ వచ్చాడు. హాల్లో కూర్చున్నాడు. గదంతా పరికించి చూస్తున్నాడు. అద్దాల అల్మారాల్లో అమరిన జ్ఞాపికలు వినమ్రంగా నౌషాద్‌ను పలకరించాయి. వాటి మధ్యలో ఓ చిన్న ఫొటోఫ్రేమ్. అందులో ఓ రూపాయి బిళ్ల. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ.. ‘ఏమిటిది?’ అన్నాడు రఫీ వైపు తిరిగి! ‘మీరిచ్చిందే..’ అని గతాన్ని గుర్తుచేశాడు. ‘ఎందుకిలా?’ అని మళ్లీ ప్రశ్నించాడు. ‘నేనేంటో ఈ రూపాయి నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది’ అన్నాడు రఫీ. నౌషాద్ పొంగిపోయాడు.
రఫీ బాలీవుడ్‌ను ఏలడానికి ప్రధాన కారణం అతని అద్భుతమైన గళమే! రఫీ రాకకు ముందు ప్లేబ్యాక్ విధానం చాలా పరిమితంగా ఉండేది. చాలామంది హీరోలు ఎవరికి వారే పాడుకునేవారు. ప్లేబ్యాక్ విధానం వచ్చిన తొలినాళ్లలో రఫీ గళమెత్తాడు. హీరో మాటతీరు, హావభావాలు, పాత్ర తీరుతెన్నులను గమనించేవాడు. పాటను, పాత్రను, దాన్ని పోషిస్తున్న నటుణ్ని ఆకళింపు చేసుకొని ఒక్కో హీరోకు ఒక్కోవిధంగా గొంతు సవరించేవాడు. దిలీప్ కుమార్ ఫుల్ ఖుషీ.. దేవానంద్ ఆనందానికైతే అవధుల్లేవ్! షమ్మీ మరింతగా ఊగిపోయాడు!! ఒకరేమిటి మనోజ్‌కుమార్, ధర్మేంద్ర, రాజ్‌కుమార్ ఇలా బాలీవుడ్ తొలి రెండు తరాల హీరోలంతా ఎంత పుణ్యం చేసుకున్నామో అని సగర్వంగా భావించారు. ఎందుకంటే ఈ హీరోలందరూ రఫీ గాత్రాన్ని అరువు పొందినవాళ్లే! రేడియోలో రఫీ పాట వస్తుంటే.. అది ఏ హీరో మీద పిక్చరైజ్ చేసిందో చెప్పేసేవాళ్లు శ్రోతలు. అంతెందుకు జానీ వాకర్, మహమూద్ వంటి కామెడీ యాక్టర్లకూ వారి శైలిలో పాటలు పాడి ఆశ్చర్యచకితుల్ని చేశాడు ఈ మహాగాయకుడు.
పాటలో పదబంధాలకు రఫీ పలికించే డైనమిక్స్ అనితర సాధ్యం. దేవానంద్ మీద చిత్రీకరించిన ‘అభీ నా జావో చోడ్ కర్..’ పాటలో ఓ చోట ‘యే శామ్ ఢల్ తో లే జరా..’ అనే దగ్గర పొద్దువాలిపోతున్నట్టుగా, ‘నశే కే ఘూంట్ పీ తో లూ’ అన్న దగ్గర మత్తు ఎక్కినట్టుగా రఫీ పలికిన తీరు.. వీనులకే కాదు, మనసుకూ హాయినిస్తుంది. ఒక్కపాటలోనే ఇన్ని సంగతులేస్తే వందల రాగాల్లో వేల పాటల్లో ఎన్నేసి వింతలు, కవ్వింతలు ఉండి ఉంటాయో ఊహించుకోండి. రఫీ గొంతుతో హిట్టయిన పాటలే కాదు, హీరోలూ ఉన్నారు. అందులో ఒకరు షమ్మీకపూర్. ఉరిమే ఉత్సాహం షమ్మీ సొంతం. కొండగాలిలా పాట ఊపుమీదుంటే ఆ హీరో తెగ ఊగిపోయేవాడు. పిల్లగాలిలా ఉంటే తనువంతా మల్లెతీగలా మెలికలు తిప్పేసేవాడు. క్షణం కుదురుగా ఉండని అతగాడు ఏ పాటకు ఎలా నర్తిస్తాడో, ఏ పదానికి ఎలా స్పందిస్తాడో.. అచ్చంగా అలాగే పదాలు పలికి విస్మయపరిచేవాడు రఫీ. అందుకే కాబోలు, రఫీ మరణవార్త వినగానే షమ్మీ ‘ఐ లాస్ట్ మై వాయిస్..’ అని కదలక, మెదలక కాసేపు నిశ్చేష్టుడయ్యాడు. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాటా ఇలా ఎవర్గ్రీన్ లిస్ట్‌లో చేరిందే!
రఫీ రాకతో సినీ సంగీత దర్శకులూ ఉప్పొంగిపోయారు. నౌషాద్ మరింత జటిలమైన స్వరాలు కూర్చడమే పనిగా పెట్టుకున్నాడు. ఓపీ నయ్యర్ ఓపికగా విభిన్న ట్యూన్లను కంపోజ్ చేయడం మొదలుపెట్టాడు! కారణం ఏ దివ్యలోకంపైనో అలకబూని మానవుడిగా జన్మించిన రఫీ అందుబాటులో ఉన్నప్పుడే తమలోని స్వర సారస్వతాన్నంతా రంగరించి బాణీలు కట్టాలన్న తపన వారిది!! తన మార్కు సంగతులు వేసి, తనకే సొంతమైన డైనమిక్స్‌తో వారందరి తపస్సునూ ఫలింపజేసేవాడు రఫీ. ఎస్డీ బర్మన్, రాజేష్ రోషన్, ఖయ్యాం, జయదేవ్, సి.రామచంద్ర, చిత్రగుప్త, ఆర్డీ బర్మన్, శంకర్-జైకిషన్, కళ్యాణ్ జీ- ఆనంద్ జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయం ఇలా 1950 నుంచి 1980 వరకు ఎందరెందరో సంగీత దర్శకులకు మేలిరత్నాల్లాంటి పాటలు అందించాడు రఫీ సాబ్.
1970 తర్వాత రఫీ గొంతులో చిన్న ఇబ్బంది తలెత్తింది. దాంతో పాటల జోరు తగ్గింది. అప్పుడు కిషోర్ కుమార్ హవా మొదలైంది. రెండుమూడేండ్లు పూర్తిస్థాయిలో పాడలేకపోయాడు రఫీ. మళ్లీ గొంతు సవరించుకుని గళమెత్తాడు. హిందీ పాట మళ్లీ పొంగిపోయింది. ఆయన తుది శ్వాస విడిచే దాకా ఆ ప్రభంజనం అలాగే కొనసాగింది. తనకన్నా ముందు ఉన్న గొప్పగాయకుల నుంచి స్ఫూర్తి పొందిన ఈ మహా గాయకుడు.. తర్వాత వచ్చిన గీతకారులనూ అంతే ఆదర్శంగా తీసుకున్నాడు. కిషోర్ కుమార్‌కూ ప్లేబ్యాక్ పాడాడు. ఇద్దరూ కలిసి ఎన్నో మధురమైన గీతాలను ఆలపించారు. రఫీ జమానాలో ఆయనకు పోటీ అనుకునే గళం కల గాయకుడు మన్నాడే. శాస్త్రీయ సంగీతాన్ని ఆపోశన పట్టిన మన్నాడే ఓ సందర్భంలో ‘రఫీ తర్వాతే నేనైనా, ఎవరైనా’ అన్నాడంటే.. ఈ ఫకీర్ సాబ్ ఎంతటి విద్వాంసుడో అర్థం చేసుకోవచ్చు. తను సంగీతం అభ్యసించిన బడే గులాం అలీఖాన్, మరో హిందుస్థానీ సంగీత దిగ్గజం పండిత్ జస్రాజ్ వంటి లబ్ధప్రతిష్ఠులతోనూ పాటలు పంచుకున్నాడంటే రఫీ ‘పాట’వం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ఈర్ష్య, అసూయ రఫీని ఎన్నడూ అంటుకోలేదు. గాయకుడిగానే కాదు, వ్యక్తిత్వంలోనూ రఫీ మేరునగ ధీరుడు. గొప్ప గాయకుడిగా ఎంతగా ఆయన్ను అభిమానిస్తారో, మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడిగానూ అంతగా ఆరాధిస్తారు. అందుకే, రఫీ అస్తమించిన పదేండ్ల తర్వాత వచ్చిన ఓ సినిమాలో ‘నా ఫన్కార్ తుఝ్సా తేరే బాద్ ఆయా.. మహమ్మద్ రఫీ తూ బహుత్ యాద్ ఆయా’ (నీలాంటి కళాకారుడు మళ్లీ పుట్టడు. నువ్వు సదా గుర్తుంటావు) అని కీర్తించాడు రచయిత ఆనంద్ భక్షి. హిమశిఖరమంత ఉన్నతస్థాయికి వెళ్లినా ‘ఏక్ ఇంసాన్ హూ.. మై తుమ్హారీ తరాహ్..’ అని రఫీ తనదైన శైలిలో వినమ్రంగా చెప్పినా… ‘తారీఫ్ కరూ క్యా ఉస్కీ జిస్నే తుమ్హే బనాయా’ (నిన్ను పుట్టించిన దేవుడిని ఎంత ప్రశంసించినా తక్కువే) అని రఫీసాబ్ను భువికి పంపిన ఆ దేవుడికి లక్షలసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!
1944లో రఫీ ముంబయికి వచ్చేనాటికి అతని కుటుంబం లాహోర్‌లోనే ఉండేది. అప్పటికే రఫీకి వివాహమైంది. దేశ విభజన తర్వాత తన కుటుంబాన్ని ముంబయికి రప్పించుకున్నాడు. అయితే, అప్పుడు జరిగిన అల్లర్లలో రఫీ భార్య తన తల్లిదండ్రులను కోల్పోయిందట. దీంతో ఆమె పాకిస్థాన్‌లోనే ఉంటానని నిర్ణయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు రఫీ బిల్కిస్ భానోను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడుగురు సంతానం. అందులో నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.
రఫీ పాట పూదోటలో ప్రతిదీ మనోహరమైనదే!
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేవే!
ఆ మధుర గాయకుడు ఆలపించిన వేల గీతాల్లో ఓ వంద పాటలు గుర్తు చేసుకొని.. వందనాలు సమర్పిద్దాం!
విని తరిద్దాం!!
1. సుహానీ రాత్ దులారీ
2. ఛూలేనే దో నాజుక్ కాజల్
3. మధుబన్ మే కోహినూర్
4. జోవాదా కియా.. తాజ్‌మహల్
5. మన్ తడపత్.. బైజూ బావరా
6. ఖొయాఖొయా చాంద్ కాలాబాజార్
7. తేరే మేరే సప్నే.. గైడ్
8. దిన్ ఢల్ జాయే.. గైడ్
9. చౌద్వీ కా చాంద్ చౌద్వీ కా చాంద్
10. బహారో ఫూల్ బర్సావో సూరజ్
11. దిల్ కా భవర్ తేరే ఘర్ కే సామ్నే
12. దేఖో రుఠా నా.. తేరే ఘర్ కే సామ్నే
13. లే కే పహలా ప్యార్ సీఐడీ
14. యే దిల్ హై ముష్కిల్ సీఐడీ
15. సర్ జో తెరా.. ప్యాసా
16. యే మెహలో.. ప్యాసా
17. చాహె కోయీ ముఝే జంగ్లీ
18. దీవానా హువా కాశ్మీర్ కీ కలీ
19. ఆజా ఆజా మే తీస్రీ మంజిల్
20. దిల్ తేరా దివానా దిల్ తేరా దివానా
21. చురా లియా హై యాదోఁ కీ బారాత్
22. మై జిందగీ హమ్ దోనో
23. ఢల్ గయా దిన్ హమ్‌జోలీ
24. దర్ద్ ఏ దిల్ కర్జ్
25. హాయ్ రే హాయ్ బహారోఁకే సప్నే
26. ఓ హసీనా తీస్రీ మంజిల్
27. క్యా హువా తేరా హమ్ కిసీసే కమ్ నహీ
28. తేరీ బిందియా రే అభిమాన్
29. ఆజ్ కల్ తేరే బ్రహ్మచారి
30. డఫ్లీ వాలే సర్గమ్
31. ఓ హై జరా కఫా కఫా శాగిర్ద్
32. తుఝే జీవన్ కీ డోర్ అస్లీ-నక్లీ
33. బాగోఁమే బహార్ హై ఆరాధన
34. కిత్నా ప్యారా వాదా కార్వాన్
35. గున్ గునా రహా ఆరాధన
36. తుమ్ఁసే అచ్చా కౌన్ జాన్వర్
37. మస్త్ బహారోఁకా ఫర్జ్
38. యే రేష్మీ జుల్ఫే దో రాస్తే
39. ఛల్కాయేజామ్ మేరే హమ్దమ్ మేరే దోస్త్
40. కౌన్ హే జో సప్నో ఝుక్ గయా ఆస్మాన్
41. ని సుల్తానా రే.. ప్యార్ కా మౌసమ్
42. సౌ సాల్ పహలే… జబ్ ప్యార్ కిసీ సే హోతా హై
43. ఉడ్ జబ్ జబ్ నయా దౌర్
44. చక్కే మై చెక్కా బ్రహ్మచారి
45. హమ్ ఆప్ కీ ప్యాసా
46. చుప్ గయే సారే దో రాస్తే
47. జానేవాలోఁ జరా దోస్త్
48. నైన్ లడ్ జయి.. గంగా జమునా
49. చాహుంగా మై తుఝె దోస్త్
50. చలో దిల్దార్ చలో పాకీజా
51. అభీ నా జావో హమ్ దోనో
52. అఖేలే అఖేలే యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్
53. దిల్ కే ఝరోఁఖే మై.. బ్రహ్మచారి
54. పుకార్తా చలా మేరే సనమ్
55. లే గయి దిల్ లవ్ ఇన్ టోక్యో
56. ఎహసాన్ తేరా జంగ్లీ
57. యే దునియా.. హీర్ రాంఝా
58. ప్రేమ్ పత్ పడ్కర్ సంగమ్
59. ఇశారో ఇశారో మే కాశ్మీర్ కీ కలీ
60. తుమ్నే కిసీ రాజ్‌కుమార్
61. బదన్ పే సితారే ప్రిన్స్
62. బార్ బార్ దేఖో చైనా టౌన్
63. లాల్ ఛడీ మైదాన్ జాన్వర్
64. ఆస్మాన్ సే యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్
65. తుమ్ సే అచ్ఛా జాన్వర్
66. కరూ మై క్యా సూఖూ జంగ్లీ
67. తేరే ఆంఖోఁకే చిరాగ్
68. హమ్దమ్ మేరే మేరే సనమ్
69. ఎక్ పర్దేశీ మేరీ ఫాగున్
70. వాదా కర్లే హాత్ కీ సఫాయీ
71. మాంగ్ కే సాత్ నయా దౌర్
72. రుత్ హై మిలన్ మేలా
73. యేఁ మౌసమ్ ధర్తీ
74. తేరీ రబ్ నే సుహాగ్
75. లాఖోఁ హై కిస్మత్
76. ఆజ్ మౌసమ్ లోఫర్
77. దీవానా ముఝ్సా తీస్రీ మంజిల్
78. బేఖుదీ మే సనమ్ హసీనా మాన్ జాయేగీ
79. యే జో చిల్‌మన్ హే మెహబూబ్ కీ మెహందీ
80. గోరియా కహాఁ కార్వాన్
81. ముఝే తేరే ఆప్ ఆయే బహార్ ఆయీ
82. ఖిలోనా జాన్ కర్ ఖిలోనా
83. దిల్ ఉసే దో అందాజ్
84. ఛడీ రే ఛడీ మౌసమ్
85. ఏక్ ఘర్ తేరే ఘర్ కే సామ్నే
86. నర్గిస్ ఏ మస్తానా ఆర్జూ
87. ఏక్ డాల్ పర్ చోర్ మచాయే షోర్
88. యైసా మౌఖా యాన్ ఈవినింగ్ ఇన్ పర
89. నానా కర్తే జబ్ జబ్ ఫూల్ ఖిలే
90. తేరీ ప్యారీ ప్యారీ ససురాల్
91. సర్ పర్ టోపి తుమ్సా నహీ దేఖా
92. ఆజా తుఝ్కో నీల్కమల్
93. పర్దేశియోఁ జబ్ జబ్ ఫూల్ ఖిలే
94. లిఖే జో ఖత్ తుఝే కన్యాదాన్
95. పత్తర్ కే సనమ్ పత్తర్ కే సనమ్
96. మై కాలే హైతో గుమ్నామ్
97. బాబుల్ కీ నీల్కమల్
98. మేరే మిత్వా గీత్
99. యూతో హమ్నే తుమ్సా నహీ దేఖా
100. తేరీ దునియా జబక్
రఫీకి కార్లంటే వల్లమాలిన అభిమానం. మార్కెట్లోకి కొత్తకారు రాగానే కొనుగోలు చేసేవాడు. కార్లంటే ఎంత మోజో.. రంగులన్నా అంతే పిచ్చి. ఆ కార్లకు రకరకాల రంగులు వేయించేవాడు. ముదురు ఆకుపచ్చ, పసుపు, ఇండిగో రంగు ఇలా ఆఫ్‌బీట్ రంగులు వేయించి మురిపెంగా విహరించేవాడు. ఓసారి అమెరికా నుంచి ఓ పెద్దకారు దిగుమతి చేయించుకున్నాడట రఫీ. దానికి ఎడమవైపు స్టీరింగ్ ఉండటంతో కుదురుగా నడపలేకపోయాడు. డ్రైవర్ చేతికిస్తే అతనిదీ అదే పరిస్థితి. అతగాడు కారు తీసినప్పుడల్లా చిన్నాచితకా ప్రమాదాలు చోటుచేసుకునేవి. అతనికి లెఫ్ట్ స్టీరింగ్ కారు డ్రైవింగ్‌లో శిక్షణ కూడా ఇప్పించినా లాభం లేకపోయింది. ట్రైనింగ్ తర్వాత కూడా ఆ డ్రైవర్ కారును స్థిమితంగా నడపలేకపోయాడట.
సినీరంగంలో అభద్రతా భావం ఎక్కువ. ఎవరైనా కొత్త నటుడు వచ్చినా, గాయకుడు వచ్చినా.. అప్పటి వరకు రాజ్యమేలుతున్న వారిలో తెలియని దిగులు మొదలవుతుంది. వారిని తొక్కేసేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతుంటాయి. రఫీ మాత్రం కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేవాడు. సింగర్ హేమంత్‌కుమార్ బాలీవుడ్లో పాగా వేయడానికి మూల కారణం ఆయనే! రఫీకి హేమంత్ వీరాభిమాని. పుస్తకాల్లో పేజీ పేజీలో తన అభిమాన గాయకుడి పేరు రాసుకొని మురిసిపోయేవాడు. ఓ స్నేహితుడు హేమంత్‌ను వెంటపెట్టుకొని వెళ్లి రఫీకి పరిచయం చేశాడు. బాగా పాడతాడనీ చెప్పాడు. హేమంత్‌ను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు రఫీ. తనతోపాటు రికార్డింగ్స్‌కు తీసుకెళ్లేవాడు. పాటలో మెలకువలు నేర్పేవాడు. తర్వాతి కాలంలో హేమంత్ కుమార్ వర్సటైల్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నాడు. రఫీ పోయిన కొన్నాళ్లకు లండన్‌లో హేమంత్ ఓ కచేరీ నిర్వహిస్తున్నాడు. ఆ కార్యక్రమానికి లండన్‌లో ఉంటున్న రఫీ కొడుకులు ఇద్దరు హాజరయ్యారు. వాళ్లు వచ్చారన్న విషయం తెలుసుకున్న హేమంత్.. ఆ ఇద్దరినీ వేదికపైకి పిలిచి, పూలహారాలు వేసి, పాదాభివందనం చేశాడు. ‘మీ కళ్లముందు పెరిగిన మాకు అభివాదం చేయడం ఏంటి?’ అని వాళ్లు అడ్డగించబోతే.. ‘గురు పుత్రులు.. నాకు గురుతుల్యులు’ అన్నాడట హేమంత్. ఈ సన్నివేశంలో హేమంత్ ఔన్నత్యం కనిపిస్తుంది. అతణ్ని అంతగా ఆదరించిన రఫీ గొప్పదనమూ ప్రస్ఫుటమవుతుంది.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రఫీ పాటంటే చెవి కోసుకునేంత ఇష్టం. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత బాపూజీకి నివాళిగా రాజేందర్ కృష్ణ అనే రచయిత ‘సునో సునో యే దునియావాలో బాపూజీ కీ అమర్ కహానీ’ గీతం రాశాడు. దానిని రఫీ మార్దవంగా ఆలపించాడు. ఆ పాటకు నెహ్రూ మంత్రముగ్ధుడయ్యాడట. తన ఇంట్లో ఓ కచేరీ నిర్వహించి మళ్లీ ఈ పాట అడిగి పాడించుకున్నాడట. 1948 ఆగస్టు 15న స్వతంత్ర భారతం తొలి వార్షికోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా మరోసారి రఫీ ఆ గీతాన్ని ఆలపించాడు. ఆ సందర్భంగా నెహ్రూ బహూకరించిన మెడల్‌ను రఫీ అపురూపంగా దాచుకున్నాడట.
షమ్మీ తన సినిమా పాటలు తన సమక్షంలోనే రికార్డింగ్ చేయాలని పట్టు పట్టేవాడు. ప్రతి రికార్డింగ్‌కు వెళ్లేవాడు. ‘యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్’ సినిమాలోని ‘ఆస్మాన్ సే ఆయా పరిస్తా’ పాట రికార్డింగ్ సమయంలో షమ్మీ విదేశాల్లో ఉన్నాడు. డేట్స్ కుదరకపోవడంతో ఆయన లేకుండానే పాట రికార్డింగ్ చేసేశారు. విషయం తెలిసిన షమ్మీ అగ్గి మీద గుగ్గిలం అవుతూ సంగీత దర్శకులు శంకర్-జైకిషన్లపై మండిపడ్డాడు. అయితే పాట విన్న తర్వాత షమ్మీ అమాంతంగా చల్లబడ్డాడు. రఫీ దగ్గరకు వెళ్లి ‘నేను ఏ పదానికి ఎలా స్పందిస్తానో అచ్చంగా అలా ఎలా పాడార’ని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అందుకు రఫీ సాబ్ సమాధానం చిరునవ్వే.
‘కాశ్మీర్ కీ కలీ’ సినిమాలోని ‘తారీఫ్ కరూ క్యా ఉసికి..’ పాట రికార్డింగ్ సమయంలో వింత అనుభవం ఎదురైంది. పాటలో కాస్త అల్లరి పాళ్లు పెరగాలంటే చివర్లో ఏదైనా మ్యాజిక్ చేయమని మ్యూజిక్ డైరెక్టర్ ఓపీ నయ్యర్‌ను కోరాడట షమ్మీ. ‘ఇప్పటికే నిడివి పెరిగింది. కుదరదు’ అన్నాడట నయ్యర్. చిన్నబుచ్చుకున్న షమ్మీ ఇదే విషయం రఫీ చెవిలో వేశాడు. ‘నేను చూసుకుంటాలే’ అన్న రఫీ.. ‘చివరిలో నా శైలిలోనేను పాడతాను.. బాగుంటే ఉంచండి. లేదంటే తీసేయండి’ అని ఓపీ నయ్యర్‌ను ఒప్పించాడట. షమ్మీ బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా పాట చివర్లో ‘తారీఫ్ కరూ క్యా ఉసికి..’ అంటూ డిఫరెంట్ డైనమిక్స్‌తో పదిమార్లు పలికాడు. షమ్మీ కపూర్ ఆనందంతో ‘తారీఫ్ కరూ..’ అంటూ రఫీసాబ్కు సలామ్ చేశాడు.
ఎంత ఉన్నతస్థితికి చేరుకున్నా రఫీ ఏనాడు అహం ప్రదర్శించేవాడు కాదు. ఆయన వ్యక్తిత్వానికి అద్దంపట్టే సందర్భమే ఇది. ఒకసారి డార్జిలింగ్ సమీపంలోని సిలిగుడిలో బాలీవుడ్ స్టార్లు రెండు రోజుల కాన్సర్ట్ నిర్వహించారు. మొదటిరోజు రఫీ సంగీత విభావరి, రెండో రోజు మరోగాయకుడి కచేరీ ఏర్పాటు చేశారు. మొదటి రోజు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. మర్నాడు రఫీ ముంబయికి వెళ్లాలి. అనుకున్నట్టుగానే ఉదయాన్నే దగ్గర్లోని విమానాశ్రయానికి బయల్దేరాడు. రఫీ వెళ్లిన కాసేపటికి రెండో రోజు కాన్సర్ట్‌లో పాల్గొనాల్సిన గాయకుడు రావడం లేదని కబురు అందింది. అమితాబ్ మరికొందరు హీరోలు ఆగమేఘాల మీద ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే రఫీ విమానం ఎక్కేశాడు. ఫ్లయిట్ బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. ఏటీసీ అధికారులను బతిమాలి అమితాబ్ పరుగున విమానం దగ్గరికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లి రఫీతో విషయం చెప్పాడు. మరుక్షణం కుర్చీలోంచి లేస్తూ.. ‘చలో జాయేంగే బాబా’ అంటూ విమానం దిగాడు. రెండోరోజు కాన్సర్ట్నూ విజయవంతం చేశాడు.
రఫీకి మధుమేహం ఉంది. ఏ ఆకర్షణలకూ లోనుకాని ఆయన మిఠాయి విషయంలో ఆగలేడు. అదే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని చెబుతారు. పాట రికార్డింగ్‌కు ముందు స్వీటు తినడం రఫీకి రివాజు. ఎస్డీ బర్మన్ అయితే.. రఫీ రికార్డింగ్ ఉందంటే.. క్యారెట్ హల్వా సిద్ధంగా ఉంచేవాడట. ‘మీకు షుగర్ ఉందని మర్చిపోకండి’ అంటూ గుర్తుచేస్తే… ‘మీఠా ఖాయేతో.. ఆవాజ్ ఔర్ మీఠా ఆయేగా’ అనేవాడట రఫీ!
తుదిశ్వాస వరకూ రఫీ పాడుతూనే ఉన్నాడు. 1980 జూలై 31 ఉదయం లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీత నిర్దేశంలో పాట పాడాలి. ఒక పల్లవి, చరణం రికార్డింగ్ అయింది. ఇంటికి బయల్దేరుతున్న రఫీ ఎందుకో ఆగి ‘రెండో చరణమూ ఇప్పుడే పూర్తి చేద్దాం’ అన్నాడట. వెనక్కి వచ్చి పాట పూర్తి చేసి ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రే రఫీకి గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచాడు. ‘ఆస్పాస్’ సినిమాలోని ఆ పాటతో రఫీ పాటల ప్రయాణం ముగిసింది. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయం సంగీతం అందించిన మొదటి పాట పాడింది రఫీనే! అప్పుడు వాళ్లు రఫీకి వెయ్యి రూపాయలు పారితోషికంగా ఇచ్చారట వాళ్లు. ఆ వెయ్యికి మరో రెండు రూపాయలు జతచేసి ఇద్దరికీ చెరో రూ.501 ఇచ్చి ‘జంటస్వరాల్లా కలిసే ఉండండి..’ అని ఆశీర్వదించాడట. ఆయన చివరి పాటకు వాళ్లే సంగీతం అందించడం కాకతాళీయమో, రుణానుబంధమో! అప్పుడు రఫీకి 55 సంవత్సరాలు.
మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కాంబినేషన్ సూపర్‌హిట్. ఇద్దరూ కలిసి వందలాది డ్యూయెట్లు పాడారు. లతా దీదీ… రఫీసాబ్ని ‘భయ్యా’ అని సంబోధించేది. రఫీ కూడా అంతే ఆప్యాయంగా ఆమెను పలకరించేవాడు. ఇంత అభిమానంగా ఉండే వీళ్లిద్దరి మధ్య తెగని పేచీ వచ్చిపడింది. మ్యూజిక్ రికార్డింగ్ సంస్థలు సంగీత దర్శకులతోపాటు గాయకులకూ రాయల్టీ ఇవ్వాలనే చర్చ ఒకసారి తెరపైకి వచ్చింది. ఆ చర్చను లేవనెత్తింది లతాదీదీ. ఈ విషయంలో లత అభిప్రాయంతో విభేదించాడు రఫీ. ఒకసారి పాడి, పారితోషికం తీసుకున్న తర్వాత ఆ పాటతో గాయకులకు రుణం తీరిపోతుందన్నది రఫీసాబ్ భావన. పాట విజయవంతం కావడంలో భాగమైన గాయకులకు రాయల్టీ రావడం ధర్మమని లతా నిశ్చితాభిప్రాయం. ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ ముదిరి పాకానపడింది. 1963లో ఓనాడు రఫీతో పాడేది లేదంది లత! ‘నేనూ అంతే’ అన్నాడు రఫీ. ఇద్దరి మధ్యా రాజీ యత్నాలు చాలా రోజులు సాగాయి. ఎవరూ బెట్టు వీడలేదు. చివరికి 1967లో ఓ కాన్సర్ట్‌లో ఎస్డీ బర్మన్ ‘లత, రఫీ కలిసి పాడే పాట మీ కోసం’ అని ప్రకటించాడు. ఎలాంటి శషబిషలు లేకుండా మళ్లీ కలిసి పాడారు. తర్వాత వందలాది పాటలు జంటగా ఆలపించారు. రఫీ గురించి చెబుతూ ‘మచ్చలేని వ్యక్తి రఫీసాబ్. ఆయనతో అత్యధిక డ్యూయెట్లు పాడే అదృష్టం నాకే దక్కింది. రఫీ సాబ్ పాట వింటే.. భాష రానివాళ్లకు కూడా భావం అర్థమవుతుంది’ అని కీర్తించింది లతా దీదీ!
అప్పట్లో రికార్డింగ్‌లో ఒకే మైక్ ఉండేది. మేల్ సింగర్ తన పంక్తులు ఆలపించి పక్కకు తప్పుకొన్నాక, ఫిమేల్ సింగర్ పాడేది. ఆమె పాడిన తర్వాత అతను. ఇలా సాగేది రికార్డింగ్. ఒకసారి రఫీ పాట రికార్డింగ్ ఉందని తెలిసి రఫీ స్నేహితుడు బాలీవుడ్ గీత రచయిత జావెద్ అఖ్తర్‌ను వెంటపెట్టుకొని స్టూడియోకు వెళ్లాడట. అక్కడ అద్దాల గదిలో రఫీ, మరో గాయనితో కలిసి ఓ విరహ గీతం ఆలపిస్తున్నాడు. తన పంక్తులు పాడగానే.. గ్లాసు అందుకొని నీళ్లు తాగుతూ అద్దంలోంచి బయటికి చూశాడట. బయట ఉన్న తన స్నేహితుణ్ని చూపులతోనే ఆప్యాయంగా పలకరించాడట. ఆ వచ్చిన వ్యక్తి ‘ఎంత అందంగా పాడుతున్నావ్’ అన్నట్టుగా సైగ చేయగా.. దాన్ని అర్థం చేసుకొని ‘అంతా ఆ దేవుడి దయ’ అన్నట్టుగా చేతిని పైకి చూపాడట రఫీ. ఇంతలో గాయకురాలి పంక్తులు పూర్తయ్యాయి. ఆ వెంటనే రఫీ గళం విప్పాడు. మళ్లీ అంతకు మునుపు మూడ్, అదే స్వరంతో తన లైన్లు పూర్తిచేశాడు. దటీజ్ రఫీ!
హిందీ, పంజాబీ, మరాఠీ తదితర భాషల్లో వేల పాటలు పాడిన రఫీ తెలుగులోనూ కొన్ని గీతాలు ఆలపించారు. అవన్నీ సూపర్‌హిట్ జాబితాలో చేరిపోయాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘భలేతమ్ముడు’ సినిమాలో ‘ఎంతవారు గానీ వేదాంతులైన గానీ..’, ‘ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే..’, ‘గోపాల బాల నిన్నే కోరి..’ పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమాలో ‘నా మది నిన్ను పిలిచింది గానమై..’ పాట ఈ తరాన్నీ మురిపిస్తుంది. ‘అక్బర్ సలీం అనార్కలీ’ సినిమాలోని ‘సిపాయి నీకై ఎంత ఎంత వేచి ఉన్నానో..’ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
– త్రిగుళ్ల నాగరాజు