Meenakshi Chaudhary | ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్యానా భామ మీనాక్షి చౌదరి. ‘హిట్-2’తో సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటూ.. హాట్ హీరోయిన్ అనిపించుకుంది. ‘గుంటూరు కారం’లో మహేశ్‌కు మరదలుగా అదరగొట్టిన మీనాక్షి తమిళంలో దళపతి విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకొని అదుర్స్ అనిపించుకుంది. దక్షిణాది చిత్రాల్లో జోరుమీదున్న మీనాక్షి పంచుకున్న కబుర్లు..
నా కెరీర్‌ని నేనెప్పుడూ ఊహించలేదు. మిస్ ఇండియా గెలవడం, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం, సినిమాల్లోకి రావడం అంతా ఓ అద్భుత ప్రయాణం. ఆ సమయంలో ప్రతి దశలో చాలా విలువైన విషయాలు నేర్చుకున్నా. గొప్ప నటి కావాలనేది నాకల. అది నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నా.
కంటెంట్ బాగుంటే చాలు.. అది సినిమానా, వెబ్ సిరీసా అని చూడాల్సిన పనిలేదు. ప్రేక్షకులకు ఓటీటీ మరింత ఎక్కువగా రీచ్ అవుతుంది. ఎక్కడ అవకాశం వచ్చినా.. అందిపుచ్చుకోవాలి! పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కావాలన్నది నా కల.
నటిగా రాణించాలంటే ఫిట్‌నెస్‌పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటా. యోగా, రన్నింగ్ నా ఫిట్నెస్ సీక్రెట్స్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే బొమ్మలు గీస్తుంటా. కాస్త ఎక్కువ తీరిక కుదిరితే కొత్త ప్రదేశాలు చుట్టేసివస్తా.
కథకే నా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాత అందులో నా పాత్ర. రెండూ కుదిరితే.. ఓకే చెబుతాను. ఏ నటికైనా విభిన్నమైన పాత్రల్లో నటించాలని ఉంటుంది. అందుకు నేనేం మినహాయింపు కాదు! అందుకే, ప్రతి సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నా. త్వరలో రాబోతున్న ‘మట్కా’ చిత్రం పీరియాడిక్ కథ. అందులో నాది వెరీ డిఫరెంట్ రోల్. ‘మెకానిక్ రాకీ’లో మిడిల్‌క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ‘లక్కీ భాస్కర్’లో మదర్ రోల్ ప్లే చేశా. అనిల్ రావిపూడి సినిమాలో పోలీసుగా నటిస్తున్నా. ఇవన్నీ వేటికవే స్పెషల్‌గా ఉంటాయి.
‘గుంటూరు కారం’లో చాన్స్ వచ్చినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. సూపర్‌స్టార్ మహేశ్‌తో కలిసి నటించాలంటే చాలా టెన్షన్ పడ్డాను. ఫస్ట్‌డే ఫస్ట్ షాట్ ఆయనతోనే.. చాలా భయపడ్డాను. అది ఆయన గమనించి, ‘ఎందుకు టెన్షన్ పడుతున్నావు. కూల్‌గా ఉండు’ అని ధైర్యం చెప్పారు. ఆయన మాటతీరు నా భయాన్ని పోగొట్టింది. నిజంగా మహేశ్‌లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.
తెలుగుతోపాటు తమిళంలోనూ నటిస్తున్నా. ఓ రొమాంటిక్ డ్రామా, మరో యాక్షన్ థ్రిల్లర్‌లో చేస్తున్నా. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. రొమాంటిక్ కథలో నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన రోల్స్‌కు భిన్నమైనది. ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
నా కెరీర్లో వచ్చిన ప్రతి అవకాశం నన్ను నేను నిరూపించుకోడానికి ఉపయోగపడింది. నాకు చాన్స్ ఇచ్చిన అందరికీ రుణపడి ఉంటాను. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. వారి ఆదరణ నా బాధ్యతను పెంచింది. మరిన్ని మంచి పాత్రలతో వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తా!