శివపూజతో మారేడు పరవశిస్తుంది. కేశవుడి ఆరాధనతో తులసి పులకిస్తుంది. అభిషేకాలతో హరుడు.. అర్చనలతో శ్రీధరుడు.. కార్తికమంతా హరిహరాత్మకమే! ఈ నెలంతా ఇద్దరిదే వైభవం!! అంతేనా..
ఈ మాసంలో వెలిగించే దీపాలు అనంతకాంతులు వెదజల్లుతాయి. చేసే దానాలు అక్షయ ఫలాన్నిస్తాయి. అందుకే ‘న కార్తిక సమో మాసః’ అంటుంది స్కాంద పురాణం. కార్తిక మాసాన్ని మించిన నెల లేదని
దీని భావం. అద్వైత భావనకు చేవ్రాలుగా నిలిచే కార్తిక మాసం ఆధ్యాత్మిక సాధనకు ఆలవాలం.
కార్తిక మాసం రాకతో… దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికత కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో ప్రతిరోజూ పర్వమే! ప్రతీ తిథి పవిత్రమే!! కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరత్తు మహత్తుతో వినీలాకాశం నిర్మలంగా భాసిల్లుతూ ఉంటుంది. గగన వీధిలో చంద్రబింబం నిర్మలంగా ప్రకాశిస్తుంది. పున్నమి నాటికి వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. కార్తిక పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి సమీపంగా సంచరిస్తాడు. అందుకే ఈ నెలకు కార్తికం అని పేరు వచ్చింది. ప్రకృతి వైచిత్రికి తోడు.. కార్తికం మొదలైనప్పటి నుంచి ఇంటి ముందు దీపాలు దేదీప్యమానంగా కాంతులీనుతుంటాయి. ఆలయాల్లో దివ్వెలు మెరిసిపోతుంటాయి. శివాలయాల్లో ఆకాశదీపాలు వెలిగిపోతుంటాయి. వెరసి ఆకసంలోనే కాదు.. ఇలపైనా నిత్యం వెన్నెల వెల్లివిరుస్తుంటుంది. ఈ చిరుకాంతులే.. ఆధ్యాత్మిక సాధనకు దారిదీపాలు అవుతాయి. ఈ మాసంలో చేసే పూజ, అర్చన, దాన, జప, స్నాన, అభిషేకాదులు విశేష ఫలితాన్నిస్తాయి. కార్తిక వ్రతంతో పోల్చదగిన వ్రతం మరొకటి లేదని చెబుతారు. ఈ నెలలోనే యోగనిద్రలో ఉన్న శేషశాయి మేల్కొంటాడు. వైకుంఠద్వారం తెరుచుకునే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తుంది. అంటే మానవుడికి మోక్షమార్గం తెరుచుకుంటుందని అర్థం. అందువల్ల ఈ మాసంలో నిర్వర్తించే దైవ సంబంధ కార్యాలు సకల శుభాలనూ అనుగ్రహిస్తాయి.
కార్తిక మాసంలో స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు పెద్దలు. ఈ నెల రోజులపాటు సంకల్పం చెప్పుకొని, శాస్త్ర విహితంగా స్నానం చేయాలని పురాణ వచనం. ఉసిరి చెట్టు నీడ పడే కొలనులో స్నానం చేయటం ఉత్తమం అని చెబుతారు. నదీస్నానానికీ విశేష ప్రాధాన్యం ఇచ్చారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకుని, ఇంట్లో ముందుగా స్నానం చేసి, ఆ తర్వాత నదికి వెళ్లి, సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. అందుబాటులో నది లేకపోతే కాలువ, సరస్సు, చెరువు, బావి దగ్గర అయినా విధిప్రకారం స్నానం చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉసిరి చెట్టు ఉన్న అరుగుమీద విశ్రమించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కార్తిక పురాణం చెబుతున్నది. ఈ ప్రక్రియలో అనేక వైద్య రహస్యాలు ఉన్నాయి. ఉసిరి మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఔషధం. ఉసిరి ఆకుల మీదుగా వచ్చే గాలి శ్వాసకోశ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. ఈ కారణంగానే చలి పుంజుకునే కార్తికంలో ఉసిరి చెట్టుకు అధిక ప్రాధాన్యం కల్పించారు పెద్దలు.
అద్వైతానికి ఆయువుపట్టు: శివకేశవుల అభేదాన్ని ప్రకటించే మాసం కార్తికం. ఈ మాసంలో శివుడి ఆరాధనకు ఎంత ప్రాధాన్యం ఉందో, విష్ణుమూర్తి పూజకూ అంతే ప్రాముఖ్యం కనిపిస్తుంది. అద్వైత భావనకు ఆయువుపట్టుగా ఈ మాసాన్ని అభివర్ణించారు పెద్దలు. కార్తికంలో నిత్యం బిల్వ పత్రాలతో శివుడికి, తులసీ దళాలతో విష్ణుమూర్తికి అర్చనలు చేయాలి. ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి సాయం సంధ్యలో ఆవునెయ్యితో ఆకాశదీపం పెట్టాలి. ఉసిరికాయ మీద వత్తి పెట్టి దీపం పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది.
శివనామ స్మరణ : కార్తికంలో అప్రయత్నంగా శివనామ స్మరణ చేసినా శివలోక సాయుజ్యం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా స్కాంద పురాణంలో సుమిత్రా వృత్తాంతం చెప్పుకోవచ్చు. అనేక తప్పులు చేసినా, చివరకు అప్రయత్నంగా బిల్వదళార్చన, శివనామ స్మరణ చేయడం వల్ల సుమిత్రకు శివసాయుజ్యం కలిగింది. శివనామ స్మరణ ఫలితం అలాంటిది. దైవంపై గురితో, భక్తితో చేసే నామస్మరణ అనంత ఫలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
దీపారాధన: కార్తిక మాసం ప్రతి రోజూ ఆలయానికి వెళ్లి, నియమ నిష్ఠలతో శివుని స్మరించి, దీపారాధన చేయాలని కార్తిక పురాణం చెబుతున్నది. ఉభయసంధ్యల్లో దీపారాధన చేయవచ్చు. అలా చేయలేని వాళ్లు.. ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాల్లో నియమం ప్రకారం ఉపవాసం చేసి, సాయంత్రం శివాలయానికి వెళ్లి, దీపారాధన చేయాలి. కార్తిక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం చేసి, సంధ్యవేళ శివాలయానికి వెళ్లి 365 వత్తులు వెలిగిస్తే సకల పాపాలూ నశిస్తాయని పురాణగాథ. సంధ్యా సమయంలో ప్రతి ఇంటికీ వచ్చే లక్ష్మీదేవి దీపాలు వెలుగుతున్న ఇంట కొలువై ఉంటుందట.
దీపదానం: కార్తిక మాసంలో దీపదానం చేయాలని చెబుతారు. ఇంట్లో కన్నా తులసి, ఉసిరి చెట్టు సమీపంలో చేసే దీపదానం శ్రేష్ఠమైంది. దీనికన్నా ఆలయంలో చేసే దానం ఉత్తమం. నదీ, సముద్రతీరంలో చేసే దానం అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కార్తిక పౌర్ణమి, కార్తిక బహుళ చతుర్దశి ఇందుకు శ్రేష్ఠం. లేదంటే ఈ నెలలో ఏదో ఒక రోజు దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ‘నమః పితృభ్యో ప్రేతేభ్యో నమో ధర్మాణ విష్ణవే, నమః సూర్యాయ రుద్రాయ కాన్తార పతయే నమః’ శ్లోకం చదువుతూ దీపం దానం చేయాలి.
వ్రతాలు : క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతాలు చేసుకోవడానికి కార్తిక మాసం అత్యంత శ్రేష్ఠమైంది. ఆయా ప్రత్యేక తిథుల్లో వీటిని చేసుకోవాలి. లేదంటే వీలును బట్టి చేసుకోవచ్చు.
కార్తిక పురాణం: కార్తిక మాసంలో ‘కార్తిక పురాణం’ పఠించే నియమం ఉంది. కార్తిక మాస విశిష్టత, శివ, కేశవుల గొప్పదనంతోపాటు, జీవన సూత్రాలను తెలియజేసే ఈ పురాణాన్ని చదివినా, విన్నా పుణ్యప్రదం.
వనభోజనం: కార్తిక మాసంలో చేసే వన భోజనం అత్యంత పవిత్రమైంది. వేడుక తీరులో కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో వనభోజనం చేయాలి. శాస్త్రనియమాల ప్రకారం ఉసిరిక చెట్టు వద్ద మహావిష్ణు సాలగ్రామం ఉంచి పూజలు చేయాలి. అనంతరం బ్రాహ్మణ సమారాధన చేసి, పురాణ శ్రవణం చేయాలి. దీనివల్ల విష్ణు సాయుజ్యం లభిస్తుంది.
తేజోదీపం
కార్తిక మాసంలో ఆలయాల్లో ఆకాశదీపం ఉంచుతారు. స్వయంగా ఆకాశదీపం పెడితే అంతకన్నా ఉత్తమ అర్చన మరొకటి ఉండదని శాస్త్ర వచనం. కుదరని పక్షంలో కనీసం ఆకాశదీపాన్ని చూసి, భక్తిభావంతో నమస్కరించినా విశేష ఫలితాలు కలుగుతాయట.
‘సర్వలోకాధిపో భూత్వా సర్వ సంపత్సమన్వితః, ఇహలోకే సుఖం భుక్త్వా చాన్తే మోక్షమవాప్నుయాత్’ అనే శ్లోకం చదువుతూ ఆకాశ దీప దర్శనం, దానం వల్ల మోక్షం కలుగుతుందని నమ్మిక.
అన్ని వారాలూ విశేషమే..
ఆదివారం: కార్తిక మాసం ఆదివారాల్లో సూర్యోపాసన, అర్చన చేయడం వల్ల ఎన్నో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదిత్యహృదయ స్తోత్రం పారాయణచేసి, తైలం, నేతవస్త్రాలు దానం చేయాలి. దీనివల్ల కుష్టు మొదలైన రోగాలు తొలగిపోతాయి. మిరియాలు, పాలు దానం చేస్తే క్షయరోగం నివారణ అవుతుంది. దీపాలు, ఆవాలు దానం చేస్తే మానసిక వ్యాధులు నశిస్తాయి.
సోమవారం: కార్తిక సోమవారాల్లో చేసే శివారాధన, అభిషేకం విశేష ఫలితాలు కలిగిస్తాయి. రోజంతా ఉపవాసం ఉండి, సాయం వేళ శివాలయాన్ని సందర్శించి, అర్చనాది కైంకర్యాలు జరిపించుకుని, ఇంటికి వచ్చి బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. దీనివల్ల మహాదారిద్య్ర వినాశనం జరుగుతుంది.
మంగళవారం: కుమారస్వామిని పూజించాలి. సుబ్రహణ్య స్తోత్రాలు పఠించాలి. బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. దీపం, గంట దానం చేయాలి. దీనివల్ల వాక్సిద్ధి కలుగుతుంది.
బుధవారం: విష్ణువును అర్చించి, పెరుగన్నం నివేదన చేయాలి. దానిని ప్రసాదంగా ఇతరులకు పంచిపెట్టాలి. దీనివల్ల సత్సంతాన యోగ్యత కలుగుతుంది.
గురువారం: గురువులను, పండితులను అర్చించాలి. దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ, సరస్వతీమాతలకు అర్చనలు జరపాలి. తేనె, బంగారం, నెయ్యి దానం చేయాలి. దీనివల్ల సకల భోగాలు సిద్ధిస్తాయి.
శుక్రవారం: గణపతిని పూజించాలి. గంధం, పుష్పాలు, అన్నదానం చేయాలి. దీనివల్ల ఆటంకాలు తొలగుతాయి. శక్తిగలవారు సువర్ణం, రజతం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది.
శనివారం: దిక్పాలకులను అర్చించాలి. నాగదేవతలు, ధన్వంతరి, అశ్వినీ దేవతలను కూడా పూజించాలి. ఈ రోజున ఉప్పు, ఇనుము, నూనె, మినుములు, శొంఠి, అల్లం, మిరియాలు దానం చేయాలి. దీనివల్ల రోగాలు తొలగుతాయి. అపమృత్యు భయం ఉండదు.
నెలంతా వ్రతం
కార్తికమాసం నెల రోజులు నక్తవ్రతం చేయాలి. నక్తం అంటే పగలంతా ఉపవాసం చేసి, రాత్రి వేళ భోజనం చేయటం. పూర్తిగా నెల రోజులు నక్త వ్రతం చేయలేని వారు కనీసం సోమవారాలు, పూర్ణిమ వంటి పర్వదినాల్లో అయినా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ నక్తవ్రతంలో ఆరోగ్య రక్షణకు సంబంధించిన సూత్రమూ ఉంది. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో మానవుల జఠరాగ్ని మందగిస్తుంది. ఈ కారణంగా పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా నక్తవ్రతం పేరుతో ఈ భోజన నియమాన్ని సూచించారు పెద్దలు. కార్తికంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల పగలు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్రోదయం కాగానే భోజనం చేయమన్నారు.
…? శ్రీభారతి