Manasu Palike | చాలా చిత్రాల్లో శృంగార గీతాలు లయబద్ధంగా ఉన్నా.. శ్రుతిమించి సాగుతుంటాయి. ప్రణయ సన్నివేశాన్ని కూడా ప్రణవమంత పవిత్రంగా చూపే ప్రయత్నం చేస్తాడు కళాతపస్వి కె.విశ్వనాథ్. అలా ఆయన అందించిన మనోహర గీతమే ‘స్వాతిముత్యం’లోని ‘మనసు పలికే.. మౌనగీతం’. ఈ పాటలో దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. కళాతపస్వి అలా తన ప్రతిభను చాటుకోవడానికి దోహదం చేసిన ఘనత మాత్రం ఆ పాట సాహిత్యానికే దక్కుతుంది. ఓ అమాయకుడు, అతని నీడ దొరికిన ఆడది.. ఇద్దరి మధ్య బంధాన్ని బలపరిచే గీతమిది.తొలిరేయి గీతమంటి ఈ పాటకు సినారె అందించిన సాహిత్యం అనిర్వచనీయం.
‘జాతి ముత్యం’ లాంటి తెలుగు చలన చిత్రాల్లో ‘స్వాతిముత్యం’ ఒకటి. ‘గీతం, సంగీతం, నటన, దర్శకత్వం సరైనపాళ్లలో సంగమించిన’ మేటి చిత్ర రాజమిది. దీనిని ఏడిద నాగేశ్వరరావు నిర్మించగా, కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్వకత్వం వహించారు. సంగీత దర్శకుడుఇళయరాజా. కమల్ హసన్, రాధిక ప్రధాన తారాగణం. ఈ సినిమా కోసం సినారె ఐదు పాటలు రాశారు. అన్నీ మేలి ముత్యాలే. ‘వటపత్రశాయికి వరహాల లాలి’ జోలపాటగా జగద్విదితం. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’ పాటలో స్వాతిముత్యం కథంతా లీలామాత్రంగా చెప్పేస్తారు కవి. ‘రామాకనవేమిరా..’తో శ్రీరామనవమి పాటను అందించారు. ఇక ‘మనసు పలికే మౌనగీతా’నికి వద్దాం. ముందుగా సాహిత్యం అంతా చదివేయండి..
పల్లవి
ఆమె: మనసు పలికే అతను: మనసు పలికే
ఆమె: మౌనగీతం అతను: మౌనగీతం
ఆమె: మనసుపలికే మౌనగీతం నేడే
ఆమె: మమతలొలికే అతను: మమతలొలికే
ఆమె: స్వాతిముత్యం అతను: స్వాతిముత్యం
ఆమె: మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు
చరణం 1
ఆమె: శిరసు పైని గంగనై మరుల జలకాలాడనీ
అతను: మరుల జలకాలాడనీ
ఆమె: సగము మేను గిరిజనై పగలు రేయీ ఒదగనీ
అతను: పగలు రేయీ ఒదగనీ
ఆమె: హృదయ మేళనలో మధుర లాలనలో
వెలగిపోని రాగదీపం.. వేయి జన్మలుగా… ॥మనసు పలికే॥
చరణం 2
ఆమె: కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
అతను: ఓనమాలు దిద్దనీ
ఆమె: పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ
అతను: మొదటి తీపి…
ఆమె: లలిత యామినిలో కలల కౌముదిలో
అతను: లలిత యామినిలో కలల కౌముదిలో
ఆమె: కరిగిపోని కాలమంతా
కౌగిలింతలుగా.. ॥మనసు పలికే॥
‘స్వాతిముత్యం’ 1986లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్న సంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, భర్త మరణిస్తే ఎదుర్కున్న పరిస్థితులు. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, తరువాత వారిద్దరి జీవన ప్రయాణం, ఇది స్థూలంగా కథ. మగదిక్కు లేని లలితను పెండ్లి చేసుకుంటాడు శివయ్య. పెండ్లి అంటే తాళి కట్టడం అని మాత్రమే తెలుసు. అంతకుమించి ఏమీ తెలియని అమాయకుడు. కానీ, వయసు రాజకున్నప్పుడు, మనసున పెట్టుకొని చూసుకునే మొగడు ఉన్నప్పుడు.. కోరిక పురివిప్పడం సహజమే కదా! ఈ నేపథ్యంలో తన భర్తకు ప్రణయోపదేశం చేయాలామె. తనను తనదానిని చేసుకున్న అతణ్ని పూర్తిగా తనవాణ్ని చేసుకోవాలి. ఇదీ పాట వెనుక నేపథ్యం. అమలిన శృంగార గీతాలను కావ్యశైలిలో వెదజల్లే సినారెకు ఇలాంటి సందర్భం దొరికితే ఊరికే ఊరుకుంటాడా.. ఇదిగో ఇలాంటి అద్భుతమైన గీతాన్ని సినీకళామతల్లికి చదివించాడు.
తొలి చరణంలో తనను ఆదరించిన వాణ్ని అన్యాపదేశంగా పొగుడుతుంది నాయిక. అందుకోసం ‘శిరసుపైని గంగనై.. మరుల జలకాలాడని’ అంటుంది. అక్కడితో ఆగదు.. ‘సగము మేను గిరజనై.. రేయిపగలు ఒదగనీ’ అని, ‘ఇక ఇద్దరం చెరిసగం’ అని చెబుతుంది. ఇంతవరకు తనకు దక్కిన స్థానం గురించి వివరిస్తుంది. హృదయాల సంగమాన్ని కాంక్షిస్తూ.. ‘హృదయ మేళనలో.. మధుర లాలనలో..’ తమ అనురాగ దీపం వేయిజన్మలు వెలిగిపోవాలని ఆకాంక్షిస్తుంది.
మొదటి చరణానికి పదింతలు ప్రౌఢగా సాగిపోతుంది రెండో చరణం. కథానాయకుడి మనసులోనే కాదు తనువులోనూ కాస్త వాంఛ రేగుతున్న విషయాన్ని చెప్పేలా ఇది సాగుతుంది. ఇందులో ప్రేమ ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియని తన భర్తతో ఓనమాలు దిద్దిస్తుంది. ఆపై తొలిముద్దును చవి చూసేలా చేస్తుంది. ‘లలిత యామినిలో.. కలల కౌముదిలో..’ ఈ ప్రయోగం ఆ సన్నివేశానికి ఇంపైన పెంపుగా అనిపిస్తుంది. లేలేత చీకటిలో.. కలలు ‘పండు’వెన్నెల కురుస్తున్నదట. అలాంటి వేళ.. కాలమంతా కౌగిళ్లతో కరిగిపోవాలని నాయికానాయకులు ఒక్కటవుతారు. సినారె అందించిన ఈ పాట సతత హరిత గీతాల్లో స్వాతిముత్యమై నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుంది.
అద్భుతమైన సంగీతం, సాహిత్యం కలగలిసిన ఈ పాటకు విశ్వనాథ్ అందించిన కొసమెరుపు.. దీని స్థాయిని పెంచడమే కాదు, వీక్షకుల మనసులను కొల్లగొట్టింది. అదేంటంటే.. ఏ విషయాలూ తెలియని శివయ్య పాట ప్రారంభంలో తన భార్య లలిత పలికే పదాలను అమాయకంగా అప్పజెబుతుంటాడు. రెండు చరణాలు పూర్తయ్యాక మళ్లీ పల్లవికి వచ్చేసరికి శివయ్యే తొలుత పదాలు ఎత్తుకుంటాడు.. లలిత వాటిని అనుసరిస్తుంది. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకున్నాడని దర్శకుడి భావన!
-పత్తిపాక మోహన్