మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మానుషి చిల్లర్. ఈ సినిమాలో కమాండర్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆమె టాలీవుడ్ ఆఫర్లు అందుకోలేకపోయింది. మళ్లీ బాలీవుడ్‌కి చేరి అక్కడ వరుస హిట్లు కొట్టింది. జాన్ అబ్రహం హీరోగా నిర్మిస్తున్న ‘టెహ్రాన్’లో కథానాయికగా నటిస్తున్నది. తాజాగా గోవాలోని పనాజీలో జరిగిన భారతీయ అంతర్జాతీయ సినిమా పండగ (ఇఫ్ఫీ)లో నృత్య ప్రదర్శన ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచిన మానుషి పంచుకున్న కబుర్లు..
మాది హరియాణా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లోనే మాడలింగ్ చేసేదాన్ని. అలా 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నా. ఆ క్షణాలు నా జీవితంలో అపురూపమైనవి. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తర్వాత సినిమా ఆఫర్లు రావడం మొదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో నా సినీ కెరీర్ మొదలైంది.
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బాగా చేసేదాన్ని. స్కూల్ డేస్‌లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. డ్యాన్స్ ప్రోగ్రామ్ అనగానే ముందుండేదాన్ని. ఆ ఆసక్తే నన్ను సినిమాలవైపు నడిపించిందేమో! ఇటీవల భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ)లో ప్రదర్శన ఇవ్వడం నాకెంతో ప్రత్యేకంగా అనిపించింది. రెండేండ్ల కిందట కూడా ఇఫ్ఫీ వేడుకకు నా తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యాను. ఆ ఈవెంట్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం మరపురాని అనుభూతినిచ్చింది. వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులంతా ఒకే వేదికను పంచుకోవడం, సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందించదగ్గ విషయం.
మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా.. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు! అనుకోకుండా నా సినీరంగ ప్రవేశం జరిగింది. ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. మనం పోషించిన పాత్రకు న్యాయం చేయగలిగితే నటిగా నేను సక్సెస్ అయినట్టే! ప్రతి సినిమాకు కథ మారుతుంది, పాత్ర మారుతుంది… యాక్టింగ్ వచ్చుకదా ఏదైనా చేసేస్తా అనుకుంటే పొరబడినట్టే! మనల్ని మనం రుజువు చేసుకోవాలంటే.. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నేనదే చేస్తున్నా!!
అందంగా కనిపించాలని చాలామందికి ఉంటుంది. అందాన్ని పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. ఇది ఈనాటిది కాదు! చరిత్ర చూసినట్లయితే వేల సంవత్సరాల కిందట కూడా సౌందర్య నిపుణులు ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే బ్యూటీని పెంపొందించుకోవాలన్న ఆరాటం, ఆలోచన ఇప్పటిది కాదు. అలాగే అందంగా కనిపించాలని అనుకోవడం నేరమూ కాదు. ఇందుకోసం కొందరు సర్జరీనో, ఇంకేదో చేయించుకున్నారని వారిని తప్పుబట్టడం సరికాదు! అది వారి వ్యక్తిగతం. దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. నా మటుకు అందం అంటే.. బాహ్య సౌందర్యం కాదు! మనసు బాగుండటమే నిజమైన అందం.
ఒకప్పుడు థియేటర్లో సినిమా ఎన్ని రోజులు ఆడిందో దాన్ని బట్టి అది హిట్టో, ఫ్లాపో చెప్పేవాళ్లు. ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ ఆధారంగా సినిమా ఫేట్ డిసైడ్ చేస్తున్నారు. వారాంతంలో వంద కోట్లు వసూలు చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అన్నమాట! ఏదేమైనా సినిమా కూడా బిజినెస్సే! నిర్మాతల పెట్టుబడికి గిట్టుబాటు అయితేనే మంచి సినిమాలు వస్తాయి.