మన పీకల మీదకేదీ రాకూడదు.ఆగింది.
ఒక్కసారిగా ఆగింది.
అదీ సంగతి.
ముప్ఫయ్యయిదేళ్ళకీ
మూలసూత్రం.
సేఫ్, సేఫర్, సేఫెస్ట్.
అందుకోసం
అందరి దగ్గరా ఒదుగు.
నీడల్ని చూసి భయం.అధికారం అంటే హడల్.
అందుకే పిల్లి నడకలు, కప్పగంతులు, కళ్ళమూతలు.
వాడేమనుకుంటాడో?! ఇదేమనుకుంటుందో?! ఈమెక్కోపం వస్తుందేమో?! వాడు మండిపడతాడేమో?! పీకల మీదకొస్తుందేమో?! ఉద్యోగం ఊడుతుందేమో?! లంపటం తగులుకొంటుందేమో?! అయినా ఈ గొడవ మనకెందుకు?! ఈ తంటాలు మనకేల?!
నేలని పోయేది నెత్తికెందుకు? కడుపులోని చల్ల కదల్డం ఎందుకు!
ఇవీ పునాదులు! అని స్పష్టంగా అనుకోలేదు సుబ్బయ్య.
కాని,తీసిన గోతులూ, అందులో తను తీసుకున్న గోతులూ, అందులో తనూ అంతా స్పష్టంగా చూడగలిగేడా వెన్నెల్లో సుబ్బయ్య.
ఎదుటకి చూస్తున్నాడు సుబ్బయ్య. కాని ఎదుట చూడ్డంలేదు, సుబ్బయ్య. వెనక్కి కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు.
శైశవం, బాల్యం, యౌవనం.అంతా ఒక్కలా ఉంది.
కనిపించేవన్నీ కలిగించినది ఒక్కటే అయింది.
సముద్రపొడ్డున “అమ్మో! రావణాసురుడి మీసాలు!” చీకటింట్లో పులికోరల సవిత్తల్లి; చీకటి బాటలో తండ్రి వంటి మీద కర్రల పెళపెళలు; ఊరవతల పాడుగుడిలో దయ్యాల జాడలకున్న బూజుల నీడలు; బళ్ళో రూళ్ళకర్ర మీసాల మాస్టార్ల చేతుల్లో పేంబెత్తాలు కావు, పాంబెత్తాలు; ఈనాడు ఇంట్లో నాయకురాలి దర్పం; ఆఫీసులో కుర్చీలు దిగని బధిరాంధక శవాలు; రాజశ్యాలకులు చుట్టాలు; బద్మాషులు బంధువులు; “అప్పులాళ్ళు” షావుకార్లు యములాళ్ళు; వీధిలో పరాయి ప్రభుత్వపు పోలీసుల “ధూమ్రాక్ష ధూమకేతు” ముఖాలు; కనిపించే ఈ అన్నింటినీ, ఈ అందర్నీ చూసి నిమిష నిమిషానికీ హడల్ హడల్.
అందరి దగ్గరా అనుక్షణం “దాసోహం, దాసోహం”.
ఈ క్షణం వరకూ అలా వెళ్ళింది జీవితం హీనంగా, నీచంగా, క్షుద్రంగా, దౌర్భాగ్యంగా, దైన్యంగా.
ఆ చీకటి వెనక్కి పీకుతోంది.
ఈ వెలుగు ముందుకి లాగుతోంది.
ఈ వెలుగు ముందుకి లాగుతోంది.
– రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘అల్పజీవి’ నవల నుంచి