మనకు వ్యక్తి పూజలు లేవు. కానీ, వీరపూజలు ఉన్నాయన్నాడు మహాకవి శ్రీశ్రీ. మనల్ని మనం
పునర్నిర్మించుకోవాలంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల్ని స్మరించుకోవాల్సిందే. తెలుగువాళ్లు ఆరాధించే త్యాగధనుల్లో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. తెల్లదొరలపై సాయుధ తిరుగుబాటు చేసిన తొలి తెలుగు బిడ్డ అల్లూరి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ వీరుడు 1924 మే 7న అమరుడయ్యాడు. అప్పటికి ఆయన వయసు 27 సంవత్సరాలే. ఆ మహనీయుడి శత వర్ధంతి సందర్భంగా గతేడాది (2024) మొత్తం ‘మన్యం విప్లవం’ వీధి నాటిక ఊరూరా ప్రదర్శితమైంది.
వీధినాటిక రాత్రి వేళల్లోనే కాదు పట్టపగలూ ప్రదర్శించవచ్చు. మైకులు, లైటింగులు ఎలాంటి హంగులు అవసరం లేదు.రణగొణ ధ్వనుల మధ్య అయినా, కటిక నేల మీద అయినా ప్రదర్శించవలసి ఉంటుంది. చిన్నపాటి ఆహార్యం (మేకప్)తప్పనిసరి. సెట్లు, తెరలు ఉండవు. ఆంగికాభినయంతో అడవులు, పోలీస్ స్టేషన్లు అప్పటికప్పుడు నటులే నిర్మిస్తారు. గుండ్రంగా నిల్చొని ఉన్న ప్రేక్షకుల మధ్య, ప్రేక్షకులకు దగ్గరగా ప్రదర్శన సాగుతుంది. కోటీశ్వరుడే కాదు బిచ్చగాడు సైతం ఆ ప్రదర్శనపై సంపూర్ణ హక్కు కలిగి ఉంటాడు. ‘ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసేదే ప్రజాస్వామ్యం అని ఎలా చెప్పుకొంటామో బాధితుల వల్ల, బాధితుల కోసం, బాధితుల చేత ప్రదర్శితమయ్యేదే ఆధునిక వీధి నాటిక’ అని రంగస్థల ఉద్యమకారుడు సఫ్దర్ హష్మీ తేటతెల్లం చేశాడు.
‘మన్యం విప్లవం’ వీధి నాటికలో మొత్తం 22 దృశ్యాలు (సన్నివేశాలు) ఉంటాయి. ఓ గంట నిడివిలో ఈ దృశ్యాలన్నీ చకచకా సాగిపోతాయి. ఆదివాసుల బాధలు ఓ వైపు, మరోవైపు అల్లూరి విద్యాభ్యాసం, తెగింపు, దేశాటన, తాత్విక చింతన, అడవుల్లో ప్రవేశం.. ఇలా నాటిక రెండు పాయలుగా మొదలవుతుంది. తర్వాత ఆదివాసులతో జట్టుకట్టిన అల్లూరి బ్రిటిష్ సైన్యాన్ని ప్రతిఘటించడం, పోలీస్ స్టేషన్లపై దాడులు, తుపాకులు-తూటాలు సేకరించడం ఇవన్నీ కండ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తారు కళాకారులు.
నాటిక చివర్లో బ్రిటిష్ అధికారులు స్కాట్, హంటర్ అంతం కావడం, అల్లూరి జాడ చెప్పమని గిరిజనులను చిత్ర హింసలుపెట్టడం, గుడారాలను తగులబెట్టడం, వాటికి తాళలేక లొంగిపోయిన సీతారామరాజును తుపాకులతో కాల్చి చంపడం ఇలా నాటిక ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. వీధినాటిక ప్రక్రియలోని టెక్నిక్ (అభినయ అన్వయ పద్ధతి) ప్రదర్శనకు వన్నె తెచ్చి ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంది. కనుకనే అల్లూరి శత జయంతి ఉత్సవాల్లో ఈ నాటిక ఎన్నో వీధుల్లో విజయ కేతనం ఎగురవేసింది. ఈ నాటిక 27 ఏండ్లుగా నిర్విఘ్నంగా ప్రదర్శితమవుతున్నది. దేవి, దేవేంద్ర, మంతెన సీతారాం, వలీ, వెంకటేశ్వర్ లాంటి
కళాకారులెందరో ఈ వీధి నాటికను తెలుగు ప్రజలకు చేరువ చేయడంలో కృషి చేశారు. ఈ నాటిక 400 ప్రదర్శనల మైలురాయిని దాటడం విశేషం.
అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు. సమూహ శక్తి. సంగ్రామ భేరి. స్వాతంత్య్ర నినాదమన్నది అక్షర సత్యం. మరణం తర్వాత అల్లూరి పోరాటంపై ఎన్నో గేయాలు పుట్టాయి. కళారూపాలు వచ్చాయి. ఎందరో కథలు చెప్పారు. ఏకపాత్రాభినయం చేశారు. నాటకాలు ప్రదర్శించారు. అల్లూరి చరిత్ర జాతి జనులు పాడుకునే జీవ గీతమైంది. నటుడు కృష్ణ హీరోగా చలనచిత్రం కూడా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. 1997లో అల్లూరి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్ర’ను ‘మన్యం విప్లవం’ పేరిట వీధి నాటికగా మలిచేందుకు ప్రజా నాట్యమండలి పశ్చిమ గోదావరి జిల్లా కళాకారులు పూనుకున్నారు.
అల్లూరి సీతారామరాజు యథార్థ పోరాట గాథను ప్రజలకు నాటకంగా అందించాలన్న సంకల్పంతో ప్రముఖ చరిత్ర ఉపన్యాసకులు అట్లూరి మురళి పరిశోధనాంశాన్ని ఇతివృత్తంగా స్వీకరించారు. ఆ చారిత్రక అద్భుతానికి ఎలాంటి అభూత కల్పనలు జోడించకుండా అత్యంత నిరాడంబరంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి ఈ వీధి నాటిక ప్రక్రియ తోడ్పడింది.
నాటకం పేరు : ‘మన్యం విప్లవం’
రచయిత : అట్లూరి మురళి
సంస్థ : ప్రజానాట్య మండలి
కథాంశం : బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసులతో కలిసి అల్లూరి సీతారామరాజు నడిపిన మన్యం పోరాటం
…? కె. శాంతారావు రంగస్థల నటుడు, విశ్లేషకుడు