Lord Shiva | పరమ శివుడు పంచముఖుడు.. ఆ ఐదు ముఖాల వెనుక ఉన్న విశిష్టత ఇదే!శివుడి రూపాల్లో పంచముఖ స్వరూపం ఒకటి. మామూలుకు భిన్నంగా ఉండే ఈ ఐదు ముఖాల శివుడి రూపం పంచభూతాలకు ప్రతీక. ఇవి శివుడి పంచకృత్యాలైన.. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలను సూచిస్తాయి. అందుకే శివుణ్ని పంచముఖుడు, పంచవక్త్రుడు అని పిలుస్తారు. ఆదిదేవుడి ఐదు ముఖాల విశేషాలను తెలుసుకుందాం.
అప్పుడే పుట్టిన అని ఈ పదానికి అర్థం. ఇది పశ్చిమ దిశను చూస్తున్నట్టుగా ఉంటుంది. భూ (పృథ్వీ) తత్వానికి సంకేతం. మనిషి సహా మన చుట్టూ ఉన్న కదిలేది, కదలనిదీ అయిన సర్వ సృష్టికీ శివుడే మూలం. ప్రకృతిలోనూ, ప్రాణుల్లోనూ ఉన్నది ఈశ్వరుడే. ఈ సృష్టినీ, అందులోని జీవాన్నీ సమతూకంలో ఉంచేదీ మహేశ్వరుడే.
వామ అంటే ఉత్తర, అందమైన అని అర్థాలు. అలా ఉత్తర దిశగా చూసే ముఖం వామదేవ. ఈ రూపంలో శివుడు సృష్టిని రక్షిస్తాడు. ఇది నీటికి సంకేతం. మన శ్వాసక్రియ, జీర్ణక్రియకు శక్తిని అందించేదీ ఆయనే. జీవులన్నిటికీ ప్రాణావసరమైన గాలి, నీరు, ఆహారం అందించి బతుకును సుసాధ్యం చేసేది కూడా
పరమశివుడే.
ఇది దక్షిణ దిక్కుకేసి చూస్తూ ఉంటుంది. అగ్నికి గుర్తు. విశ్వాన్ని సృష్టించిన విశ్వనాథుడే సర్వాన్నీ నాశనం చేస్తాడు. తనలో కలిపేసుకుంటాడు. అలా సృష్టి చక్రాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. అంటే సృష్టించేదీ, రక్షించేదీ తానే… ముగించేదీ తానే. అఘోర రూపం శివుణ్ని లయకారుడిగా చూపుతుంది. జీవితంలో మార్పు తప్పదని సూచిస్తుంది.
ఈ ముఖం తూర్పు దిశగా మళ్లి ఉంటుంది. ఇది తిరోధాన కృత్యానికి సంకేతం. అంటే శివుడే శాశ్వతుడు మనం అనిత్యులం అని తెలుసుకోకుండా మాయలో పడేసేదీ ఆయనే అని తిరోధాన పదానికి అర్థం. ఈ రూపం వాయు తత్వానికి సూచిక. సృష్టికర్త అయిన శివుడే సృష్టిని తన మాయలో మునిగేలా చేసి, జీవులు తమ నిజ స్వరూపం గానీ, పరమశివుడి ఉనికిని గానీ తెలుసుకోకుండా చేస్తున్నాడు. అది తెలుసుకున్న నాడు మోక్షం సిద్ధిస్తుంది.
సృష్టి మొత్తానికీ అధిపతి ఈశ్వరుడే అని దీని అర్థం. పైకి చూస్తున్నట్టు ఉండే ముఖం ఈశాన స్వరూపం. ఆకాశ తత్వానికి ప్రతీక అయిన ఈ రూపం శివుడి అనుగ్రహ కృత్యాన్ని సూచిస్తుంది. సృష్టిలో సత్యం, అత్యున్నత జ్ఞానానికి నిలయం తానే అని శివుడు ఈ రూపం ద్వారా తెలియజేస్తాడు. అలా మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం లేకుంటే మనకు ప్రశాంతత, జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించవు.