స్పృహ కోల్పోయిన వ్యక్తి పేరు భాస్కర్ అని చెప్పడమే కాకుండా.. అతను స్పృహలోకి రావడానికి అవసరమైన మెడిసిన్‌ను చెప్పాడు సీఐ శరత్. కాసేపటికి కొంతమేర స్పృహలోకి వచ్చాడు భాస్కర్. ఆ వెంటనే శరత్ మాట్లాడుతూ.. ‘హే భాస్కర్.. నువ్వు లక్కీ భాస్కర్వోయ్. 18వ పునర్జన్మ బలిపీఠ యాగంలో 16 మందిని బలిచ్చి, మరో ఇద్దరితో ఆత్మబలిదానం చేయిద్దామనుకొన్న నా ప్రాజెక్టుకు ఈ రుద్రగాడు బ్రేకులేశాడు. మూడో నంబర్వి అయిన నిన్ను ఇట్టే కాపాడేశాడు. అయితే, పాపం నీకంటే ముందు ఇద్దరు చనిపోయారు. బ్యాడ్ లక్’ అన్నాడు శరత్.
ఇంకా ఏదో చెబుతున్న శరత్‌కు అడ్డుపడుతూ.. ‘నోర్ముయ్యిరా.. సైకోగా! నువ్వే అందరినీ చంపి, మళ్లీ బ్యాడ్ లక్ అంటావేంట్రా వెధవా!!’ అంటూ మండిపడ్డాడు స్నేహిల్. దీంతో స్నేహిల్ను కాస్త ఉండుమన్న రుద్ర.. ‘శరత్.. ఇలా చూడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బంధించిన మిగతా వారిని నేను కాపాడాలి. నాకు సమయంలేదు. నీ పజిల్ గేమ్ ఫార్మాట్‌ను మార్చేద్దాం. 15 మందికి కలిపి అన్ని క్వశ్చన్లు ఒకేసారి అడుగు. అన్నింటికీ ఆన్సర్లు చెప్తా’ అంటూ రుద్ర ఇంకా ఏదో అనబోతుండగా.. ‘ఆకలైంది కదా అని 50 కిలోల బస్తా రైస్‌ను ఒకేసారి తింటావేరా? రుద్రగా!! అయినా.. ఒకేసారి అన్ని ఆన్సర్లు చెప్పడానికి.. నువ్వో సూపర్ జీనియస్ అనుకొంటున్నావా? ముందు పూర్తిగా మెలకువలోకి వచ్చిన ఆ భాస్కర్‌ను ఇంటర్వ్యూ చేసుకోపో’ అంటూ వెక్కిరిస్తూ నవ్వాడు శరత్.
భాస్కర్ పూర్తిగా స్పృహలోకి వచ్చాడని గ్రహించిన రుద్ర అతని దగ్గరికి వెళ్లి.. ‘అసలేం జరిగింద’ని? అడిగాడు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ‘నాకేమైంది? నేను ఎక్కడ ఉన్నాను?’ అంటూ కంగారుపడుతూ అడిగాడు భాస్కర్. జరిగిన సంగతిని చెప్పడానికి రుద్ర అలా సమాయత్తమయ్యాడో లేదో.. ‘సార్.. వీడు.. వీడు’ అంటూ శరత్‌ను చూస్తూ కోపంతో ఊగిపోయాడు భాస్కర్. ఇంతలో శరత్ ఇలా అన్నాడు. ‘ఓరి భాస్కరా? ఎంత పని అయ్యెరా?? లగ్గానికి ముహూర్తం పెట్టుకొని నీ పిల్ల కోసం ఎదురుచూస్తున్న నీకు.. గిట్లయిపాయేమిరా?? ఇక, పైండ్లె నీ మనసు నిండినా.. ఆ పిల్ల కడుపు పండదురా.. హహహ’ అంటూ గట్టిగా నవ్వాడు. అది విన్న భాస్కర్‌కు శరత్ తనను ఏం చేశాడో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భాస్కర్.. కూర్చున్న చోటునే అటూ ఇటూ చూస్తున్నాడు. అది గమనించిన శరత్.. ‘రుద్ర.. వాడికి దూరంగా జరుగు.. రుద్ర.. నీకే చెప్పేది వాడికి దూరంగా జరుగు. ఏరా రుద్ర ఒక్కసారి చెప్తే అర్థంకావట్లేదా? వాడికి దూరంగా జరుగురా??’ అంటూ శరత్ గొంతును రెట్టించాడు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థంకావట్లేదు. అయితే, భాస్కర్‌కు శరత్ ఏదో అన్యాయం చేశాడని, దీంతో పగ తీర్చుకోవడానికి శరత్‌ను భాస్కర్ ఇప్పుడు ఏదో చేయబోతున్నాడన్నది మాత్రం అందరికీ అర్థమైంది. ఇదే సమయంలో స్నేహిల్ కల్పించుకొంటూ.. ‘మిస్టర్ భాస్కర్. మీ పగ తీర్చుకోండి. ఈ శరత్‌ను ఏం చేయాలనుకొంటే అది చేయండి’ అంటూ అరిచాడు. దీంతో రుద్ర.. భాస్కర్ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుండగానే.. ‘ఒరేయ్ రుద్ర.. నీకు పిచ్చా.. వాడి దగ్గరి నుంచి దూరంగా జరుగురా!’ అంటూ శరత్ మరోసారి గట్టిగా అరుస్తూ హెచ్చరించాడు. అయితే, అప్పటికే ఆలస్యమైంది. రుద్ర రివాల్వర్ నుంచి తూటా పేలింది. నెత్తుటి మడుగులో భాస్కర్ పడిపోయి ఉన్నాడు. అసలేం జరిగిందో అర్థంకాని స్థితిలోకి అందరూ వెళ్లిపోయారు.
అప్పుడు పక్కన కుర్చీలో కూర్చున్న శరత్ సన్నగా నవ్వుతూ.. ‘నేను ముందే చెప్పా కదరా రుద్ర.. వాడికి దూరంగా జరుగురా అని. ఎంత చెప్పినా నువ్వు వింటేనా?? ఇప్పుడు చూడు. లక్కీ భాస్కర్ అనుకొంటే, అన్‌లక్కీ భాస్కర్ అయిపాయే’ అంటూ నవ్వాడు శరత్. దీంతో కోపాన్ని ఆపుకోలేకపోయాడు రుద్ర. శరత్‌ను కొట్టడానికి వస్తుండగా.. ‘ఒరేయ్ పిచ్చి రుద్ర. ఆగురా. ఆగు. నువ్వు చేసే వెధవ పనికి నన్ను తప్పుపడతావేంటీ? వాడికి దూరంగా జరుగురా.. అంటూ ఎంత మొత్తుకున్నా? వింటివా?? ఇప్పుడు చూడు. ఇగ, మీ అన్నగాడు అదే ఆ స్నేహిల్ గాడు ఉన్నాడే.. ఆ భాస్కర్‌గాడు నన్ను చంపుతాడేమోనని తెగ సంబరపడ్డాడు. వాడూ వాడి డొక్కు మొఖం’ అంటూ విరుచుకుపడ్డాడు శరత్. దీంతో అప్పటికే వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకొన్న రుద్ర.. ‘బతికి బయటపడ్డ భాస్కర్.. ఎందుకు సూసైడ్ చేసుకొన్నాడు. నువ్వు అతన్ని ఏం చేశావ్?’ అంటూ శరత్‌ను నిలదీశాడు. దీనికి సన్నగా నవ్విన శరత్.. ‘ఆ విషయం చెప్పాలని నాకు కూడా ఉంది. అయితే, ముందు నేను అడిగే ఐదు క్వశ్చన్లకు టైమ్ లిమిట్లో ఆన్సర్లు చెప్పు. అప్పుడు చెప్తా’ అంటూ శరత్ గేమ్ స్టార్ట్ చేశాడు.
‘మొదటి ప్రశ్న: ఐదుగురు వ్యక్తులు ఒకరి వెనుక ఒకరు వరుసలో నిల్చున్నారు. ఎలాగంటే.. చంద్రమతి, హరిశ్చంద్రుడి మధ్య ఒకరున్నారు. భాస్కర్, లత మధ్యలోనూ ఒకరున్నారు. అయితే శరత్ మాత్రం చివర్లో లేడు. ఇంతకీ లైన్లో ముందు ఎవరు ఉన్నట్టు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘రెండో ప్రశ్న: సిటీలో పోతుంది. అడవిలో పోతుంది. బ్రిడ్జి మీద పోతుంది. కొండమీదకూ పోతుంది. అయితే, ఎక్కడికి వెళ్లినా.. అంగుళం కూడా కదలదు. ఏంటది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘మూడో ప్రశ్న: ఎవరెస్ట్ శిఖరాన్ని కనిపెట్టకముందు.. భూమిమీద ఎత్తయిన శిఖరం ఏది ఉండేది?? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘నాలుగో ప్రశ్న: నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పదం అది. వెనకనుంచి చదివినా, అద్దంలో చూస్తూ చదివినా అదే అర్థం వస్తుంది. ఏమిటో? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘ఐదో ప్రశ్న: భారత్‌కు చెందిన ఓ విమానం ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో కూలిపోయింది. విమానంలోని క్షతగాత్రులను ఇండియాలో పూడ్చిపెట్టాలా? పాకిస్థాన్‌లోనా?’ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘వెల్డన్ రుద్ర.. అన్ని కరెక్ట్‌గా ఆన్సర్లు ఇచ్చావ్. ఇక, భాస్కర్ ధీనగాథ విను’ అంటూ శరత్ చెప్పడం ప్రారంభించాడు. అది పక్కనబెడితే, శరత్ అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు కనిపెట్టారా?
సమాధానాలు : మొదటి సమాధానం: శరత్, రెండో సమాధానం: రోడ్డు, మూడో సమాధానం: కనిపెట్టకముందు కూడా ఎత్తుగా ఎవరెస్టే ఉండేది. నాలుగో సమాధానం: NOON, ఐదో సమాధానం: క్షతగాత్రులంటే గాయపడినవాళ్లు. ప్రాణం ఉండగా వాళ్లను ఎవరూ పూడ్చిపెట్టరు.