Iswarya Menon | మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్.. అప్పుడెప్పుడో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలో చిన్న క్యారెక్టర్లో మెరిసింది. ఆ తర్వాత తమిళం, మలయాళంలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ‘స్పై’తో జోడీకట్టి టాలీవుడ్లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర ఫలితం ఎలా ఉన్నా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆచితూచి కథలను ఎంచుకుంటున్నది. తాజాగా ‘భజే వాయు వేగం’ అంటూ.. మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగు పరిశ్రమ అంటేనే ఇష్టమంటున్న
ఐశ్వర్య మనసులోని ముచ్చట్లు!
కొన్ని పాత్రలకు నో చెప్పలేం. మలయాళంలో మమ్ముట్టితో కలిసి నటించే అవకాశం వచ్చింది. అలాంటి లెజెండ్‌తో కలిసి తెరపై కనిపించే చాన్స్ మళ్లీమళ్లీ రాకపోవచ్చు. అందుకే వెంటనే ఒప్పేసుకున్నా.
కొన్నిసార్లు రూమర్లు కూడా నిజమైతే బావుండు అనిపిస్తుంది. పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమాలో నేను కూడా నటిస్తున్నట్లు ఒక రూమర్ వచ్చింది. నా ఫేవరెట్ రూమర్ అది. అది నిజమైతే బావుండు అని చాలాసార్లు అనుకున్నా.
‘స్పై’ సినిమా తర్వాత నాకు తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే, జాగ్రత్తగా కథల్ని ఎంచుకుంటున్నా. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా.
మా అమ్మానాన్న కేరళ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డారు. నేను పుట్టిందీ, పెరిగిందీ అంతా తమిళనాడులోని ఈరోడ్‌లో. స్కూల్‌డేస్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక నటనను కెరీర్‌గా ఎంచుకున్నా.
నిజానికి తెలుగులో నా మొదటి సినిమా ‘భజే వాయు వేగం’. మొదట సంతకం చేసింది ఆ సినిమాకే. కానీ, తర్వాత ఓకే చేసిన ‘స్పై’ సినిమా ముందు రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు నేను అనుకున్న ఫలితం రాలేదు. కానీ ‘భజే వాయు వేగం’ సినిమా నటిగా తెలుగు ప్రేక్షకులకు నన్ను దగ్గరచేసింది. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూసినప్పుడే తనతో కలిసి నటించాలనుకున్నా.
నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. భరతనాట్యం నేర్చుకున్నా. జనానికి గుర్తుండిపోయేలా డ్యాన్స్ చేయాలని ఉంది. కానీ, ఇప్పటివరకూ అలాంటి పాట రాలేదు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతా. సినిమాల్లో అవకాశాలు అందుకోవాలంటే కమర్షియల్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం కూడా ముఖ్యమే.
ఒక చిన్న పట్టణం నుంచి చాలా కష్టపడి కోలీవుడ్‌కి వచ్చాను. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్నా. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. తమిళంలో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నా. ఈ పేరు, గుర్తింపు అంతా నేను కష్టపడి సంపాదించుకున్నదే. ప్రతి సినిమా చేసేటప్పుడు హిట్ అవ్వాలనే కష్టపడతా! కానీ కొన్నిసార్లు ఫలితం తారుమారు అవుతుంది. నటనలో చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగిపోతా.