హీరో: చచ్చిపోతా అనొద్దు మేడమ్. హీరోయిన్: బతికి ఏం చేయాలి?హీరో: బతుకు కోసమే బతుకు మేడమ్. ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో ఓ సన్నివేశం ఇది. అనుకున్నది జరగలేదనో, ఆర్థిక పరిస్థితులు బాగాలేవనో, వ్యక్తిగత సంబంధాలు వికటించాయనో సమాజంలో వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. ఆత్మహత్య అనేది తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లాంటిదని సైకాలజీ చెప్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే, అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఆత్మహత్యకు పాల్పడటం అనే సమస్యకు కూడా ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యపై కంటే పరిష్కారంపై ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే ఆత్మహత్యలను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
తీవ్ర మానసిక సంక్షోభంతో ఓ రాజకీయ నాయకుడు ఆత్మహత్య.. వ్యక్తిగత సంబంధాల్లో ఇబ్బందితో ఓ జర్నలిస్టు బలవన్మరణం.. వృత్తిలో ఒత్తిడి తట్టుకోలేక ఓ పోలీసు అధికారి సూసైడ్.. వీళ్లందరూ కూడా జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వారే. బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే, సమాజంపై ఎంతో కొంత ప్రభావం చూపిన వారే, పదిమందికీ ప్రేరణగా నిలిచిన వారే! అయినప్పటికీ కొన్ని బలహీన క్షణాల్లో ఆత్మహత్యకు పాల్పడటం చూశాం. దీన్ని గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఆత్మహత్యకు పాల్పడటం అనేది హోదాతోనూ, వృత్తితోనూ, విద్య స్థాయితోనూ సంబంధం లేదని. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు భారతదేశంలోనే అత్యధికంగా ఉండటం కలవరపరిచే అంశం. ప్రపంచంలో జరిగే ప్రతి మూడు ఆత్మహత్యలలో ఒకటి మనదేశంలోనే జరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం 30 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారే కావటం గమనార్హం.
ఆత్మహత్యకు పాల్పడేవారు వారి ప్రవర్తన, మాటల ద్వారా తమ ఆలోచన తెలియజేస్తారు. వాటినే సైకాలజీలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు (సూసైడ్ వార్నింగ్ సైన్స్) అంటారు. ఈ సంకేతాలపై అవగాహన ఉంటే, ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి కాపాడే అవకాశం ఉంటుంది. ఈ సంకేతాలు ఎలా ఉంటాయో చూద్దాం.
ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఉన్నవారు ఈ సంకేతాల్లో ఏవో కొన్ని తమ సన్నిహితులకు అందిస్తుంటారు. వాటిని గుర్తించి వారితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం చేస్తే ఆత్మహత్య ఆలోచన తగ్గించి జీవితాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది.
ఆత్మహత్యకు పాల్పడటం అనేది వయసుతోనూ, హోదాతోను సంబంధం లేకుండా ఉంటుంది. వారి వృత్తిలో టాప్ పొజిషన్లో ఉన్నారు, బాగా ధైర్యవంతులు, మొండి వ్యక్తిత్వం ఉన్నవారు అని అనుకోవడానికి వీల్లేదు. ఎంతటివారైనా మానసికంగా బలహీనపడే క్షణాలు ఉంటాయి. ఆ క్షణంలో వారికి ఆసరాగా నిలిచేవారు, వారి బాధనూ, ఆవేదననూ ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా అర్థం చేసుకునే వారు అవసరం అవుతారు. అలాంటివారు అందుబాటులో ఉంటే ఆత్మహత్య ఆలోచన ఆగిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన కుటుంబంలోనో, బంధువుల్లోనో, స్నేహితుల్లోనో, సహోద్యోగుల్లోనో ఎవరైనా ఇలాంటి ఆలోచనతో తారసపడితే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
ఆత్మహత్య ఆలోచన రావడం వ్యక్తిగతమేమో గాని, ఆత్మహత్యకు పాల్పడటం మాత్రం సామాజికమే. ఎక్కువమంది అసహాయంగా, నిరాశగా భావించినప్పుడు ఆత్మహత్యకు పాల్పడతారు. ఆ రెండూ అందించలేక పోవడం కచ్చితంగా చుట్టూ ఉన్నవారి వైఫల్యమే. మనుషులు పోయిన తర్వాత సంతాప సందేశాలను సోషల్ మీడియాలో పెట్టే కంటే, వాళ్లు ఉన్నప్పుడే గమనించి, ఒక్క క్షణం వారు చెప్పేది మనసుపెట్టి వినగలిగితే ఓ ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో సమస్యను మనం పరిష్కరించలేమని అనిపించినప్పుడు మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవడానికి ప్రోత్సహించడం కూడా మన బాధ్యత. జీవితంలో పరుగు సహజం, పక్కవారిని పట్టించుకోకపోవడం మాత్రం సహజం కాదు. పరుగును ఒక క్షణం ఆపుదాం.. విందాం. ఓ జీవితాన్ని నిలబెడదాం.