‘కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, వ్యూహకర్తగా, పాలనాదక్షుడిగా మూడువందల అరవై డిగ్రీల కోణంలోంచి ఆవిష్కరించిన రచన. రచయిత మనోహర్ చిమ్మని .. ఉత్కంఠభరితమైన శైలిలో ఈ పుస్తకానికి ప్రాణంపోశారు. వ్యక్తిత్వ వికాస రచనల్లో అంతర్లీనంగా ప్రవహించే అక్షర స్ఫూర్తి.. ప్రతి పేజీలో, ప్రతి పేరాలో, ప్రతి పదంలోనూ కదం తొక్కుతుంది. మచ్చుకు ఓ అధ్యాయం..
కేసీఆర్ ఎందుకు ప్రధాని కాకూడదు? ఆయనకు లేని అర్హతలేమిటి? ఆయన్ను విమర్శిస్తున్న వాళ్లకు ఉన్న అర్హతలేమిటి? ముందు ఇది మాట్లాడుకొని, తర్వాత ఆ కథకొద్దాం.
కట్ టూ ఆ నలుగురు.. రాష్ట్రంలో దాదాపు మట్టికొట్టుకుపోయిన వందేళ్ల చరిత్ర ఉన్న ఒక పార్టీలో ప్రతి ఒక్కరూ ఎవరికివారే ముఖ్యమంత్రి అభ్యర్థులు! వాస్తవిక దృష్టిలో, వచ్చే ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని సీట్లు వస్తాయన్నది ఎంత బాగా తెలిసినా.. ఆ టెంటు నుంచి ఎప్పుడూ ఇవే జోకులు!
ఇక కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న మరొక జాతీయపార్టీ మీద ఎన్నో ఆశలతో, మస్త్ మెజారిటీతో ప్రజలు పట్టం కడితే ఏం జరిగిందో.. సామాన్య ప్రజలకు ఏం ఒరిగిందో.. ఇప్పటికే అందరికీ బాగా తెలిసివచ్చింది. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని జనం ఎదురు చూస్తున్నారు.. తగిన జవాబు ఇవ్వడానికి! ఆ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడున్న స్థానాలు నిలబెట్టుకోవడమే చాలా కష్టం అన్న వాస్తవం వాళ్లకూ తెలుసు. అయినా సరే, ‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేమే స్వీప్ చేస్తాం’ అంటున్నారు! వీళ్లు ఇంతకుముందు ఏం స్వీప్ చేశారో, ఇప్పుడు ఏం స్వీప్ చేస్తారో అందరికీ తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అంతరించిపోయిన మరొక పార్టీ, దాని తాలూకు శకలం ఒకటి ఎప్పుడూ ఏవేవో సంధి ప్రేలాపనలు పేలుతుంటుంది. పక్కరాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ నాయకుడు, వృద్ధాప్యంలో వచ్చే ఒక విచిత్రమైన ‘బాల ఖ్యాలి’ని మించి.. ‘అన్నీ నేనే చేశాను.. అన్నీ నేనే కనిపెట్టాను.. అన్నిటి వెనుక నేనే కారణం..’ అని అర్థంపర్థం లేకుండా డబ్బా కొట్టుకుంటుంటాడు. ‘అసలు నేను ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాణ్ని.. మా అబ్బాయి వద్దంటే ఊరుకున్నా..’ అంటాడు!
పైన చెప్పుకొన్న మూడు పార్టీలను మూడు యూనిట్లు అనుకొంటేగానీ.. నాలుగో యూనిట్‌కు క్లారిటీ రాదు! ఈ నాలుగో యూనిట్లో ముక్కలుముక్కలుగా ఇంకో మూడు ‘సబ్ యూనిట్లు’ ఉన్నాయి. సత్తా చూపించలేక లోకం వదిలిపెట్టిన పార్టీ ఒకటి. ప్యాకేజీ పద్ధతిలో అప్పుడప్పుడూ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ, అవగాహనలేని ప్రశ్నలే తప్ప, ఎన్నటికీ ఎలక్షన్లలో పోటీచేసే ఊసే లేని ఫ్యాన్స్ పార్టీ ఒకటి. రంగు పూర్తిగా వెలిసిపోయినా.. ‘ఇంకా మేం కూడా రంగంలోనే ఉన్నాం’ అన్న భ్రమలో బతుకుతున్న పార్టీలు రెండు. ఇవన్నీ ఈ నాలుగో యూనిట్ కిందకొస్తాయి. ఈ యూనిట్ గురించి ఇంతకుమించి మాట్లాడుకోవడం అనేది అనవసరంగా వాళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టవుతుంది. కాబట్టి, ఇంక చెప్పుకొనేదేం లేదిక్కడ.
వెరసి.. ఈ నలుగురి విషయంలో రానున్న ఎన్నికలు అనేవి ఒక ఒడిశిన కత. ఆ విషయం వాళ్లకు కూడా చాలా స్పష్టంగా తెలుసు.కాబట్టే.. తెల్లారి లేస్తే టీవీల్లో ఇంత లొల్లి. ఇంత ఆగమాగం. ఇదంతా రెండు ప్రధాన ప్రయోజనాల కోసం.. ఒకటి ఐడెంటిటీ క్రైసిస్, రెండు పొద్దుబోవాలి. వన్ షాట్.. టూ బర్డ్స్! వాళ్ల తిప్పలు అది.
కట్ చేస్తే.. ఇక్కడొక లయన్ ఉంది. దాని పేరు కేసీఆర్! ఒక ఉద్యమపార్టీ పెట్టి, ఆ ఉద్యమ నాయకునిగా ఒక రాష్ర్టాన్ని సాధించిపెట్టిన అనుభవం ఉంది. రాష్ట్ర అవతరణ తర్వాత.. ముఖ్యమంత్రిగా ‘ఉద్యమం వేరు, రాజకీయం వేరు’ అన్న స్పష్టతతో, ఒక కొత్త రాష్ర్టాన్ని దాని అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా గత ఎనిమిదేళ్లుగా విజయవంతంగా పాలిస్తున్న అనుభవం ఉంది.
గత అరవై ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుని ఊహకు కూడా అందని అభివృద్ధి – సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, వాటి ఫలితాలు ప్రజలకు నేరుగా అందేలా చేస్తున్న రికార్డు ఉంది. నీటి విలువ తెలుసు. రైతు విలువ తెలుసు. సామాన్య ప్రజల జీవితం తెలుసు. వారి జీవితాల్లోని చీకటి వెలుగులు తెలుసు. వృద్ధుల అవసరాలు తెలుసు. వారిని పట్టించుకోవడాన్ని విస్మరిస్తున్న నేటి సమాజం తెలుసు. సమస్యల మూలాలు తెలుసు. వాటినెలా సరిదిద్దాలో తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసరమైతే కొంత తగ్గి అయినా పని సాధించుకోవడం తెలుసు. అంతేనా.. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలన్న కోరికలు ఆయనలో అసలు లేవు. తెలుగుతోపాటు హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఉంది. ‘వ్యవసాయం వ్యాపారం కాదు. ఒక జీవన విధానం’ అని చెప్పగల మేధావిత్వం ఆయన సొంతం. చాలా ఏళ్ల తర్వాత ఒక విభిన్న, సంపూర్ణ రాజకీయ నాయకుణ్ని చూస్తున్నాం. ఇలాంటి రాజకీయ నాయకుడు దేశ ప్రధాని కావడానికి ఇంకేం అర్హతలు కావాలి?
రచన: మనోహర్ చిమ్మని
పేజీలు: 210; వెల: రూ. 299
ప్రతులకు: స్వర్ణసుధ పబ్లికేషన్స్,
ఫ్లాట్ నం. 207, రామ్స్ ఎన్క్లేవ్, ఎర్రగడ్డ, హైదరాబాద్-500018.