Krithi Shetty | మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘ఉప్పెన’ పుట్టించిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి. వరుస అవకాశాలతో దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్నదీ బ్యూటీ. అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను అలరిస్తున్నది. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న బేబమ్మ తాజాగా ‘మనమే’ సినిమాతో మరోసారి సినీ ప్రేక్షకుల్ని పలకరించింది. విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో పదికాలాలు ఉండిపోవాలని కోరుకుంటున్న కృతి పంచుకున్న కబుర్లు..
ఉప్పెన సక్సెస్ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. తర్వాత నేను చేసిన వాటిలో కొన్ని సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. కానీ, ప్రేక్షకులు మాత్రం నన్నెప్పుడూ ఆదరించారు. ఒక నటిగా ఇంత పాపులారిటీ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికైతే కెరీర్ చాలా జాయ్‌ఫుల్‌గా కొనసాగుతున్నది. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందని బలంగా నమ్ముతున్నా.
ఎన్ని సినిమాల్లో నటించినా బేబమ్మగానే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బేబమ్మకు నా మనసులో ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుంది. ‘ఉప్పెన’ చేస్తున్నప్పుడు ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. యాక్చువల్‌గా నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని. చదువుకునే రోజుల్లో అనుకోకుండా మోడలింగ్‌లోకి వచ్చా. తర్వాత ‘ఉప్పెన’ చాన్స్ వచ్చింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. సినీతారగా బిజీ అయిపోయా. ఇక ఎంబీబీఎస్ చదవడం కష్టమని సైకాలజీ ఎంచుకున్నా.
కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. పాత్రల్లో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తపడుతున్నా. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే మొహం మొత్తుతుంది. నటిగా నిలదొక్కుకోవాలంటే ప్రయోగాత్మక చిత్రాలు చేయాలి. అప్పుడే నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది. ‘కృతి శెట్టి ఎలాంటి పాత్ర అయినా చేయగలదు’ అన్న పేరు తెచ్చుకోవాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నా! యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రామ్‌చరణ్‌కి చాలా పెద్ద అభిమానిని. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.
కమర్షియల్ సినిమాలు చేయడం కూడా హీరోయిన్లకు ముఖ్యమే. స్టార్ హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేసినవారే. ఆ తర్వాత డిఫరెంట్ చిత్రాల్లో నటించారు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ శ్రీదేవి కెరీర్ కూడా అలాగే సాగింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అది కమర్షియల్ మూవీ అయినా, అవుట్ ఆఫ్ ద బాక్స్ చిత్రమైనా ఎక్కడా తన మార్క్ తగ్గకుండా చూసుకున్నారు. ఆమెలా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఉంది. ఆ దిశగా నా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
నా పెండ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతానికి పనితోనే నా సహచర్యం. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నా. మరికొన్ని కథలు వింటున్నా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెండ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామి అందరినీ అర్థం చేసుకునేవాడై ఉండాలి. జాలి, దయ వంటి సద్గుణాలు కలవాడై ఉండాలని కోరుకుంటున్నా.
యాక్టింగ్ అంత ఈజీ కాదు. దాన్ని అర్థం చేసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో సిల్లీగా ట్రోల్ చేస్తుంటారు. అలాంటి కామెంట్లు చాలాసార్లు చూశాను. అవగాహన లేకుండా నోరు పారేసుకుంటే అవతలి వ్యక్తి మనసును గాయపరిచిన వాళ్లు అవుతారు. సద్విమర్శ చేయడం తప్పుకాదు. కానీ, ఎదుటివారిని కించపరిచేలా ట్రోల్ చేయడం సరికాదు. ఇలాంటి కామెంట్లకు మొదట్లో చాలా బాధేసేది. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. నా కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నా!