‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ సినిమా హిట్ కొట్టడంతో టాలీవుడ్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నది. ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచినా కియారా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. హిందీలో బిజీగా మారిపోయిన ఈ బ్యూటీ కేజీఎఫ్ ఫేమ్ యశ్‌తో కలిసి ‘టాక్సిక్’లో జతకట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టి సందడి చేస్తున్న సందర్భంగా కియారా పంచుకున్న కార్వాన్ కబుర్లివి…
మా కూతురికి మేము ఎలాంటి రూల్స్ పెట్టదలుచుకోలేదు. తను జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు మానవ సహజం. వాటినుంచే నేర్చుకుంటారు కూడా. నా విషయంలోనూ అదే జరిగింది. చివరకు సిద్ధార్థ్ రూపంలో సరైన వ్యక్తి దొరికాడు.
టాక్సిక్ షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను గర్భవతిని. ఆ విషయం తెలిశాక మూవీ టీం మొత్తం నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. హీరో యశ్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ సెట్లో నాకొక బాడీగార్డ్, బౌన్సర్లా మారిపోయాడు. వాళ్లందరి సహకారంతోనే నా పాత్రకు న్యాయం చేశాను.
నేను ‘ఎంఎస్ ధోనీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యానని చాలామంది భావిస్తారు. కానీ, నా మొదటి సినిమా ‘ఫుగ్లీ’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో నా కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో కొత్త అవకాశాల కోసం మళ్లీ మొదటినుంచి ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టాను. అందులో చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి కూడా. అయినా కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాను.
మాతృత్వం ఒక సంపూర్ణ గుర్తింపును ఇచ్చే మార్పు. అదొక కొత్త ప్రపంచం. గర్భధారణ సమయంలో మనల్ని మనం శాంతపరచుకోవడం చాలా కష్టం. దానికి చాలా సమయం పడుతుంది. నాకు
ఆరు నెలలు పట్టింది. ఆ సమయంలో అనవసర భయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించా.
టాక్సిక్ కథ విన్నప్పుడు ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. ఓ యాక్టర్ కోరుకునే ప్రతిదీ అందులో ఉంది. నా కెరీర్లో ఇలాంటి పాత్రను పోషించగలననే ఆత్మవిశ్వాసం నాకు వచ్చిందనిపించింది. మహిళలను ఒకే మూసలో ఇరికించడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ల పాత్రలు బలంగా, వాస్తవికంగా, సంక్లిష్టంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను.