సినిమాలతో పాటు టీవీ షోలు, వెబ్‌సిరీస్‌ల్లోనూ కనిపించాను. తెలుగులో ‘ఆట జూనియర్స్’, ‘డాన్స్ ఇండియా డాన్స్’ లాంటి షోలతో పాటు ‘లైవ్ టెలికాస్ట్’, ‘అరేబియా కడలి’ లాంటి వెబ్‌సిరీస్‌లలో కూడా నటించాను.
మీ అందరికి నేను కయల్ ఆనందిగానే తెలుసు. కానీ, అసలు పేరు రక్షిత. 2016లో తమిళంలో కయల్ సినిమాలో ఆనందిగా చేయడం వల్ల నా పేరు అలా స్థిరపడింది. తమిళంలో సినిమాలు చేయడం వల్ల నన్ను చాలామంది తమిళమ్మాయి అనుకుంటారు. కానీ, నేను అచ్చమైన తెలుగు అమ్మాయిని,తెలంగాణ బిడ్డని. నేను పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే!
కయల్ సినిమా నాకెంతో ప్రత్యేకం. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన చిత్రంలో నాది కీరోల్. రెండుసార్లు ఆడిషన్స్ తీసుకొని సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు నేను తమిళం కూడా నేర్చుకున్నా. ఇందులో నా నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి. 2014లో విజయ్ అవార్డుతోపాటు ఉత్తమ నటి పురస్కారానికి కూడా నామినేట్ చేశారు.
తమిళ్ మూవీస్ చేస్తున్న సమయంలోనే సోక్రటీస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆయన కో డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దల సమక్షంలో వరంగల్ వేదికగా మేం పెండ్లి చేసుకున్నాం. వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తున్నానంటే ఆయన ప్రోత్సాహం వల్లే!
తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా నాకు కథలు నచ్చకపోవడంతో చాలా సినిమాలు రిజెక్ట్ చేశా. ‘జాంబిరెడ్డి’తో రీ ఎంట్రీ ఇచ్చాను. ‘ప్రేమంటే’ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాను. ప్రస్తుతం బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా నిర్మించిన ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో కూడా నటిస్తున్నా.
నాకు అందరిలాగా సరదాగా ఉండటమంటే చాలా ఇష్టం. సెలెబ్రిటీ అనే బిరుదుకు దూరంగా ఉంటాను. ఈ మధ్య చాలా ప్రాంక్ వీడియోలు వస్తున్నాయి కదా. నేను కూడా 2023లో ‘విధి’ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రాంక్ చేశా. హైదరాబాద్‌లోనే ఆ సినిమా నటుడు రోహిత్ నందాతో కలిసి ప్రాంక్ వీడియో చేశాను.
సినిమాల్లో నటించాలనే ఇష్టంతో మొదట్లో చిన్నచిన్న అవకాశాలు వచ్చినా ఒప్పుకొన్నా. 2012 నుంచి 2014 వరకు తెలుగు సినిమాల్లో నటించినా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏదీ రాలేదు. అప్పుడే కోలీవుడ్‌లో అవకాశాలు రావడంతో 2021 వరకు అక్కడే సినిమాలు చేశాను.
చిన్నపాత్రే కదా అని వదులుకోకుండా ‘బస్‌స్టాప్’, ‘ఈరోజుల్లో’ వంటి యూత్‌ఫుల్ సినిమాలతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ కయల్ ఆనంది. కోలీవుడ్‌లో ‘కయల్’ సినిమాతో సక్సెస్ కొట్టి కయల్ ఆనందిగా పేరుపొందింది. డెబ్యూ సినిమాతోనే ఉత్తమ నటి అవార్డు పొందింది. రచ్చ గెలిచిన ఈ బ్యూటీ తర్వాత తెలుగులో వరుస విజయాలు అందుకుంది. 2021లో ‘జాంబిరెడ్డి’లో తళుక్కున మెరిసింది. తాజాగా నటుడు ప్రియదర్శితో జతకట్టి ‘ప్రేమంటే’ అర్థం చెప్పడానికి మన ముందుకొచ్చింది. ఈ వరంగల్ అమ్మాయి పంచుకున్న కబుర్లు ఇవి..