ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా జీపీఎస్‌ని ఆధారంగా చేసుకుంటున్నాం. ముఖ్యంగా విహార యాత్రల్లో జీపీఎస్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. అయితే, మనం అనుకున్న పర్యాటక ప్రాంతం పక్కనే.. ఎవరికీ తెలియని విహార కేంద్రం ఉండొచ్చు. ఎవరూ లొకేట్ చేయకపోతే.. దాని గొప్పదనం మనకు తెలియకపోవచ్చు. ఈ ఆలోచనే ఒక యువకుడికి వచ్చింది. తను ఎక్కడికి వెళ్లినా.. ఆ ప్రాంతాన్ని గూగుల్ మ్యాపింగ్‌లో అప్లోడ్ చేయడమే విధిగా పెట్టుకున్నాడు. విహారం అంటే ఆసక్తి ఉన్న ఆ యువకుడికి ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ఈ రెండింటినీ జతకలిపి గూగుల్ మ్యాపింగ్‌లో లోకల్ గైడర్‌గా ప్రస్థానం కొనసాగిస్తున్న కావలి చంద్రకాంత్‌ను బతుకమ్మ పలకరించింది..
మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకల్ మండలంలోని పెద్దమునగాలచెడు గ్రామం. ఏడో తరగతి దాకా ఊర్లోని సర్కారు బడిలో చదువుకున్నా. తర్వాత చదువులకు పట్నం వచ్చిన. బీటెక్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఫొటోగ్రఫీ మీద ఇష్టం పెంచుకున్నా. చాలామంది తాము పెంచుకుంటున్న మొక్కలను, కుక్క పిల్లను, ఇష్టమైన బైక్‌లను ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటరు కదా! నాకేమో నేను చూసిన ప్రదేశాలను క్లిక్‌మనిపించి షేర్ చేసుకోవడం అలవాటు. నాకు పర్యాటక ప్రాంతాలు చూసి రావడం అంటే చాలా సరదా! నేను చూసొచ్చిన ప్రదేశాల విశేషాలు నలుగురితో పంచుకోవడం అంటే ఇంకా సరదా! చిన్నప్పుడు బడిలో మా సార్లు విహారయాత్రల్లో భాగంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, మహానంది, యాగంటి, జూరాల డ్యాంలను చూపించడానికి మమ్మల్ని తీస్కవోయేటోళ్లు. నేను చూసొచ్చిన ఆ ప్రదేశాలను భద్రంగా దాచుకోవాలనే కోరిక ఉంటుండె. ఆ యాత్రలకు ఇంకెవలైనా పోయెటొళ్లుంటే వాళ్లకు ఆ రూట్ చెప్పాలని ఆశ పడేవాణ్ని.
ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో ఉద్యోగం చేస్తూనే వీలైనప్పుడల్లా టూర్లకు వెళ్లేవాణ్ని. అక్కడ మంచి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేవాణ్ని. ఇలా ప్రయాణిస్తున్న తరుణంలో కొన్ని తెలిసిన ప్రాంతాలకు మ్యాపింగ్ లేకపోవడం గమనించాను. చాలా ప్రత్యేకమైన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలకు కూడా సరైన మ్యాపింగ్ లేకపోవడం వల్ల ఓ పర్యాటకుడిగా ఇబ్బంది పడ్డాను. అందులోంచి పుట్టిందే మ్యాపింగ్ కాన్సెప్ట్. జీపీఎస్‌లో మ్యాపింగ్ లేని ప్రాంతాలకు వెళ్లి.. వాటికి మ్యాపింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. అలా 2017లో ప్రారంభమైన నా మ్యాపింగ్ ప్రయాణం హైదరాబాద్‌లోని ఓ చెట్టుతో ప్రారంభమైంది. ఆ చెట్టుకు చాలా పెద్ద చరిత్ర ఉందని చాలామంది చెప్పారు! కానీ, కరెక్ట్ లొకేషన్ కనిపెట్టలేకపోయారు. నిజాం కాలంలో హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు నగరవాసులకు అండగా నిలిచిన ఆ చింత చెట్టు నేటికి ఉస్మానియా దావఖానలో కనిపిస్తుంది. ఆ చెట్టును ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని గూగుల్ మ్యాపింగ్‌లో అప్లోడ్ చేశా. ఆ తరువాత మా ఊరిలోని బడి, దేవాలయాలను మ్యాపింగ్ చేశాను.
తెలిసిన ప్రంతానికి వెళ్లి ఫొటో తీసుకొని గూగుల్ మ్యాప్స్‌లో అప్లోడ్ చేసి, దాని వివరాలు నా అనుభుతులను అందులో పంచుకుంటున్నా! నేను ఇప్పటివరకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాల్లో ప్రత్యేక ప్రాంతాలు, గుడులు, కోటలు, చారిత్రక కట్టడాలు, జలాశయాలను మ్యాపింగ్ చేశాను. ఇప్పటివరకు 289 లొకేషన్లు, 23,000 ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేశాను. మన హైదరాబాద్‌లో ఉన్న టీ హబ్, గచ్చిబౌలిలోని ఐటీ హబ్‌లను మ్యాపింగ్ చేసింది నేనే. చారిత్రక కట్టడాల్లో ప్రధానంగా తెలంగాణలో కాకతీయుల కాలం నాటి ఖిలా ఘనపురం కోట దాని సమీపంలోని దేవాలయాలను కూడా మ్యాపింగ్ చేశాను. ఇవే కాకుండా చరిత్రలో నిలిచిపోయిన అనేక కట్టడాలను పర్యాటకుల చెంతకు చేర్చడమే పనిగా మన రాష్ట్రంలోని అనేక ప్రదేశాలను మ్యాపింగ్ చేస్తున్నా. వికీపీడియాలోనూ 750 ఫొటోలు పోస్ట్ చేశాను.
నా శ్రమను గూగుల్ గుర్తించింది. 2019లో రెండు తెలుగు రాష్ర్టాలకు సంబంధించి టాప్‌టెన్ మ్యాపింగ్ ఫొటోగ్రాఫర్లలో నాకు చోటిచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కాంక్లెవ్‌లో సత్కరించింది. ఆ క్షణాలు నేను ఎన్నటికి మరిచిపోలేను. నా వ్యూస్ సైతం మిలియన్లను దాటేయడంతో నా శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనిపించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో నేను తీసిన ఫొటోలతో ఎగ్జిబిషన్ నిర్వహించాను. అందరూ మ్యాఫొగ్రాఫర్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం తెలంగాణ టూరిజం విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు మ్యాపింగ్ చేసి పర్యాటకులకు చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా!
దేవరకద్ర మండలంలోని పెద్దగుట్టల్లో ఆదిమానవులు గీసిన రాతి బొమ్మలను ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందంతో కలసి కనిపెట్టాను. ఆ ప్రాంతాన్నీ మ్యాపింగ్ చేశా. నా ఫొటోలతో గమ్యం చేర్చడమే కాకుండా పలు సమస్యలు పరిష్కరించాను! మా ఊరి స్కూల్ పెచ్చులూడిపోతుంటే వాటిని ఫొటోలు తీసి మా ఊరి గ్రూప్‌లో పోస్ట్ చేశాను. ఆ ఫొటోలు చూసి స్కూల్ పునర్ నిర్మాణానికి ఒక దాత ముందుకొచ్చారు. ఇప్పటివరకు మ్యాపింగ్ చేసిన ఫొటోలన్నీ నా సెల్‌ఫోన్‌తో తీసినవే! సాధనం ఏదైతేనేం.. చేయాలనే తపన ఉండటం ముఖ్యం కదా!!