– బి. శారద, వెంకిరాల.
ఎత్తు భూమి క్షత్రియులది, పడమర పల్లం శూద్రభూమి, ఉత్తరం వాలుభూమి బ్రాహ్మణులది అని కొందరు చెబుతుంటారు. అవన్నీ దిక్కుమాలిన వాదాలు. వాటిని పక్కన పెట్టేయండి. భూమి లక్షణాలు చెప్పడానికి నాటివారు అలా సమాజంలోని తెగలతో ముడిపెట్టారు. సులభంగా అర్థం కావడానికి. అప్పటి స్థితిగతులు వేరు. నిజానికి భూమి – ఆకాశం – గాలి – నీరు – అగ్ని.. ఎవరివీ కావు. అందరివీ! అందరికీ చెందుతాయి. ఒక్కో స్థలానికి ఒక్కో విధమైన రూపురేఖలు, స్వభావాలు ఉంటాయి.
వధూవరుల ఎన్నికలో వారివారి వ్యక్తిత్వాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ, మానవ ఆకారం ఒక్కటే కదా! స్వభావాలే వారి జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. అలాగే.. భూమి స్వభావం దాని ఎత్తు పల్లాలు, రూపు రేఖలు, అక్కడ పెరిగే చెట్లు, అక్కడ జీవించే క్రిమికీటకాలు తదితర అనేక అంశాలను బట్టి, దాని భౌతిక రూపాన్ని బట్టి స్థల నిర్ణయం జరుగుతుంది. ఇదే కీలకం.. గృహానికి. మంచి లక్షణాలుగల భూమి అందరిదీ! అది ఎవరైనా వాడుకోవచ్చు. గొప్పగా జీవించవచ్చు. పనికిరానిది ఎవరికీ పనికిరాదు. ఇదే శాస్త్ర నిర్ధారణ. మీకు అనుకూల స్థలం ఎంచుకొని, మంచి గృహం మాత్రం కట్టుకోండి.. చాలు!
– కె. వాసుదేవ్, అనకాపల్లి.
సృష్టి అంతా పంచభూతాలతో జరిగింది. ఒక్కో భూతానికి (భూతం అంటే.. దయ్యం కాదు) ఒక్కో గుణంతో ప్రారంభమై, ఐదవదైన భూమికి ఐదు గుణాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.. ఇవి గుణాలు. అలా వరుసగా ఆకాశానికి ‘శబ్దం’ చేసే గుణం ఉంది. ఆకాశం అంటే పైన కనిపించే నీలాకాశమే కాదు.. ఖాళీ స్థలమంతా ఆకాశమే! అందుకే రెండు చేతులు కలిస్తే శబ్దం వస్తుంది.
అలా గాలికి శబ్ద గుణం, స్పర్శ గుణం ఉంది. అగ్నికి రూపం (కనిపిస్తుంది), శబ్దం, స్పర్శ కూడా ఉంది. అలాగే నీటికి నాలుగు గుణాలు.. శబ్దం, రూపం, స్పర్శ, రుచి అనే గుణాలు ఉన్నాయి. ఇక ఐదవదైన భూమికి ఈ నాలుగు గుణాలతోపాటు వాసన అనే గుణం కూడా ఉంది. శబ్దం అనేది మనకు వినిపించదు. విశాలమైన భూమి శబ్దం మనం వినలేము. దూరంగా వెళ్లిన రైలు శబ్దమే మనకు వినిపించదు. అలాంటిది భూమి శబ్దం వినిపిస్తుందా? ఈ పంచ భూతాలే సృష్టికి మూలం. ఇవే మన శరీరంలోనూ ఉన్నాయి. వాటిపైనే ‘వాస్తుశాస్త్రం’ ఆధారపడి ఉంది.
– డి. మల్లేశ్, కోదాడ.
మనిషికి ఆలోచనలు లేకుండా.. ఏ పనులు – ఫలితాలు లేవు. వ్యక్తి ఏది చేసినా అది అతని నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి స్వభావం అతని జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. వాస్తు ఉంటే కేవలం సుఖాలే వస్తాయి అనుకోవడం తప్పు. కష్టాలు కూడా వస్తాయి. అప్పుడు వాటికి కుంగిపోకుండా తన శక్తియుక్తులతో వాటిని అధిగమిస్తాడు. మనిషిని ఉత్తేజపరిచే పరిసరాలు, పూర్తిగా కుంగదీసే పరిసరాలు ఉంటాయి.
అదే ఇంటి లక్షణం. శ్మశానం దగ్గర్లో ఉండే గృహాల వ్యక్తులలో నైరాశ్యం, ఉదాసీనత చోటుచేసుకునే అవకాశం ఉంది. బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ల వద్ద ఉండేవారికి ‘శబ్ద దోషం’ వస్తుంది. నిగ్రహం ఉండదు. వ్యక్తి తన శక్తిని ప్రకృతి నుంచే పుచ్చుకుంటాడు. తన శరీరం ప్రకృతికి విరుద్ధంకాదు. ప్రకృతి స్వరూపం కాబట్టే.. ప్రకృతి పటిష్ఠత – వ్యక్తి పటిష్ఠత! ఇవన్నీ లోతైన అంశాలు.. శాస్త్రం లోతుల్లోకి వెళ్తేనే అర్థం అవుతాయి.
– బి. రాధ, పటాన్చెరువు.
మీ ఇంటి ప్లాను చూశాను. మీ ఇల్లు మంచి స్థానంలో.. అనగా, ఈశాన్యం బ్లాకులోనే ఉంది. కానీ, మీరు మీఇంటి ప్లానులో దోషం చేశారు. తూర్పులో ఇంటిని కట్చేసి, కొంతభాగం తూర్పును తెంపి కట్టారు. అదేవిధంగా రెండు పక్కలా.. ఇటు ఈశాన్యం, అటు ఆగ్నేయం బాల్కనీలు ఇచ్చారు. ముందు తూర్పు వైపు ఇంటిని తెంపులేకుండా, సమానంగా నిర్మాణం చేయాలి.
తూర్పు తెంపు ఉంటే.. ఇంటికి ‘తూర్పు అనే తల’ తెగిపోతుంది. అది అనేక చెడు పరిణామాలకు దారితీస్తుంది. ఈశాన్యం బ్లాకు ఫలం కూడా ఆ గృహ యజమానికి అందకుండా పోతుంది. ఇంటి తూర్పుభాగం సమం చేస్తున్న నేపథ్యంలోనే.. తూర్పువైపు బాల్కనీ కలపండి. అలాగే, ఇంటి ఫస్ట్ఫ్లోర్లోని ఆగ్నేయం బెడ్రూమ్కు ఉన్న తూర్పు ద్వారం మూసి కిటికీ పెట్టుకోండి. అలా మీ ఇల్లు శుభగృహం అవుతుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678