‘మనిషి ఏది అనుకుంటే అది చేయగలడు’ అంటారు కదా? ఇక శాస్ర్తాల మీద ఎందుకు ఆధారపడాలి? ఇండ్లు పగలగొట్టడం దేనికి?
– బి. వసంతలక్ష్మి, వర్ధన్నపేట.
Vaasthu Shastra | అవును. ‘సంకల్పం’ బలంగా ఉంటే.. తప్పక సాధిస్తామని అందరం అంటున్నాం. సాధిస్తున్నాం కూడా! అయితే, ఇందులో ప్రకృతి సూక్ష్మం ఒకటి ఉంది. ప్రకృతి, చట్టం.. దాని పర్యవేక్షణ, తోడ్పాటు కూడా తప్పక ఉంటుంది. కేవలం ఒక ఫోన్‌కాల్ పోవాలంటే.. నెట్ సరిగ్గా ఉండాలని చూస్తుంటాం. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి.. ‘ఎంతైనా, అదృష్టం ఆవగింజంతనన్నా ఉండాలిరా! అప్పుడే కలిసివస్తుంది’ అంటారు. అదే ‘నేచర్ సపోర్ట్’. కాలం కలిసిరావడం అంటే.. వ్యక్తి శక్తిమంతుడే! కానీ, ఒక డిపెండెంట్! కర్మబద్ధుడు, కాలబద్ధుడు మాత్రమే. మనిషిలోని సంకల్పం నీతిబద్ధమై, ధర్మబద్ధమై తనకు లేదా తన కుటుంబానికి లేదా సమాజానికి ఉపయోగపడే పని తప్పక సాకారం అవుతుంది.
అయితే, కోరుకున్న పనికి తాను అర్హత కలిగి ఉండాలి. అడుగడుగునా కాలం కలిసి రావాలి. అంటే, తన పనికి ప్రకృతి చట్టబద్ధత కూడా తోడై నిలవాలి. మనిషి – ప్రకృతి వేరుకాదు. ప్రకృతిలోంచే జీవుడు పుట్టాడు. విశ్వానికి – మనిషికి తేడాలేదు. గ్రహాలను ఒక క్రమపద్ధతిలో నడిపే శక్తి.. బైక్‌ని నడిపించే శక్తి.. వేరువేరు కాదు. అదే చైతన్యం! అలా, తన సంకల్ప బలానికి గృహశాస్త్ర విధానాలు దోహదపడతాయి. శక్తి ఏదో ఒక భౌతిక వస్తువు ద్వారా మనుషులకు ఉపయోగపడాలి. ఎవరూ నేరుగా గాలిలో ఎగరలేరు కదా! ఒక వాహనం తప్పక కావాలి. అది ప్రకృతి శక్తులతో, వనరులతో తయారవుతుంది.
అలాంటి విమానం మనకు ఎన్నో దూరాలను దగ్గర చేస్తుంది. అలా శక్తి – రూపం ఇల్లు. ఇంటి కొలతలో, విభజనలో, స్థలం స్వభావంలో, దాని నిర్మాణ విధానంలో ఒక సహోద్యత, స్వశక్తి వినియోగత్వం, మనో వికాసనం.. వ్యక్తిలో కలుగుతాయి. గాలివాటాన్ని బట్టి పడవ నడక ఉంటుంది. తెరచాపను సరిచేసుకుంటూ నీటిపై నడిచి గమ్యం చేరుతాం. ప్రకృతిని అనుకూలం చేసుకునే కదా.. ఎన్నో వస్తువులు సాధించుకున్నాం. అలాగే, అతి సులభంగా అందరికీ చేరువగా, ఇంటిని శాస్త్రీకరించి.. మన పెద్దలు ఇచ్చారు. ఇది ఉపయోగ పడేదే కదా! ఎందుకు ప్రతికూల భావం? చెప్పండి.
– కె. ప్రేమ్‌కుమార్, మహబూబ్‌నగర్.
మనుషులు అందరూ రూపంలో, ఒకే విధంగా ఉన్నంత మాత్రాన.. అందరూ మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా ఉండటం వీలవుతుందా? కవలలు కూడా అంతే! మనిషిని రంగు – రూపం చూసి కాదు.. తన స్వభావాన్ని చూసి అంచనాకట్టాలి. మనసు వేరు. స్వభావం వేరు. స్వభావం ఎప్పుడో బయటపడుతుంది. దానిని అనుసరించి మనసు అడుగులు వేయిస్తుంది. ఈ స్వభావాలు కవలలు అయినంత మాత్రాన ఒకటి కావాల్సిన అవసరం లేదు.
వాళ్లు ఒక ఇంట్లో పుట్టినా కూడా.. ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ల జీవితాలు వృద్ధి పొందుతాయి. ఒకరు గొప్ప ఆఫీసర్ కావచ్చు.. మరొకరు వ్యాపారి కావచ్చు. మనోగతమైన జీవితాలే కదా! మనందరివి. ఒక ఇల్లు ఒకే విధమైన ఎదుగుదల ఇస్తే.. ఒకే గర్భం నుంచి వచ్చిన సంతానం ఒకేవిధంగా ఉంటుందా? ఆలోచించండి. కన్నతల్లి గర్భవాసమే ఒకే గుణాన్ని అందివ్వలేనిది.. ఒకే ఇల్లువాళ్లు కవలలు అయినా సరే.. ఒకే విధమైన జీవనగతిని ఎందుకు ఇస్తుంది? అభిరుచులు జన్మల సంస్కారాన్ని బట్టి ఉంటాయి.
కాబట్టి, విభిన్న జీవనం ఉంటుంది. ఇద్దరు స్నేహితులవి ఒకే అభిరుచి కావచ్చు. కానీ, ఇల్లు అలా నిర్దేశించదు. నీ లక్ష్యాన్ని బట్టి నీ ఎదుగుదల ఉంటుంది. ఒకటి సత్యం.. మనిషి బాల్యాన్ని అతని గృహ వాతావరణం, పరిసరాలు తప్పకుండా ప్రభావితం చేస్తాయి. తద్వారా తన మనసు – డ్రైవ్ చేసిన దాన్ని (ఎంపికను) బట్టి జీవితం ఉంటుంది. ఇందులో నిగూఢమైనది.. తన ఆలోచనల్లో సచ్ఛీలత్వం తప్పక అవసరం అవుతుంది. శ్రమ సాధనలతో విజయం సిద్ధిస్తుంది.
– డి. జగదీష్, బోయినపల్లి.
కొందరు ఇంటి ఆవరణలోని నైరుతిలో ఎత్తుగా లెట్రిన్ పెట్టుకోవచ్చు అనుకుంటారు. అది నిజంకాదు. అలాగే, అక్కడ గొయ్యి ఉండాలని కొందరు, గొయ్యిలేని లెట్రిన్ మంచిదే అని మరికొందరు చెబుతుంటారు. విషయం.. గొయ్యిదికాదు. ఆ నైరుతి దిశలో మరుగుదొడ్డి మంచిదికాదు. మనకు వచ్చే రుతుపవనాలల్లో ఈశాన్యం – నైరుతి పవనాలు ఇంటిని కమ్ముకొని అమితంగా ప్రభావం కలిగిస్తాయి. అప్పుడు ఆ దిశల్లో లెట్రిన్లు ఉంటే.. దాని విషవాయువులు ఇంట్లోకే వచ్చి గృహాన్ని కలుషితం చేస్తాయి. అందుకే, ఆ దిశలల్లో మరుగుదొడ్లు నిషేధించారు. కాబట్టి, ఎత్తుగా కట్టినా దోషమే! సెప్టిక్‌ట్యాంక్ అనేది ఎప్పడూ లెట్రిన్ కింద ఉండకూడదు.
– సిహెచ్. శారద, గుండాల.
ఇంటికైనా, స్థలానికైనా అన్ని రోడ్లూ మంచివే! అయితే, ఆ రోడ్ల నడక మన ఇంటిని దాటి సుదూరంగా వెళ్తున్నదా? లేదా.. ఆగిపోయి ఉందా? అనేది చూడాలి. మన ఇంటికి ఉత్తర దిశలో ఆగిపోయిన రోడ్డు.. అంటే, తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి రోడ్డు ఉత్తరంవైపు నడక సాగిపోవాలి. మన ఇంటివద్దనే ఆగిపోకూడదు. అలాగే, మనం కొనే ఇల్లు ఉత్తరం ముఖంగా ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు ఉన్న రోడ్డు తూర్పువైపు వెళ్లకుండా అక్కడే ఆగిపోయి ఉన్నప్పుడు ఆ ఇండ్లు కొనడం మంచిదికాదు. అలాగే, రోడ్లు బాగా సాగే నడకతో ఉన్నా.. ఆ రోడ్లు మంచి దిశాత్మకంగా ఉన్నాయా? లేదా? అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ‘డెడ్ ఎండ్స్’ లేని రోడ్లు దిశలకు బాగుంటే.. ఇబ్బంది ఉండదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143