ఒకే మహిళ అన్నదమ్ములిద్దరినీ పెండ్లి చేసుకున్న వార్త, వాళ్ల ఫొటోలు ఇటీవల వార్తల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అట్టహాసంగా జరిగిన ఈ పెండ్లి వేడుక గురించి చదివిన చాలా మంది ఇది నిజమో కాదో అని అనుమానపడితే, మరికొందరు ఇదేం వింత అని ఆశ్చర్యపోయారు. కొన్ని చోట్ల ఒకే భర్తకు ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉన్నట్టే మన భారత దేశంలోని కొన్ని తెగల్లో ఒకే భార్యను అన్నదమ్ములు పెండ్లాడతారు. అరుదైన ఈ సంప్రదాయం వెనుక ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అంశాలెన్నో ముడిపడి ఉన్నాయి.
హిందూ పురాణాల్లో ద్రౌపది పాండవులందరికీ భార్య. ఒకరు చేసుకున్న వ్యక్తే మిగిలిన వారికీ ఆలి అవుతుంది అక్కడ. అచ్చం ఇదే విధానం పాటించే కొన్ని తెగల వారు భారతదేశంలోనే ఉన్నారు. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లోనూ, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో నివసించే హత్తి గిరిజన తెగ వారు దీన్ని తరాలుగా అనుసరిస్తున్నారు. ఇప్పుడు పెండ్లి చేసుకున్న సునీత చౌహాన్, కపిల్ నేగి, ప్రదీప్‌లు కూడా ఇదే తెగకు చెందిన వారు. తమ సంప్రదాయాన్ని ఘనంగా చాటుకోవాలన్న ఉద్దేశంతోనే మూడు రోజులపాటు అట్టహాసంగా పెండ్లి జరుపుకున్నట్టు వాళ్లు ప్రకటించుకున్నారు. ఇదే ప్రాంతంలో ఉండే ఖాసాలుగా పిలిచే మరో తెగవాళ్లతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతంలో ఉండే తోడా గిరిజనులు కూడా ఈ బహు భర్తృత్వాన్ని పాటిస్తారు. ఇంగ్లిషులో దీన్ని ఫ్రాటర్నల్ పాలియాండ్రీ… అని పిలుస్తారు. దీని ప్రకారం అన్నదమ్ముల్లో పెద్దవాడు ఏ అమ్మాయిని చేసుకుంటే ఆమె మిగతా వాళ్లందరికీ భార్య అవుతుంది. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే కాకుండా వేరు వేరు తల్లులకు పుట్టిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములూ ఇలా పెండ్లి చేసుకోవచ్చు. ఇద్దరు నుంచి నలుగురు, ఐదుగురు ఇలా సంఖ్య ఏదైనా కావచ్చు. ఇళ్లలో శుభకార్యం జరిగినప్పుడు కూడా భర్తలంతా ఆమె పక్కన కూర్చుంటారు. ఆమె పుట్టింటి వాళ్లు ఊరివాళ్లు కూడా అందరికీ సమానంగా అల్లుడి గౌరవం ఇస్తారు.
కారణాలు… చట్టాలు…
సాధారణంగా ఈ తెగలన్నింటిలో జనం ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. అక్కడ భూమిని పంచుకోవడం అన్నది సమస్యాత్మకంగా ఉంటుంది. ఎగుడు దిగుడు నేలలతో పాటు నీటి లభ్యతలోనూ తేడాలుంటాయి. దానికి తోడు పేదరికం, చిన్న భూకమతాలు ఉండే కుటుంబాలు ఎక్కువ. కాబట్టి వాటిని పంచుకోవడం సమస్యగా మారకుండా ఒక కుటుంబంలోని వాళ్లంతా ఉమ్మడిగా ఉండేందుకు ఒకే ఆలిని కట్టుకుంటారన్నమాట. భూమిని కాపాడుకోవడం కోసమే కాదు, కొండ ప్రాంతాల్లో మంది బలం ఉండటం అన్నది భద్రత పరంగా చాలా ముఖ్యం. ఒకే ఇంట్లో ఎక్కువ మంది మగవారు ఉన్నారంటే ఆ కుటుంబం ఎక్కువ బలంగా ఉన్నట్టు లెక్క. అలాగే ఒకే తల్లికి జన్మించినా, లేదా వేరు వేరు తల్లులకు చెందిన వాళ్లయినా సరే అన్నదమ్ముల మధ్య సఖ్యతను ఏర్పరచి ఉమ్మడి కుటుంబాలను నిలబెట్టడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని అక్కడి వాళ్లు నమ్ముతారు.
ఇక, ఒక్కొక్కరూ ఒక్కో అమ్మాయిని పెండ్లి చేసుకుని ఒక్కో కుటుంబాన్నీ పోషించే స్తోమత లేకపోవడంలాంటి ఆర్థికపరమైన కారణాలూ ఇక్కడ కనిపిస్తాయి. ఇక, ప్రభుత్వ పరంగా చెప్పాలంటే హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాల ప్రకారం జోడిదార్గా పిలిచే వీళ్ల వివాహాలకు గుర్తింపు ఉంది. ఆమెకు పిల్లలు పుట్టాక వాళ్లని ఒక్కో భర్త ఆ పిల్ల లేదా పిల్లాడిని తమ బిడ్డగా దత్తత తీసుకునే తరహా కార్యక్రమం చేస్తారు. దాని ఆధారంగానే సర్టిఫికెట్లలో బిడ్డకు తండ్రి పేరు రాస్తారట. పుట్టుక నుంచి చావు దాకా ఈ తెగల్లో ఇలాంటి చిత్రమైన వ్యవహారాలెన్నో ఉన్నాయి. సోషల్‌మీడియా కారణంగా ఇది నలుగురిలోకీ వచ్చింది కానీ ఈ ఆచారాలు తరాల నాటివన్నమాట!